3162* వ రోజు....... ....

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి రాగల ప్లాస్టిక్కులు మనకేల?

చిత్తడి చినుకుల్లోనే 3162* వ వేకువ శ్రమదానం!

          అది శుక్రవారం (28.6.24) నాటి సంగతి! బైపాస్ వీధీ – సజ్జా ప్రసాద్ అడ్డ వీధీ కూడలిలో 4.16 సమయంలో వీధి పారిశుద్ధ్య పనులకుద్యుక్తులైన 7 గుర్ని చూస్తుంటే - ఆశ్చర్యం, ఆనందం ఒకేమారు! ఇన్ని వేలమంది గ్రామస్తులుండగా, నిన్నటి వానతోనూ, నేటి చినుకుల్తోనూ, రొచ్చుగా మారిన వీధి శుభ్రతకు ఈ కొద్దిమంది పూనుకొంటున్నందుకు ఆశ్చర్యం!

          మరీ బిక్కుబిక్కుమంటూ వీళ్ళ సంఖ్య ఏ ‘9’ దగ్గరో ‘11’ దగ్గరో ఆగిపోనందున ఆనందం! అనతి నిముషాల్లోనే కార్యకర్తల బలం 20 దాటి, 6.06 దాక - ఆద్యంతం చినుకుల్లోనే ఆ బల ప్రదర్శన కొనసాగింది! ఇక పని - పని పరిమాణం చూస్తే :

- అశోక్ నగర్ 2 అడ్డబాటలూ, సినిమా హాలు బైపాస్ రోడ్డు 150 గజాలూ పరిశుభ్ర – పారిశుద్ధ్యాల పునరుద్ధరణ జరిగింది!

- ఏడెనిమిది చెట్ల కొమ్మల సుందరీకరణం ముగిసింది!

- సిమెంటు బాట రెండు మార్జిన్ల గడ్డీ చెక్కబడింది!

- బాట ప్రక్క చెట్లు మొక్కలుగా ఉన్నప్పుడు పెట్టిన ట్రీ గార్డుల తొలగింపూ చోటు చేసుకొన్నది!

- కొమ్మల, తుక్కుల, పిచ్చి మొక్కల ఖండన - మండనాలే కాదు -

- వాటిని ప్రోగులు చేసి ట్రాక్టర్ లో నింపడమూ ముగిసింది!

- ఎవరో, ఎందుకో వేసిన ఎండు కొమ్మల గుట్ట కూడా ట్రాక్టర్ లోకి చేరింది!

- పని జరుగుతున్న వార్డు నుండి కనీసం యశ్వంత్ అనే విద్యార్థి పాల్గొన్న సంతృప్తి దక్కింది!

- ఏతా వాతా కమ్యూనిస్టు వీధి దాక బాగుపడింది!

గంటా ఏభై నిముషాల శ్రమ తర్వాత అందరూ గుమికూడిన సందర్భంలో :

          రిటైర్డ్ సివిల్ ఇంజనీర్ అంబటి శంకర్రావు గారి నినాదాల వేగాన్నీ, ధాటినీ మిగిలిన వాళ్లు అందుకోగలిగి,

          నియోజకవర్గాన్ని ఏ 15-20 వేల మొక్కలతోనో MLA, కలెక్టర్ల, ప్రజా సంఘాల, విద్యార్ధుల, ఉద్యోగుల సహకారంతో నింపాలనే బృహత్ప్రణాళికొకటి DRK గారి మాటల్లో తెలిసి,

          రేపటి వేకువ కూడ మన పరస్పర పునర్దర్శనం కమ్యూనిస్టు బజారు ఉత్తరంగానే అనే నిర్ణయంతో నేటి సముచిత శ్రమకు ముగింపు!

                    నిలిచి గెలిచిరి!

చల్లపల్లి స్వచ్ఛ సంస్కృతి సాధనలకై నడుంకట్టిరి

ఎన్ని పాటలనాలపించిరి - ఎంతగా నర్తించి చూపిరి

గడప గడపకు తిరిగి ప్రజలను కలిసి అభ్యర్థించివచ్చిరి

కార్యసాధక స్వచ్ఛ సుందర కార్యకర్తలు నిలిచి గెలిచిరి!

- ఒక తలపండిన కార్యకర్త

   28.06.2024