3158* వ రోజు...........

      పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి రాగల ప్లాస్టిక్కులు మనకేల?

                                 3158* వ శ్రమ సందడి 38 మందితో !  

          ఆదివారం (23-6.24 ) కాబట్టి కొందరు ప్రత్యేక కార్యకర్తల రాకతో శ్రమదాతల సంఖ్యా, సందడి పెరుగుతుందనుకొంటే ఆ సంఖ్య 38 కీ, సందడి పీక్ కీ వెళ్లింది!  నేటి వీధి పారిశుద్ధ్య వేడుకను సమీక్షిస్తూ DRK డాక్టరుగారు గుర్తుచేసుకొన్న ఒక సంగతేమంటే:

          ఈ చల్లపల్లికి మాత్రమే పరిమితమైన అదోరకం స్వచ్చ – సుందర -  పిచ్చి కార్యకర్తలు మొత్తం 200 కు పైగా ఉండగా - ఆ వ్యసనం నసాళానికెక్కించుకొన్న హార్డ్ కోర్ (జగముదురు) వాలంటీర్లు పాతిక ముఫ్పై మందినైతే ఏ ఒక్క పూటా మాన్పించడం ఇక ఎవరి వల్లా కాదని!

          ఈ వైద్యుని ఛలోక్తి కటిక నిజమని ఎవరు ఏ కొద్ది రోజులు వచ్చి పాల్గొన్నా- పరిశీలించినా ఇట్టే తెలిసిపోతుంది!

          బైపాస్ -  రైస్ మిల్లు వీధి కూడలిలో 4.20 నుండి 6.15 దాక ఎవరెవరి ఉచ్చిష్ట  విసర్జనలనో నింపుకొన్న డ్రైనును 10   మంది బాగుచేశారన్నా –

రోడ్డు కిరు ప్రక్కలా నెలల తరబడీ పేరుకుపోయిన డంపుల్ని ఓపిగ్గా పెకలించి,  ట్రాక్టర్ లోకి నింపుకొన్నారన్నా-

స్వయంగా తామే నాటి పెంచిన చెట్ల కొమ్మల్నీ, పిచ్చిచెట్లనూ నరికేసి, షెడ్డర్ నోటికందించారన్నా –

వడ్లమర బజార్ లోని, పడమర డ్రైన్లోని చెత్తా చెదారాల్ని డజను మంది తొలగించారన్నా -

మొత్తమ్మీద 150 గజాల ఉభయ వీధులు తెల్లారే సరికి శుభ్రంగా, అందంగా కనిపిస్తున్నాయన్నా-

హాస్టల్ ముందు భాగాన్ని ఏ 4 వ – 5 వ సారో శుభ్ర సుందరీకరించారన్నా –

అదేదో తమ ఇల్లే అన్నట్లుగా చీపుళ్లతో ఊడ్చి ఆనందిస్తున్నారనుకొన్నా –

 వీళ్లంతా కాస్త తేడా మనుషులనడంలో సందేహమేముంది?

ఈ రకం మనుషులు గత 10 ఏళ్లలో 30-40 ఊళ్లలో కంపించారు గాని, ఆ ప్రయత్నాలు - 2-3 చోట్ల 1000 రోజుల దాక సాగినా, అవి క్రమంగా నిలిచిపోయినవి !

6.30 సమయంలో నాయుడు మోహనరావు గారు ప్రకటించిన గ్రామ స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలతోనూ,

"నందేటి శ్రీను ఆలపించిన "వృక్షో రక్షతి రక్షితః " పాటతోనూ, బుధవారం వేకువ కాలపు మన పునర్దర్శనం ఇదే బైపాస్  - భారత లక్ష్మి మిల్లుల కూడలిలోనే అనే నిర్ణయంతోనూ-

 నేటి శ్రమ వేడుకకు స్వస్తి!

       పిచ్చివాళ్ళ స్వర్గమనో

పిచ్చివాళ్ళ స్వర్గమనో పెచ్చరిల్లు మూర్ఖమనో

కీర్తి ప్రోగు చేసుకునే - గుర్తింపులకోసమనో

స్వచ్చోద్యమ చల్లపల్లి సాగుతున్నదనుకొంటే-

అంతకు మించిన పొరపాటుంటుందామనలో

- నల్లూరి రామారావు

   23 .06.2024