పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి రాగల ప్లాస్టిక్కులు మనకేల?
చల్లపల్లిలో 3160* వ శ్రమదాన వీచిక!
ఆ వీచిక (= అల) మంగళవారం (25.6.24) నాటిది, 4+3 మందిది, బందరు రహదారి, గంగులవారిపాలెం వీధుల్ని తాకినది, వేకువ 4.23 కు మొదలై - 6.05 కు ఆగినది! ఒకటో – రెండేళ్లదో కాదు – 10 సంవత్సరాల, సుమారు 4 లక్షల పనిగంటలుగా చలిస్తూనే ఉన్నది!
లోతుగా పరిశీలిస్తే ఈ వీచిక సమకాలిక సామాజిక బాధ్యతా సూచిక! పర్యావరణ విధ్వంసం పట్ల అదొక గట్టి హెచ్చరిక! అశ్రద్ధ చేస్తే అంతే సంగతులిక!
ఇన్ని వేలరోజులుగా స్వచ్ఛ సుందర కార్యకర్తలు రోజూ ముప్పై – నలభై మంది చొప్పునా, సోమ - మంగళవారాలైతే ఆరేడెనిమిది మంది వంతునా తమ పని తాము చేసుకుపోతూనే ఉన్నారు, ఎంతో కొంత స్పందించే వాళ్ళు స్పందిస్తూనే ఉన్నారు, దేనికీ ఉలకని - పలకని సగం జనాభా మిన్నకుండి పోతూనే ఉన్నది!
వాటికతీతంగా ఈ ఉదయం యదావిధిగా జరిగిన శ్రమ సంగతులు : ముందుగా - జల్లూరి ప్రసాదు గారి ఇంటి ఎదుట – బందరు రోడ్డులో రెండు కదంబ వృక్షాలకు కట్టిన ఇనుప ఊచల గార్డుల్ని జాగ్రత్తగా తొలగించాక -
గస్తీ గది నుండి గంగులవారిపాలెం వీధి హరిత సుందరీకరణ పనికి దిగారు. రోడ్డుకు తూర్పున తప్పించక తప్పని కొన్ని చెట్ల కొమ్మల్నీ, పడమర ప్రక్కన మరీ ఎత్తుగా పెరిగిన వేప చెట్టు కొమ్మల్నీ - అటు అందం చెడకుండానూ – ఇటు విద్యుత్ ప్రసారానికంతరాయం కలుగకుండానూ తప్పించారు.
6.20 కి పద్మాభిరామం ఎదుట BSNL నరసింహుని ఆధ్వర్యంలో గ్రామం పట్ల బాధ్యతాయుత నినాదాలిచ్చారు!
రేపటి ఉదయం మనం కలుసుకోదగిన చోటు బైపాస్ - రైస్ మిల్లు వీధి కూడలిలోనే!
స్వచ్ఛ సుందర - హరిత వీచిక
ఊరి మేలే వారి కోరిక – స్వచ్ఛ సుందర - హరిత వీచిక
ప్రయత్నంలో లేదు తికమక – దేహ శ్రమలకు లేదు పోలిక
గౌరవంగా ప్రతీ కదలిక – గ్రామ ప్రగతికి మంచి భూమిక –
పౌర బాధ్యత కొక్క సూచిక - ప్రథమ కర్తవ్యాల వేదిక!
- నల్లూరి రామారావు
25.06.2024