పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడదగునా!
శనివారం నాటిది 3123* వ ప్రయత్నం!
18.5.24 వేకువ వేళనే - అంటే 4.17 కే నడకుదురు రోడ్డు దగ్గరి ఇంధన నిలయం వద్ద పారిశుద్ధ్య చర్యలకు సిద్ధపడిన 10 మందినీ గమనించారా? ఇక అక్కడి నుండీ నిముష క్రమంలో వచ్చి, చేతొడుగులు ధరించి, పార, డిప్ప, పలుగు, కత్తి, దంతె వంటి సమర పరికరాలతో పనిలో దిగింది మరో 16 మంది!
ఈ పాతికకు పైగా కార్యకర్తలు 3 భాగాలుగా విడిపోయి, ఎక్కువ మంది బెజవాడ రోడ్డులో ½ కిలోమీటరు దూరంగానూ, కొద్దిమంది ప్రభుత్వాసుపత్రి వీధిలోనూ పనికి దిగితే, 5 గురు మాత్రం NTR పార్కు ఎదుటి లోతైన – గడ్డి మూసేసిన - ఘాటు కంపు వెదజల్లుతున్న డ్రైను దగ్గరా కుదురుకొన్నారు.
ముందుగా పంట కాల్వ దగ్గరి రోడ్ల గుంటల్ని పూడ్చినది పరిశీలిస్తే - అక్కడ మట్టి డిప్పలు మోసి, నారాయణరావునగర్ వీధి ప్రక్క గుంటను పూడుస్తున్న డాక్టరమ్మా, చెత్త బండి తోలుతున్న కాస్త వయసు మళ్లిన పెద్ద డాక్టరయ్యా కనిపిస్తారు.
అంతకు ముందే – కార్ల షెడ్డు దాక చెత్త కుప్పలెత్తి ట్రాక్టర్లో వేస్తున్న అరేడుగుర్నీ, రోడ్డు మార్జిన్లలో రాతిముక్కలేరి, వంతెన దగ్గరి గుంటలో నింపుతున్న ముగ్గుర్నీ గమనించవచ్చు; అక్కడికి దూరంగా పనస -తదితర పండ్ల వ్యర్ధాల గోనె సంచుల్ని మోసి, ట్రక్కులో కెక్కిస్తున్న ఇద్దరి పనినీ దర్శించవచ్చు!
పని వేళ ముగిసే 6.08 నిముషాలకు పార్కు వెలుపల మురుగు కాల్వ కొంతవరకు బాగుపడింది! ఐతే -నడక, ఇతర వ్యాయామాల నిమిత్తం పార్కుకు వచ్చి - వెళ్లే వాళ్లు స్వచ్ఛ కార్యకర్తల కష్టం పట్ల ఆసక్తి చూపనేలేదు!
పైకి చూస్తే నేటి వాతావరణం శ్రమదాన పనులకనుకూలంగా, చల్లగా ఉందనిపించినా, ఆ దొంగ - ఉక్క - వాతావరణంతో చాలమంది కార్యకర్తల బట్టలు చెమటలు పీల్చుకుని, ఒంటికతుక్కుపోయి కనిపించాయి!
పెట్రోలు బంకు ఆవరణలో 6.20 కి అందరూ సమైక్య కంఠాలతో - గ్రామ సర్పంచమ్మ గారి స్వచ్ఛ - సౌందర్య సాధక నినాదాలకు స్పందించారు.
సశేషమైన బెజవాడ రోడ్డు పరిశుభ్ర/సుందరీకరణ/భద్రతా విధులకై ఆదివారం వేకువ కూడ మనం కలిసి శ్రమించవలసింది NTR పార్కు వద్ద నుండే!
వేముల సీతామహాలక్ష్మి గారు హిందూ శ్మశాన వాటిక కోసం ఇచ్చిన 2000/- విరాళం కృతజ్ఞతలతో స్వీకరించడమైనది.
అంకితులు మన చల్లపల్లికి – 96
తొలి దినాల కార్యకర్త తుమ్మల మధుసూదనుడు
తన వంతుగ ఊరికి శ్రమదానంలో వెరవడు
రామానగరం నివాసి - ఉపాధ్యాయ మిత్రుడు
ప్రస్తుతానికైతే తన గృహానికే పరిమితుడు!
- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
18.05.2024