3152* వ రోజు....... ....

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి రాగల ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?

3152*న నాటివి రెస్క్యూ టీమ్ పనులు!

         ఇది 17.06.2024 - సోమవారం! ఇది A.P. సి. యం గారికి పోలవారమైతే చల్లపల్లికి స్పచ్ఛ కార్యకర్తల్లో కొందరికి వీధి రెస్క్యూవారం! అంచేత వాళ్లు గంగులవారిపాలెం వీధి మొదటి గస్తీ గది వద్దకు 4.20 కే చేరుకొన్నారు. అక్కణ్ణుంచి 6.10 దాక “ఏ పన్లో మునిగిపోతిరి? ఏమి సాధించిరి?” అని ఆరాతీయగా....

         అసలీ తొలి నిముషాల కార్యకర్తలు నలుగురే. రాన్రానూ ఎనిమిదిగా మారారు. ముందుగా వాళ్లు చేయాలని నిర్ణయించుకొన్నది రోడ్డు కిరుప్రక్కలా చెట్ల సుందరీకరణమేగాని, ఆస్పత్రి ఎదుటి, స్వర్ణ మోహనాంతర్గత ఆమ్ర ఫల వృక్ష శాఖా ఖండనకు దిగవలసి వచ్చింది.  

         ఏపుగా పెరిగిన ఆ చెట్టేమో చాల ఎత్తు, దాని కొమ్మలేమో అదుపాజ్ఞల్లో ఉండక ప్రక్క వారి ఇంటి ఆవరణలో ప్రవేశించినవి. సదరు కొమ్మల సంస్కరణమే నేటి రెస్క్యూ టీమ్ పని!

         “స్వర్ణ మోహనంలో మామిడి కొమ్మల కత్తిరింపు” అని శంకర శాస్త్రి గారు సింపుల్ గా తేల్చేశారు గాని,

- బారైన నిచ్చెన చివరి మెట్ల మీద నిలబడి ఒకరు పెద్ద కొమ్మల్ని మరరంపంతో కోస్తుంటేనూ, చిన్న కొమ్మల్ని కత్తుల్తో నరుకుతుంటేనూ,

- బరువైన కొమ్మలకి మోకులు కట్టి ఇద్దరు దించుతుంటేనూ,

- క్రిందకు దిగిన కొమ్మల్ని ముక్కలుగా నరికి, ఇద్దరు ట్రక్కులోకి చేరుస్తుంటేనూ,

- రాలిన ఆకుల్ని ఇద్దరు చీపుళ్లతో  ఊడ్చి శుభ్రం చేస్తుంటేనూ....  

         ఈ పనులెంత కష్టమో - ఇవి చేయకుంటే వీధి పొందికకెంత నష్టమో - వీళ్లని రెస్క్యూ టీం అని పిలవడం ఎందుకు సమంజసమో నాకు తెలిసొచ్చింది.

         పనులు ముగించాక ఈ 7 గురూ పని చోటు దగ్గరనే తాతినేని వేంకటరమణుని సారధ్యంలో స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలు చేసి ఇంటికెళ్లారు!

         మన గ్రామం ప్రత్యేకత!

వీధి పారిశుద్ధ్య క్రియ అదృష్టముగ భావించే –

గ్రామ వైభవ ప్రక్రియ కర్తవ్యంగా తలచే –

అవలీలగ లక్షలాది పని గంటలు కష్టించే –

కార్యకర్తలుండుటె మన గ్రామం ప్రత్యేకత!

- నల్లూరి రామారావు

  17.06.2024