3168* వ రోజు.......... ....

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి రాగల ప్లాస్టిక్కులు మనకేల?

3 వేల నూట 68* వ శ్రమ సంగతులివే!

            క్రోధినామ సంవత్సర - శుక్రవాసర అనగా 5.7.24 వేకువ 4.14 - 6.10 సమయాల మధ్యకాలంలోనివి బైపాసు మార్గమునందలి చలన చిత్ర ప్రదర్శనాలయ ఉత్తర దిక్కున వెనుకటి చల్లపల్లి వైద్యశాలదగ్గర 27 మంది పాటుబడినవి!

            ఎక్కడ లైఫ్ బాయ్ ఉండునో అక్కడ ఆరోగ్యముండునుఅన్నట్లు ఈ స్వచ్ఛ - సుందర కార్యకర్తలెచ్చటనుందురో అచ్చట శ్రమదాన ప్రకంపనలుండును! తమ శ్రమను మరపించు కొన్ని మైకు పాటలూ, అప్పుడప్పుడూ ఒకరి పనిపై మరొకరి చతురులూ అక్కడ వినిపించును!

            బరువైన - కష్టమైన పనులెన్నుకొన్నవారిందులకు మినహాయింపులు - వాళ్లు మధ్యలో నడుము లెత్తినపుడు వారి ముఖాలు చెమటతో తడిసి, దుమ్ము కొట్టుకొని కన్పించును! ఈ సాధారణ సమాచారమే ఎక్కువ రోజులకు వర్తించును! ఇక నేటి విశేషమెట్టిదనగా :

- రాధానగర్ జ్ఞాపిక గల కబేళా వీధి వద్ద మొదలైన కష్టంతో సుమారేబది అరువది గజాల వీధి శుభ్రపడెను,

- రోడ్డుకు ఉత్తర దక్షిణాల 2 గుంటలు పూడ్చబడెను;

- మరికొన్ని చెట్టు కొమ్మలు కత్తిరించబడి, ఒకప్పటి ఆస్పత్రి ఎదుట ఆహ్లాదకరముగా మారెను!

- షాబుల్ వీధి మురుగు కాల్వ సంస్కరణలో ఎక్కువ శ్రమించుట వలన మురుగు నీరు కుంటకుండ చక్కగా నడచుచుండెను!

- చలన చిత్రాలయ ప్రహరీ వెలుపల 3 ప్రాత వాహనాలు నిలువ ఉన్నందున కార్యకర్తల పనుల కాటంకము కలిగెను!

- 6.00 గంటల వేళ వీధి శుభ్రపడి, ట్రాక్టరు సగానికి వ్యర్ధాలు నిండెను!

- అందరూ అర్ధవలయముగా నిలిచి, పల్నాటి భాస్కరా మాత్యుల వారి స్వచ్ఛ - సుందర ప్రతిజ్ఞా నినాదాలు విన్పించెను!

- DRK వైద్యుని సమీక్షలో – MLA గారి కొన్ని క్రొత్త ప్రతిపాదనలు తెలిసెను!

            రేపటి చీకటితో మనము మరల కలువదగిన ప్రదేశము కూడ ఈ బైపాసు వీధిలోని చలన చిత్ర ప్రదర్శనశాల ప్రక్కనే అనెడి నిర్ణయముతో నేటి శ్రమ వేడుక ముగిసెను!

            రాజుకొన్నది ఇంద్రజాలము

రాకరాక చరిత్రలోపల రాజుకొన్నది ఇంద్రజాలము

ఇది సదుద్యమ - మిది శుభస్కర - మిదిసమున్నతభావజాలము

అది మరింతగ ప్రజ్వరిల్లితె - అన్ని ఊళ్లకు అంటుకొంటే

లోకమంతా ఇక సుభిక్షము - మానవాళికి కలుగు క్షేమము!

- ఒక తలపండిన కార్యకర్త

   05.07.2024