3139* వ రోజు....... ....

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల?

చల్లపల్లి శ్రమదానం వేడుక చూతము రారండి! - @3139*

          సోమవారం కనుక ఆ వేడుక రెస్క్యూ కార్యకర్తలది, అది కూడ కేవలం 3+3 = 6 గురిది! అది

1) బందరు జా.ర.దా.కీ

2) గంగులవారిపాలెం రోడ్డుకీ రెండున్నర కిలోమీటర్ల ప్రాంతానికే పరిమితమైనదే!

          తొలుత గస్తీ గది వద్ద 4.20 కే మొదలై, 6.10 కి కాబోలు ముగిసినది! ఐదారుగురు గ్రామ స్వచ్ఛ - శుభ్ర సౌందర్య వ్యసనపరులూ, వాళ్లకు తోడొక ట్రాక్టరూ, ఒక స్కూటరూ, రోడ్డు మరమ్మత్తుకు అవసరమైన పార, పలుగు, డిప్పలూ ముందుగా జాతీయ రహదారి మీద హాజరు!

          అక్కడెవరో వదిలేసిన - వారాల తరబడీ ఎవరూ పట్టించుకోని రద్దూ, దాని మూలంగా రహదారి సౌందర్యానికి లోపమూ! ఇటు రహదారి అందమూ మెరుగవ్వాలి - అటు గంగులవారిపాలెం వీధి మార్జిన్ గుంటలు పూడి, రోడ్డు మన్నికా పెరగాలిఅనే ఉభయతారక ఆశయంతో కార్యకర్తలు చేసిన కష్టం ఫలించింది. రెండు మూడొందల గజాల బారునా వీధి మార్జిన్లు బలపడినవి!

          ముఖ్యంగా కొలిం మేస్త్రీ అనబడే దాసరి పూర్ణచంద్రరావు గారి పాల ఉత్పత్తి కేంద్రం దగ్గరా, బండ్రేవు కోడు కాలువ దగ్గరి మలుపులోనూ ఈ రోడ్డు ఇంకొన్నేళ్లు భద్రంగా ఉంటుందనే నమ్మకం కలిగింది! ఆ మాత్రం తృప్తి చాలు స్వచ్ఛ కార్యకర్తలకి!

          ఈ 6 గురు వాలంటీర్దూ పద్మాభిరామం ఎదుట నిలబడి 6.20 సమయంలో తాము ప్రతినిత్యమూ వల్లించే స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలను కస్తూరి శ్రీను నాయకత్వంలో పునరుద్ఘాటించారు!

          కలిసొచ్చే కాలానికి

వెదకుతున్న ఔషధలత కాలికడ్డు తగిలినట్లు

కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకుల వలె -

అదృష్టం జీడి పాకమై తగులుకు వదలనట్లు

ఈ స్వచ్ఛోద్యమ కారులు ఈ ఊరికి దొరికినట్లే!

- నల్లూరి రామారావు

   03.06.2024