పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి రాగల ప్లాస్టిక్కులు మనకేల?
3163* వ శ్రమ వివరాలు తెలుసుకుందాం!
అవి స్థిరవారం (29.6.24) వేకువ సమయానివి; 33 మందికి సంబంధించినవి; 4.15 కు మొదలై 6.10 దాక సందడి చేసినవి; ఉప్పల వారి వీధి వద్ద నుండి సజ్జా వారి అడ్డరోడ్డుకు వ్యాపించినవి; వాతావరణం చల్లగా అనుకూలించినా, ఇంచుమించు అందరి చెమటలకూ కారణమైన సంగతులవి!
తమ గ్రామంలోని బైపాస్ వీధిలో ఈ స్వచ్ఛ కార్యకర్తలు ఎవరెంతగా కష్టించారో - ఎవరి బట్టలకేపాటి బురద అంటుకొన్నదో – అందులో ముగ్గురికైతే 2 గంటల నిర్విరామ శ్రమతో శక్తి ఎలా ఉడిగిపోయిందో - నేను పనిగట్టుకొని వివరించనేల?
“జై స్వచ్ఛ చల్లపల్లి సైన్యం” వాట్సప్ లోని ఫాటోలే సాక్ష్యాలుగా చూసి తెలుసుకోవచ్చునే! బాగా వెలుతురొచ్చి, పని ముగిసే సరికి ఆ రెండు - మూడు వందల గజాల సిమెంటు రోడ్డును చూస్తుంటేనే అర్థమైపోతుంది – ఈ కార్యకర్తల ఉద్దేశమేమిటో - వాళ్ల సామూహిక శ్రమైక దీక్ష ఫలితమేమిటో!
వీళ్లందరికీ ఒక ఉమ్మడి లక్ష్యముంది - ఊళ్లోని ఒకొక్క వీధినీ ఎలా బాగుచేయాలో! ఒక ఉడుం పట్టుదలుంది - పదేళ్లైనా, పదేనేళ్లయినా తామనుకొన్న గ్రామ స్వచ్ఛ - సౌందర్య - హరితాశయాన్ని సాధించాలని! ఒక సమున్నత ఆశయముంది - చల్లపల్లి ప్రతి పౌరునిలోనూ స్వచ్ఛ – శుభ్ర సృహ కల్గించాలని!
- వాళ్లు రోడ్డు మార్జిన్ కు గండి కొట్టింది రోడ్డు మీది నీళ్ళు నిలవకుండ అది క్షేమంగా ఉండాలని!
- నిచ్చెనలెక్కి చెట్ల కొమ్మల్ని కత్తిరించేది ఆ చెట్లు బుద్ధిగా బారులు తీరి, గ్రామస్తులకు ఆహ్లాదం చేకూర్చాలని!
- ఈ ఆరేడుగురు మహిళలు మట్టి డిప్పలు మోసేదెందుకంటే - తిన్నదరక్క కానే కాదు - తాముండే ఊరి పట్ల బాధ్యత తీర్చుకోవడానికే!
- ఇందులో వయస్సు మళ్లిన, నడుం నొప్పులున్న, మోకీళ్లరిగి పోయిన, కాలికి గాయాలున్న వాళ్ళంతా క్రమం తప్పక వచ్చి, శక్తి కొద్దీ పనిచేస్తున్నది గ్రామ సామాజికానందం నిమిత్తమే! వాళ్లకు అయాచిత లబ్ది ఏమంటే – ఆత్మ సంతృప్తి, మానసిక - శారీరక ఆరోగ్యాలే!
6:25 కు వాళ్లు దాసరి రామమోహనరావు గారి గేటు వద్ద నిలబడి శ్రమదానోద్యమ నినాదాలిచ్చింది - మాలెంపాటి అంజయ్య ననుసరించే!
నిన్నటి MLA గారి, రెవెన్యూ - ఉన్నతాధికారుల గ్రామ పరిశీలనా విశేషాలనూ, రేపటి వేకువ మళ్లీ ఇదే వీధిలో – బాబు చిల్లరదుకాణం దగ్గర కలుసుకోవాలనీ వెల్లడించింది Dr. డి.ఆర్.కె గారే!
ముమ్మర శ్రమదానం కల
కవిగాయకు లెందరో తమ కలం – గళం విప్పినట్టి
సామాజిక పరిశీలక సన్నుతులను పొందినట్టి
తొమ్మిదేళ్ల నిర్విరామ ముమ్మర శ్రమదానం కల
స్వచ్ఛ సుందరోద్యమమా! సాష్టాంగ ప్రణామములు!
- ఒక తలపండిన కార్యకర్త
29.06.2024