3159* వ రోజు....... ....

      పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి రాగల ప్లాస్టిక్కులు మనకేల?

3159* వది మళ్లీ రెస్క్యూ టీమ్ శ్రామికదినం!

          ఎందుకంటే - సోమవారం (24.6.24) కనుక!

          వాళ్ళేదో గుంపెడు మంది లేరు - కేవలం నలుగురు అసలు వాళ్లూ, శివరాంపురం నుండి ఒక పాత్రికేయుడూ కాక కొసరు వాళ్ల మిద్దరం.

          స్థలం - బందరు రహదారి నుండి విడివడే గంగులవారిపాలెం వీధి గస్తీ గది! సమయం 4.20 - 6.10 మధ్యస్తం! పనిస్వభావం – గత మంగళవారం తరువాయిగా వీధి చెట్ల – పూల మొక్కల సుందరీకరణం! శ్రమదాన సాక్షులు - నడకదారులు, 6.00 దాక చంద్రయ్యా, తరువాత సూరయ్యా!

          ఏ కొంచెమో లలితకళలూ, సౌందర్యారాధనా, కనీసంగానైనా సామాజికహిత చింతనా ఉండే ఏ వ్యక్తులైనా ఈ కొద్దిమంది కార్యకర్తల శ్రమ త్యాగ నిరతినీ, అందువల్ల ఎప్పటికప్పుడు ఇనుమడిస్తున్న ఈ 3 - 4 వందల గజాల వీధి సౌందర్యాన్ని గుర్తించకపోరు!

          తండోపతండాలుగా ఇక్కడికొచ్చి, సకుటుంబాలుగా – బంధుమిత్ర పరివార సమేతంగా ఫొటోలూ - వీడియోలూ చేసుకొనేవాళ్లలో కొందరికైనా ఈ వీధి సౌందర్య నిర్మాణమూ - నిర్వహణమూ ఎంత కష్టసాధ్యమో తెలియకపోదు!

          సంచార ట్రాక్టర్ ట్రక్కులో ఎత్తు పీటా - దానిమీద నిలబడి పొడవాటి కత్తెరతో నిరుపయోగ తరుశాఖల్ని కత్తిరిస్తున్న రెస్క్యూ కార్యకర్తలూ - గంటన్నరకుపైగా ఈ వీధి శుభ్ర – సుందరీకరణమూ చూస్తుంటేనే అర్ధం కావడంలేదా – తామనుకొన్నది సాధించేదాక వదలని రెస్క్యూ మనుషులు వీళ్ళనీ. వీళ్ళు ఉన్నంతవరకు ఈ ఆస్పత్రి వీధి స్వచ్ఛ శుభ్ర – హరిత - ఆహ్లాదాలకు లోటేదీ రాదనీ తెలిసిపోవడం లేదా?

          ఈనాటి  స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలు కస్తూరి శ్రీనివాసుని నోటి నుండి వెలువడినవి.

          శ్రమజీవన శీలులార!

ఊరికొరకు పరితపించు ఓ మహానుభావులార!

ప్రజాహితం సాధించే శ్రమజీవన శీలులార!

సామాజిక బాధ్యత పాఠాలు నేర్పు విజ్ఞులార!

ప్రజారోగ్య భద్రతతో పరవశించు మిత్రులార!

- నల్లూరి రామారావు

   24.06.2024