3136* వ రోజు....... ....

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల?

3136* వ నాటి స్వచ్ఛ సుందరోద్యమ శ్రమదాన కార్యక్రమాలు 

         ది. 31.05.2024 శుక్రవారం నాటి వేకువ జామున 4:20 సమాయన ఉన్నది 5 గురు శ్రామికులే అయినప్పటికీ సమయం గడిచిన కొద్దీ మరికొంతమంది చేరి బైపాస్ రోడ్ మొదటి నుండి రోడ్డు ప్రక్కన స్వచ్ఛ కార్యకర్తలు ఏర్పరచిన ఉద్యానవనంలో మొక్కల చుట్టూ బాగుచేయడం, పిచ్చి మొక్కలను, దుబ్బు గడ్డిని లేకుండా చేసే పనిలో ఉష్ణమయమై వాతావరణం ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా తమ లక్ష్య సాధనలో ఉక్కపోతను సైతం లెక్క చేయక వారు చెమటతో తడిసి ముద్దయి, పూల మొక్కలకు మాత్రం గాలి వెలుతురును ప్రసాదించారు. అదీ స్వచ్ఛ కార్యకర్తల త్యాగమంటే.

         ఊరి జనం కలిసి రావట్లేదని పట్టించుకోకుండా చల్లపల్లి గ్రామ పరిసరాల పరిశుభ్రతను కాపాడే పనిలో అపరిశుభ్రతను రూపుమాపడానికి దశాబ్ద కాలపు శ్రమజీవులైన ఈ కార్యకర్తల కష్టాన్ని వర్ణించతరమా.

         పని పూర్తి చేసే సమయానికి కొంచెం దగ్గరలో మంచి నీటి పైపు లైను తవ్వి వదిలేసిన మట్టిని సరిచేసి పాదచారులకు సౌకర్యవంతంగా మట్టిని సర్దడం కూడా మా బాధ్యత గానే భావించిన స్వచ్ఛ కార్యకర్తలు 6.05 నిమిషాలకు 18 మంది కార్యకర్తలు పని ముగించుకుని గాని కాఫీ సేవించిన పిదప 6.15 నిమిషాలకు జరిగిన సమీక్షలో మెండు శ్రీనివాస్ నినదించిన స్వచ్ఛ నినాదాలు మార్మోగగా స్వచ్ఛ రధసారధి డాక్టరు గారు మాట్లాడుతూ గత కాలపు బైపాస్ రోడ్డు తీరు-తెన్నూ గుర్తొకొచ్చిన కబుర్లతో రేపటి శ్రమదాన ప్రదేశాన్ని HDFC వద్దనే కలవాలని ప్రకటించి అందరూ నిష్క్రమించారు.

 

గ్రామంలో చెత్తా చెదారం – కనిపించని కాలమెప్పుడో

అడుగడుగున స్వచ్ఛ-శుభ్రతల ఆనంద వికాసమెన్నడో

ప్రతి పౌరుడూ ఊరి బాధ్యతలు పాటించు ముహూర్తమెన్నడో....

- నందేటి శ్రీనివాసరావు

   స్వచ్ఛ కార్యకర్త

   31.05.2024