3137* వ రోజు....... ....

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల?

నేటితో పని రోజుల సంఖ్య - 3137*

         వారాంతపు అంచనాలను ఋజువు చేస్తూ - ఈ శనివారం వేకువ గ్రామ బాధ్యుల సంఖ్య - 6.20 సమయంలో 30 కి ప్రాకింది. ఈ 30 మందిలో డాక్టర్లు మొదలు - పంతుళ్లూ, గృహిణులూ, ట్రస్టు పని వాళ్ళూ, వృద్ధులనబడే పింఛనుదారులూ చిరుద్యోగినీ ఉద్యోగులూ, రైతులూ, వ్యాపారులూ ఉన్నారు. ఉంటే ఉన్నారు గాని – అసలు వీళ్లొచ్చింది దేనికి?

         ఈ కాలంలో ఎక్కడైనా - ఓట్లకు డబ్బులు పంచుతుంటేనో, ఉచిత వైద్యశిబిరాలంటేనో, డబ్బులూ - బిర్యానీలూ - క్వార్టర్ మద్యాలూ పంచి రవాణా చేసే సభలకో జనం - అదేదో తమ హక్కుగా - ఆబగా గుమికూడతారట! మరి ఇదేమిటి? - ఏదో స్వచ్ఛ సుందరోద్యమమట! – అక్కడ ఏ పప్పు బెల్లాలూ పంచడమో కాదు – మురుగు కాల్వల పనులూ, ఎంగిలి విస్తరాకులూ ఖాళీ మద్యం సీసాలేరే చేష్టలూ, అందంగా – పచ్చగా ఉన్న రహదారి ఉద్యానాల్ని సుందరీకరించే కూలీ నాలీ గిట్టని అమర్యాదకర పనులు!

         ఈ ట్రాక్టర్ల, పనిముట్ల, నీళ్ల టాంకర్ల, వీడ్కోలు వాహనాల ఖర్చుల్ని ఏ ప్రభుత్వ వ్యవస్థో ఆదుకోదు - అప్పుడప్పుడూ కొందరు ఉదారులు తప్ప - కార్యకర్తలే భరిస్తుంటారు!

         అందుకే ఇలాంటి స్వచ్ఛ - సుందర - శ్రమదానోద్యమం మనకు తెలిసినంత వరకూ దేశంలో ఎక్కడా కనపడనిది!

“అంతములేని ఈ భువనమంత పురాతన పాంథశాల, వి

శ్రాంతి గృహంబు - అందు ఇరుసంజలు రంగుల వాకిళుల్, ధరా

కాంతులు – పాదుషాలు - బహరామ్ జమిషీడులు వేనవేలుగా

కొంత సుఖించిపోయి రెటకో - పెరవారికి చోటొ సంగుచున్!”

         అని 1200 ఏళ్ల నాటి ఓమర్ ఖయ్యాం (అనువాదం: దువ్వూరి రామిరెడ్డి) వేదాంతీకరించినట్లే - ఈ దశాబ్దకాల శ్రమదానోద్యమంలో కూడ – ఏ రెండు మూడు వందలమందో పాల్గొన్నారు, ప్రస్తుతానికి ప్రతి వేకువా పాతికమైందైనా తరిస్తున్నారు!

1) HDFC బ్యాంకు అవరణను మరింత మెరుగుపరచిన 12 చేతులూ,

2) R & B బంగళా, వ్యవసాయ కార్యాలయాలను గోడలెక్కి కూడ శుభ్రపరచిన 20 హస్తాలూ –

3) మురుగునుదేవిన, తుక్కులూడ్చిన, ట్రాక్టర్లో కెత్తిన పది - పన్నెండు చేతులూ –

4) ముఖ్యంగా - అప్పటి దాక పరమ మురికి పనులు చేసి, అర్జెంటుగా ఆస్పత్రికిపోయి శస్త్ర చికిత్సలు చేసి వచ్చిన 4 సున్నిత హస్తాలే – నా దృష్టిలో పుణ్య హస్తాలు!

         ఈ జూన్ మాసారంభపు సమీక్షాకాలంలో క్రొత్తక్రొత్తగా నినాదాలు పలికిన ఉపాధ్యాయుడు సైకం వరప్రసాద్, మెరకనపల్లి సచివాలయోద్యోగి నడకుదుటి గంగరాజు శ్లాఘనీయులు!

         రేపటి వేకువ మనం కలువదగిన చోటు విజయవాడ రోడ్డులోని శ్రీమంతు క్లబ్బు వద్ద.

         కలిగేదా మోక్షం?

కష్టాలకు భయపడినా, నష్టాలకు వెనుకాడిన

గాయాలకు బెదిరిననూ, స్వేదాలకు జడిసిననూ

కదిలేనా గ్రామం - కలిగేదా సౌఖ్యం!

గ్రామంలో సమస్యలకు వచ్చేదా మోక్షం?

- నల్లూరి రామారావు

   01.06.2024