పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల?
అబ్బురమైన వీధి పారిశుద్ధ్య శ్రమదానంలో 3134* వ రోజు
బుధవారం వేకువ మరీ 4.13 కే ఆ దానం మొదలైనది బెజవాడ రోడ్డులోని ప్రజా పరిషత్ కార్యాలయం వద్దనే గాని – విస్తరించినది కిలోమీటరు బారునా! పాల్గొన్నది 20-1 మందే గాని పని జరిగింది పాతిక మంది పెట్టునా!
స్వచ్చ కర్మలు జరిగినది ప్రశాంతంగానే గాని, వాతావరణం దుర్భరంగానే! ఈ “దుర్భరం” లాంటి పదప్రయోగం కేవలం నాదే తప్ప - ఏళ్ల తరబడీ ఒకానొక స్థిత ప్రజ్ఞతో నిష్కామ - నిర్వికార పారిశుద్ధ్య శ్రమదాన నిర్వాహకులది కానేకాదు!
ఉక్కపోతలైనా - చలిగాలులైనా తమ ఊరిని ఏకాస్తయినా ఏరోజుకారోజు మెరుగుపరచాలనే లక్ష్యంతో శ్రమదానం చేస్తున్న స్వచ్చ కార్యకర్తల వైఖరిలో ఏమార్పూ ఉండడం లేదు!
కావాలంటే :
1) MDO కార్యాలయం ఎదుటి డ్రైనులోనూ, గట్టు మీదా కత్తులతో, దంతెలతో పారిశుద్ధ్య ప్రగతి సాధిస్తున్న బడి పంతుళ్లనూ, గృహిణులనూ, విశ్రాంత పెన్షనర్లనూ చూడండి.
2) MRO కార్యాలయం దాక మరొకమారు శుభ్రపరుస్తున్న రైతుల్నీ, ఒకరిద్దరు కార్యకర్తల్నీ గమనించండి!
3) విద్యుత్ ఉపకేంద్రం ఎదుట నలుగురూ విద్యుత్తీగల్లో దూరుతున్న ఎన్ని కొమ్మల్ని ఖండించారో - డ్రైను వ్యర్ధాల్ని ఎలా తొలగిస్తున్నారో పరిశీలించండి!
4) అక్కడికి ½ కిలోమీటరు ఉత్తరాన మొదలుపెట్టి, లోడింగు వీరులు నలుగురు ఎంత ఉత్సాహంగా పనిచేయకపోతే – అంత పెద్ద ట్రక్కూ పైకల్లా నిండిపోయింది?
కార్యకర్తల ఆలోచనేమంటే : “పని అలస్యమైనా క్షుణ్ణంగా జరగాలి, వాళ్లకి తృప్తికరంగా ఉండాలి?”
MDO ఆఫీసు ఆవరణలో జరిగిన తుది సమావేశంలో ఒక సిమెంటు/నాపరాళ్ల లారీ చోదకుడు సిమెంటు రంగు చొక్కా – పంట్లాంతో నినదించడం చూసే ఉంటారు - నంద్యాల వ్యక్తట - నేటి పారిశుద్ధ్య కారక్రమాన్ని పరిశీలించాడట – నేటి నినాదాలు పలికింది ఆకుల దుర్గాప్రసాదు.
రేపటి వేకువ మనం కలుసుకొనే చోటులో మార్పు - బైపాసు రోడ్డు చివర HDFC బ్యాంకు వద్ద!
సశేషం
ఈ నూటారుగురె కాదు ఇంకొందరు మతిమంతులు –
తమ గ్రామం సుఖదాతలు – ధన్యులు - సేవా మూర్తులు
మరొక మారు వారి గూర్చి మనసారా వ్రాయగలను
ప్రస్తుత మిప్పటికైతే - ఇంతే సంగతులందును!
- నల్లూరి రామారావు
29.05.2024