3161* వ రోజు....... ....

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి రాగల ప్లాస్టిక్కులు మనకేల?

బుధవారం వేకువ వీధి కష్టం - @3161*

          ఇది ఆంగ్ల సంవత్సరం 2024 – జూన్ మాసపు 26 వ రోజన్న మాట!

          ఈ కష్టంలో 24 మందికి భాగమున్నది; సాగర్ బైపాస్ వీధిలో అటు భారత లక్ష్మి వడ్లమర అడ్డ రోడ్డు మొదలు - వినూతన భవన నిర్మాణ, దక్షిణపు అపార్ట్మెంట్ల, అశోక్ నగర్ 2 వ వీధి దాక 2 డజన్ల మంది కాయకష్టంతో పారిశుద్ధ్యం ఒక కొలిక్కి వచ్చింది!

          అందుకు వేకువ 4.16 నుండి 6.05 వరకు సమయం ఖర్చయింది! ఈ 100 గజాల జాగాలోనే రెండు ప్రక్కలా డ్రైన్లున్నవి; వాటిలో గాజు - ప్లాస్టిక్ సీసాలు, గ్లాసులు, సంచులు, కప్పులు తగు మాత్రంగా ఉన్నవి; వానలకు పెరిగిన గడ్డీ, కొరగాని మొక్కలూ ఉన్నవి; వాటినంతగా పట్టించుకోని ఆ 30 - 40 ఇళ్ల వారి నిర్లక్ష్యమున్నది.

          అంతే కాదు – ఎవరి కోసం ఇందరు కార్యకర్తలు నిత్యమూ శ్రమిస్తున్నారో - వారు చిద్విలాసంగా భవంతులపైనుండి చూస్తున్న తమాషా కూడ ఉండనే ఉన్నది, సదరు తమాషాను రెప్పవేయకుండా పరిశీలిస్తున్న గంటా ఏభై నిముషాల కాలమూ ఉన్నది!

          వీటికి ప్రతిగా తొణకని పట్టుదలతో - స్థిత ప్రజ్ఞతో - దశాబ్దం తరబడి శ్రమిస్తున్న 24 మంది గ్రామ సామాజిక స్పృహ సైతం ఉన్నది!

మరి ఇందరి స్పృహే, వీధి సుందరీకరణ ప్రయత్నమే -

1) కేంద్ర ప్రభుత్వం వారు అసంపూర్ణంగా త్రవ్వి వదిలేసిన గుంటలకూ,

2) చిందర వందరగా పెనవేసుకుపోయిన పిచ్చి తీగల వికారానీకీ,

3) నిలిచిన మురుగు పారుదలకూ

4) వీధి దుమ్మూ – ధూళికీ, గడ్డికీ పరిష్కారం చూపింది.

          6.20 తర్వాత - కొంత ఎడం తర్వాత పాల్గొని, శ్రమించి, “ఇకముందు ఎన్ని పనులున్నా ప్రతి వేకువా వచ్చి తీరుతా” అని ప్రతిజ్ఞ చేసిన గోళ్ల కృష్ణ పలికిన నినాదాలతోనూ,

          గురవయ్య గారి “మాట విలువ” గురించిన సూక్తులతోనూ, రేపటి వేకువ మనం కలువదగింది సజ్జా ప్రసాదు గారి వీధి వద్ద అనే నిర్ణయంతోనూ 3161* వ శ్రమదానం ముగిసింది!

               సహర్షంగా స్వాగతిస్తాం!

మాకు నచ్చిన - మేము మెచ్చిన – జన్మ సాఫల్యాలు చెందిన

స్వార్థమెరుగని – బద్ధకించని - శ్రమత్యాగం మాట మరవని

తీసుకొన్నది సమాజానికి తిరిగి ఇచ్చే ఆశయాన్నే –

స్వచ్ఛ - సుందర ఉద్యమాన్నే - సహర్షంగా స్వాగతిస్తాం!

- నల్లూరి రామారావు

   26.06.2024