పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి రాగల ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?
3156* వ నాటి స్వచ్ఛ కార్యరంగంలో మార్పు!
శుక్రవారం వేకువ బైపాస్ వీధి నుండి కార్యకర్తల కార్యరంగం బెజవాడ వీధిలోని NTR పార్కు వద్దకు మారింది. కారణం – ‘ప్రపంచ యోగా దిన’ సందర్భంగా అక్కడ జరుగుతున్న యోగా ప్రదర్శన! అది 5.30 – 7.30 నడుమ నూటపాతిక మంది అభ్యాసకులతో - లంకపల్లికి చెందిన శ్రీనివాస గురూజీ ఆధ్వర్యంలో!
వేకువ 4.26 నుండి 5.35 దాక పెట్రోలు బంకు పరిసరాల్లో 26 మంది శ్రమించడం షరామాములుగానే జరిగింది. నలుగురైదుగురు మహిళలు 3-4 రోజుల్లో అక్కడి దుకాణాల మూలంగానూ, తినుబండారాల బళ్ల వల్లనూ, టీ అంగళ్ళ ఫలితంగానూ వచ్చిన ఆకుల్నీ, పొట్లాల్నీ, దుమ్మూ - ఇసుకల్నీ ఊడ్వడమొకటీ;
అడపాదడపా వానల్తో పార్కు వెలుపల - మురుగుకాల్వ గట్ల మీద మళ్ళీ పెరిగిన గడ్డినీ, చేరిన ప్లాస్టిక్ తుక్కునూ ఏడెనిమిది మంది కత్తుల - దంతెల - డిప్పల వారు శుభ్రపరచడాన్నీ;
గంగరావీ తదితర చెట్ల కొమ్మల్ని డ్రైను వెలుపలి గట్టు మీద నాటిన సంగతినీ,
- అటు పార్కులోకి మళ్లిన పాదచార బృందమూ, ఇటు యోగా సాధనకు విచ్చేసిన సాధకుల సందోహమూ వీక్షించాయి!
పార్కు లోపలి కాలిబాటా, ఇతర భాగాల్లో ఏ లోపమూ లేదు - సాధ్యమైనంత శుభ్రంగా ఉన్నవి - కాకపోతే అక్కడక్కడ అర్థం – పర్ధం లేని మొక్కలూ, గడ్డీ పెరగడాన్ని సహించలేక నలుగురైదుగురు కార్యకర్తలు గంటకు పైగా ఒళ్ళొంచి, ఆ చిరు లోపాల్ని సరిదిద్దారు!
సొంత పని మీద వెళ్తూ కూడ – ఏ రోడ్డెలా ఉన్నది - గుంటలు పడ్డాయా - చెట్లూ, పాదులూ తిన్నగా ఉన్నట్లేనా - ఇంకా ఏం చేస్తే ఈ ఊరి వీధులు మరింత అందంగా ఉంటాయి....... అని ఆలోచించడమూ – తదనుగుణంగా పనులు చేయడమూ ఈ కార్యకర్తల లక్షణాలు మరి
నేటి స్వచ్ఛ సుందర కార్యకర్తల్లో యోగా ప్రదర్శన చివరి దాక ఎక్కువ మంది పార్కులోనే ఉన్నారు. ప్రతి శని - ఆదివారాల్లో ఈ యోగా శిక్షణ 5.30 - 7.00 ల నడుమ ఇక్కడే జరుగుతుందని ప్రకటించారు.
శని - ఆదివారాల్లో మన శ్రమదానం హిందూ శ్మశానవాటిక వీధిలోనే జరుగునట!
సాధ్యమ వేరెక్కడైన?
ఎంతటి ధైర్యం కావలె వీధులూడ్చి శుభ్రపరచ
ఒక దశాబ్ది కాలముగా ఊరి హితం సాధించగ
శ్రమ – ధన - సమయ త్యాగం సాధ్యమ వేరెక్కడైన?
స్వచ్చోద్యమ చల్లపల్లి సాధించిన రికార్టు మరి!
- నల్లూరి రామారావు
21.06.2024