3155* వ రోజు....... ....

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి రాగల ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?

గ్రామ సామాజికాభ్యుదయ కృషి పరంపర! - @3155*

         అది గురువారం నాటిది (20-6-2024) – అది 23+3 గ్గురి శరీర + మేధో శ్రమ! ఇప్పటికి 9 రోజులుగా 1 వ వార్డుకు చెందిన బాలికల వసతి గృహ ప్రాంతానిది! అర కిలోమీటరు వీధి బాగుపడ్డాక హిందూ శ్మశానవాటిక వీధిలోని జమ్మిలంకమ్మ గుడి ప్రాంతంలోని రకరకాల పారిశుద్ధ్య ప్రక్రియలవి!

         అక్కడ వంగి పనిచేస్తున్న కార్యకర్తలు కొందరు 9 దేళ్ళ నాడు ఎంత దుర్భర పరిస్థితుల్లో ఇక్కడ శుభ్రం చేశారో గుర్తుచేసుకొన్నారు. 22 మందీ 3 గ్రూపులుగా విడిపోయి,

- ఒక చిన్న గట్టి ముఠా అశోక్ నగర్ 2 వ వీధి దగ్గర పంచాయతీ వారో - కేంద్ర త్రాగు నీటి శాఖవారో త్రవ్వేసి వదిలేసిన 2 గుంటల్ని పూడ్చే పనిని విజయవంతంగా నిర్వహించారు. ఎన్ని నెలలుగా ఆ గుంటలు జనుల రాకపోకలకు ప్రమాదకరంగా ఉన్నవో తెలుసా?

- ఇంకో చిన్న బృందం నిన్నటి దాక పని జరిగిన రహదారి తుది మెరుగులకు ప్రయత్నించింది.

- ఎక్కువ మంది శ్రమ - దీక్ష దఖలు పడింది మాత్రం లోతైన - ఘాటైన కంపుగొట్టే మురుగుగుంట పడమటి ప్రాంతంలోనే! అక్కడ దొరికిన నిధి నిక్షేపాలేవంటే - పిచ్చి, ముళ్ళ మొక్కలుగాని, స్థలాల్లోని ప్లాస్టిక్ తుక్కులు గాని, గడ్డి గాని, ప్రక్క స్థలాల్లోని చెత్తా చెదారాలు గాని - ఒక ట్రాక్టర్ నిండుగా! ఈ తుక్కంతా మధ్యాహ్నం లోపుగా షెడ్డర్ పాలిటబడి, పాడిగా మారి, ఎరువుగా రూపాంతరం చెందుతుంది!

         వేల రోజులుగా కార్యకర్తలు శ్రమిస్తున్నా వీధి సౌందర్య భంగకారులు గాని, మళ్లీ మళ్లీ సహనంతో బాగుచేస్తున్న శ్రమదాతలగాని, ఎవరికీ విసుగే లేదు!

         ఇక్కడ పని ముగిసినా, అశోక్ నగర్ గుంటలు పూడ్చిన వారి ఆలస్యం వల్ల - 6.30 కి జరిగిన సమీక్షా సభలో :

- ఈ రోజుల్లో గూడ ఇంకా మనుషుల్లో మిగిలిన కృతజ్ఞతా స్యభావమూ, గురవయ్య గారు ప్రకటించిన ఉద్యమ నినాదాలూ, సూక్తులూ, రేపటి కార్యరంగం విజయవాడ బాటలోని NTR పార్క్ ప్రాంతమనీ ప్రస్తావనకొచ్చాయి!

         ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా రేపు ఉదయం 5.30 నిమిషాలకు NTR పార్క్ లో జరిగే ‘మహా ప్రదర్శన’కు కార్యకర్తలందరం ఏకరూప దుస్తులలో హాజరవుదాం.

         కాకపోదు ప్రముఖం!

దేశ చరితలో పదేళ్లు పెద్ద సంఖ్య కాకున్నా

మనిషి బ్రతుకులో దశాబ్ది మాత్రం పెద్దదే గదా!

ఊరి మేలుకై శ్రమించు ఉద్యమకారుల సంగతి

గ్రామ - రాష్ట్ర చరిత్రలో కాకపోదు ప్రముఖం!

- నల్లూరి రామారావు

 

  20.06.2024