పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?
ఇవన్నీ 3145* వ నాటి రెస్క్యూ చర్యలు!
సోమవారం వేకువ 4.22 కు మొదలైన ఆ పనులు యధాప్రకారం 6.00 కు ముగిసి, 6.15 కు గంగులవారిపాలెం వీధిలోనే స్వచ్ఛ - సుందరీకరణ నినాదాలతో ముగిసింది. కార్యకర్తల సంఖ్య కూడ బక్కచిక్కింది. ఒక కోళ్ల ఫారం తాలూకు ఉద్యోగి ఇల్లాలికి కంటి శస్త్రచికిత్స కారణంగా రాలేదు. (పాపం పని వ్యసనపరుడు – మానినందుకెంత బాధపడుతున్నాడో!)
ముందుగా నలుగురు గస్తీ గది వద్ద నుండి 2 కిలోమీటర్ల దూరంలోని - P.K. పల్లి బాట దగ్గరి జాతీయ రహదారిని చేరుకొన్నారు. అక్కడొక రద్దు గుట్ట వీళ్ల కోసం ఎదురుచూస్తున్నది. ఆ గుట్టలో కొంత ట్రాక్టర్ లో కెత్తుకొని, అవసరమైన మరొక రోడ్డు భద్రత కోసం తరలించుకుపోయే చేతివాటమన్నమాట!
వాట్సప్ పాటోలోనే జరిగిన పని వివరాలున్నవి చూడండి - ఒక వీరుడు గడ్డ పలుగుతో త్రవ్వడమూ, ఇంకొకాయన పారతో డిప్పల్నింపడమూ, మరొక శూరుడు డిప్పలు మోసి - ట్రక్కు నింపడమూ! (మరి – కార్యకర్తల బట్టలు చెమటతో ఆ రద్దు ధూళి కలిసి, పేస్టుగా మారకేం చేస్తుంది?)
మళ్లీ వాళ్ళు వెనక్కి వచ్చి, గంగులవారిపాలెం రోడ్డు రక్షణగా రాతి – ఇసుక - మట్టి మిశ్రాన్ని దింపి, సర్దిన వైనమూ! మరో ఇద్దరు పాదచార కార్యకర్తలం అప్పటికి వాళ్లతో చేరడమూ! చివరగా బృందావనుడు ఉచ్ఛరించిన శ్రమదాన నినాదాలూ!
నేటి రెస్క్యూ టీమ్ సభ్యుల్లో ఒక పొడగరికి ఇటీవల వచ్చిన కష్టమేమంటే - తనకు కడుపు నొప్పో, కాలునొప్పో, అధవా వ్రేలు నొప్పో వస్తూనే ఉంటున్నదట - ఐనా ఏ ఒక్కనాడూ అతగాడే బరువు పన్లూ మానినట్లు నా దృష్టికి రాలేదు!
వీధి అర్చక శాస్త్రవేత్తలు
చల్లపల్లికి వీధి అర్చక శాస్త్రవేత్తలు దొరికినారో –
సొంత ఊరికి స్వచ్ఛ - సుందర శిల్ప కళ సమకూర్చినారో –
మురుగుకంపుల వికారాలకు మోక్షమును చేకూర్చినారో –
అన్ని ఊళ్ళకు ఉదాహరణగ మాతృభూమిని మలచినారో!
- నల్లూరి రామారావు
10.06.2024