పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి రాగల ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?
స్వచ్ఛ - సుందర - శ్రమ వేడుకల సంఖ్య 3157*
శనివారం వేకువ (22.06.2024) 4.18 కే మొదలయింది ఏ ఫంక్షన్ హాల్లోనో కాదు. ఒకప్పటి గ్రామ మలమూత్రాల డంపుగా పేరుపొందిన బాలికల వసతి గృహ పడమర - ఉత్తర దిశలోని హైందవ శ్మశాన వాటికా రహదారిలో!
అది తొలుత ప్రారంభమైనది జ్యోతి ప్రజ్యలనాది లాంఛనాలతోనూ కాదు -. మురుగు కాల్వ పడమర గట్టున చీపుళ్ల - పారల గరగరల శ్రావ్య సంగీతాలతో!
నేటి శ్రమ వేడుక నిర్వహించినదీ బొత్తిగా 22 మందే! వీళ్లకు పరోక్ష సంఘీభావం తెలిపిన - అంటే తన ఇంటి ఎదురుగా బాగుచేసుకొన్న ఒక గృహస్తు! పెంపుడు శునకాన్ని వాహ్యాళికి తెచ్చిన వ్యక్తి మాత్రం ఏ దశలోనూ చలించలేదు, కార్యకర్తల గంటా 50 నిముషాల మురికి పనుల పట్ల స్పందించనే లేదు!
ఊరి వివిధ ప్రాంతాల్లో స్వచ్ఛ కార్యకర్తలు పాటుబడుతున్నప్పుడు - ఆ వార్డుల ప్రముఖులు, ప్రజా సంఘాల బాధ్యులూ, ఎన్నికైన ప్రతినిథులూ కనీసం చుట్టరికంగా వచ్చినా ఈ శ్రమదానం ఎంత నిండుగా ఉంటుంది!
ఏంచెప్పగలం! చైతన్యవంతమైనదిగా చెప్పుకొనే చల్లపల్లిలోనే సామాజిక బాధ్యత అంశాన్ని త్రొక్కిపెట్టుతున్న నిర్లక్ష్యం, నిశ్శబ్దం!
సదరు నిశ్శబ్దాన్ని బ్రద్దలు కొట్టాలనే - నిర్లక్ష్యానికి పొగబెట్టాలనే ఈ దశాబ్ద కాల స్వచ్ఛ సుందరోద్యమ రణన్నినాదం!
ఆ రణ భేరికి సాక్ష్యాలుగా
1) జమ్మికుంట లంకమ్మ గుడి ప్రాంతంలో 150 గజాల దాక బాగుపడిన వీధి!
2) అదుపాజ్ఞల్లో లేక విద్యుత్ తీగల్తో వియ్యమందాలని చూస్తున్న చెట్లకొమ్మల కత్తిరింపులు!
3) వ్యర్థాల్లో చాలా భాగం ట్రాక్టర్లో కొలువు తీరిన వైనం!
4) పని విరమణ సూచక విజిల్ 2 మార్లు మ్రోగినా – పని చేసుకుపోతున్న కొందరు కార్యకర్తలు!
కొంచెం ఆలస్యంగా జరిగిన సమీక్షా సభకు ముందు-
- పల్నాటి అన్నపూర్ణ గారి 3+3 మార్లు శ్రమదాన ప్రతిజ్ఞా నినాదాలు,
- బాగా రుచికరమని చెప్పబడుతున్న మాపెరటి మామిడి పళ్ల పంపకం,
- చివరగా రేపటి వేకువ స్వచ్ఛ కార్యకర్తల పునర్దర్శనం బైపాస్ వీధి - వడ్లమర వీధి కూడలిలో అనే నిర్ణయం.
చల్లపల్లికి వెలుగు దివ్వెలు
స్వచ్ఛతను నెలకొలిపి చూపిన - శుభ్రతను సాధించి గెలిచిన –
గ్రామమున ప్రతి వీధికీ తమ కష్టమును చవిచూపుచుండిన –
హరిత వనములు పెంచి ప్రజలకు ప్రాణవాయువు లందజేసిన
స్వఛ్ఛ సుందర కార్య కర్తలె చల్లపల్లికి వెలుగు దివ్వెలు!
- నల్లూరి రామారావు
22.06.2024