పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడదగునా!
3 వేల నూట ఇరవయ్యొకటవ* నాటి శ్రమదానం!
షరా మామూలుగానే గురువారం - 16.5.24 వ వేకున సైతం స్వచ్ఛ - సుందరీకరణ హక్కుదారులు తమ ప్రయత్నం తాము చేసుకుపోయారు. అందుగ్గానూ మరీ 4.16 కే - ఎనిమిదో తొమ్మిదో స్వచ్ఛ కోయిలలు కూశాయి! ఆ చప్పుళ్లు బెజవాడ వీధిలోని చండ్ర వికాస కేంద్రం వద్దా, ఆ శ్రమ విన్యాసాలు మిగిలిన వారి రాకతో ప్రభుత్వాసుపత్రి బజారులో కూడా!
ఊరి కోసం నేటి కష్టజీవులు 18+6 మంది. 6.09 నిముషాల దాకా వారి పనులన్నీ ఒక విచిత్ర – దుర్భర వాతావరణంలోనే! ఆ గంటా ఏభయ్యొక్క నిముషాలూ వాయుదేవుడూ, సూర్య భగవానుడూ కూడ బలుక్కొని ముఖం చాటేశారు.
ఇక - ఇలాంటప్పుడు చూసి తీరాలి - విజయా కాన్వెంటు – సర్వజనాస్పత్రి – నారాయణరావునగర్ త్రికోణ ప్రాంతంలో మురుక్కాల్వల్లో మరింత శుభ్రపరుస్తున్న, వీధి మార్జిన్లను రేపటి వర్షర్తువుకు గాను సమతలం చేస్తున్న రోడ్లూడుస్తున్న, పార - పలుగు పనుల్లో మునగున్న, వీధి మొత్తాన్ని ప్లాస్టిక్ సంచుల - మద్యం సీసరహితం చేస్తున్న ఆ 8-9 మంది కష్టాన్ని!
ఇటు విజయవాడ రహదారిలో పనిచేస్తున్న 14-15 మందీ అంతే! కోమలానగర్లోని మిల్లు ఎదుటా, పరిమితంగా 2 వీధుల్లో, వాటి మురుగు కాల్వల్లో శ్రమించే వాళ్ళు శ్రమిస్తూనే ఉన్నారు. రోడ్డు పడమరగా ఒకానొక బుద్ధిజీవిచే దురాక్రమిత మార్జిన్ స్థలాన్నీ, బంకు దాక డ్రైన్ కశ్మలాల్నీ కత్తుల్తో శిక్షించి, ట్రాన్స్ఫార్మర్ల క్రింది భాగాన్ని కూడ శుభ్రపరచిన అ విశ్రాంత కార్యకర్తలకూ, NTR పార్కు దాక తూర్పు దిక్కున పాటుబడిన కర్మిష్టులకూ జోహార్లు!
ఒక ముఖ్య శ్రమ వీరుని గైర్హాజరీ వల్ల 6 వ నంబరు పంట కాల్వ వద్ద ఈ పూట జరగవలసిన బరువు పని ఆగింది. బహుశా రేపే అతగాడు ఆ బాకీ తీర్చేస్తాడేమో చూడాలి!
చండ్ర వికాస కేంద్రం సాక్షిగా నూతక్కి శివబాబు ముమ్మారు ధ్యనించిన గ్రామ స్వచ్ఛ సుందర నినాదాలూ, DRK డాక్టర్ గారి సమీక్షా సంగతులూ,
రేపటి వేకువ పెట్రోలు బంకు వద్ద కలుసుకోవాలనే నిర్ణయమూ!
అంకితులు మన చల్లపల్లికి – 94
శివరామపురీయుడైన శివరామకృష్ణ మహాశయుడు
శ్రమదానపు సకల పనులు క్రమం తప్పకుండ చేయు –
ఆర్థిక తోడ్పాటు కూడ అవసరానికందజేయు
వయోధికుడు - సామాజిక ప్రయోజకుడు - ఆదర్శుడు!
- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
16.05.2024