3119* వ రోజు...........

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం!

ఎన్నికల మర్నాటి రహదారి పరిశుభ్ర చర్యలు! - @3119*

         ‘తిరిగే కాలూ, తిట్టే నోరూ అదుపులో ఉండవు’ అని వెనకటి రోజుల సామెత! మంగళవారం (14.5.24) వేకువ 4.19 కే NH 216 దగ్గర ప్రత్యక్షమైన 5 గురు రెస్క్యూ మనుషులది మళ్లీ తాజాగా ఋజువు చేశారు!

         చల్లపల్లి గ్రామం పట్ల తమ పరిశుభ్రతా నిబద్ధతా వ్యసనాన్ని అసలు వాళ్లెప్పుడూ దాచుకోనూ లేదు! ‘తాము ఐదూ – పదిమందేనా – గ్రామ పౌరులెవరైనా క్రొత్తగా వచ్చి చేతులు కలిపారా?’ అనే చింతా వాళ్ళకుండదు!

         నిన్న వెల్లువెత్తిన సార్వత్రిక ఓట్ల పండగ తర్వాత – మద్యప్రవాహమూ - ఓట్లు కొనుగోలు ప్రహసనాలూ ముగిశాక ఈ కొద్దిమంది సొంతూరి కోసం చేస్తున్న నిస్వార్థ కృషి ఎంత హాయి గొలుపుతున్నదో! అటు ఓట్లేసి దేశ ప్రజాస్వామిక బాధ్యతనూ, ఈ వేసవి ఉక్కలో గ్రామ సామాజిక కర్తవ్యాన్నీ తీర్చుకొంటున్న స్వచ్ఛ కార్యకర్తలకన్న అభివందనీయులెవరు?

కర్మిష్టులైన ఈ పంచ సంఖ్యాక రెస్క్యూ కార్యకర్తలు

- యధావిధిగా జాతీయ రహదారి దక్షిణాన – ఖాళీ వరి పొలం గట్ల బారునా పిచ్చి, చెట్ల - ముళ్ల మొక్కల పనిబట్టారు,

- ఎండు తుక్కుల్ని గుట్టలుగా పేర్చారు,

- ప్లాస్టిక్ దరిద్రాన్ని పరిష్కరించారు,

- తిరిగి పద్మాభిరామం వద్దకు చేరుకొని, తూములారి లక్ష్మణుడు వల్లించిన స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలు ప్రకటించారు!

         గతంలోనే ప్రకటించినట్లు బుధవారం నాటి వేకువ - మనం కలుసుకొనే చోటు చండ్ర వికాస కేంద్రం వద్దనే!

         అంకితులు మన చల్లపల్లికి – 91

ఉడత సాయమనుకొనేరు - ఉధృత శ్రమదానమే

కత్తి – గొర్రు - చీపుళ్లతొ కదన కుతూహలమే

కాంపౌండర్ వక్కలగడ్డ వెంకటేశ్వరుని సేవ

సామాజిక బాధ్యతకొక చక్కని ఉదాహరణమే!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త     

   14.05.2024