3164* వ రోజు....... ....

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి రాగల ప్లాస్టిక్కులు మనకేల?

సోమవారం నాటి రెస్క్యూటీమ్ పనులు - @ 3164*

          జులై మాసపు తొలినాటి కార్యకర్తల కృషి మరొకమారు గంగులవారిపాలెం వీధిలోని గస్తీగది ప్రాంతానికి పరిమితమయింది. అందుగ్గాను 4.20 కే సంసిద్ధులైన ముగ్గుర్ని గమనించారా? వాళ్లకు తోడుగా మరో ఇద్దరం కూడ ఉన్నామనుకోండి!

          మొత్తం ఈ 5 గురే కాదు – ఆసాంతం - అంటే 4.20 - 6.00 నడుమ అటూ ఇటూ గాని వాన దేవుడు కూడ! ఈ దేవుడు స్వచ్ఛ కార్యకర్తల్నెంతగా చిరాకు పెట్టాడో - వాళ్లకష్టమైన పనినెంతగా కష్టతరంగా మార్చాడో నిచ్చెన మెట్లమీద కాలు జారకుండా, చేయి పట్టు తప్పకుండా ఎంత మెలకువగా పని చేయించాడో వేరే చెప్పాలా?

ఐతే సుదీర్ఘ కాలంగా ఇలాంటి ఆటంకాలకి అలవాటు పడి, నెగ్గుకొస్తున్న కార్యకర్తలు

- గస్తీ గది పైన బాగా పెరిగిన మహావృక్షం కొమ్మల్ని తొలగిoచారు, లేకపోతే అవి కరెంటు తీగల్ని రేపోమాపో తాకేవే!

- 6 వ నంబరు కాలువ బారునా గతంలో నాటి, పెంచిన పూల మొక్కల్ని ట్రిమ్ చేసేశారు!

- గస్తీ గది రెండు ప్రక్కలా గత 15 రోజుల్లోనే దట్టంగాపెరిగిన క్రోటన్ గుబుళ్లకు కూడ ఇంకొంచెం మర్యాద నేర్పారు!

          మొత్తమ్మీద రెస్క్యూ టీమ్ - అనిపించుకొన్నారు!

          చివర్లో ఆ గదిలోనే కాస్త సేద తీరుతూ - కాఫీలు సేవిస్తూ –

          కస్తూరి వారి మార్గదర్శకత్వంలో యధాపూర్వక నినాదాలు వినిపిస్తూ - 3164 వ నాటి శ్రమదానం ముగించారు!

          సాష్టాంగ ప్రణామాలు!

తొమ్మిదేళ్ల కష్టంతో తొలగిన కాలుష్యం శని

ఊరు – దాని పరిసరాలు ఉవ్వెత్తున మారిపోయె

ఆహ్లాదం, ఆరోగ్యం అందుబాటులో కొచ్చిన

స్వచ్చోద్యమ చల్లపల్లి! సాష్టాంగ ప్రణామాలు!

- ఒక తలపండిన కార్యకర్త

   01.07.2024