3169* వ రోజు..............

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి రాగల ప్లాస్టిక్కులు మనకేల?

స్థిరవారం నాటి సుస్థిర వీధి పారిశుద్ధ్యం!- @3169*

            తారీఖు 6.7.24, కాలం వేకువ 4.20 - 6.12,  పరిశుభ్రత అలవరచుకొన్న ఊరి భాగం సాగర్  పేరుగల సినీ పదర్శనశాల ఉత్తరాన, సామాజిక కర్తవ్య వ్యసన పరులు ఏడెనిమిది మంది మహిళలతో సహా 33 మంది, బాగుపడిన ప్రాంతమైతే - బొత్తిగా 50 గజాలు!

            వైద్యులు, గృహిణులు, రైతులు, విశ్రాంత ఉద్యోగ వృద్ధులు, బేహారుల ఈ బృందం పదేళ్లుగా, బ్రహ్మముహూర్త సమయ ప్రత్యూష పవనాంకురాల ను స్వాగతిస్తూ ఒక్కో వీధినీ ఊడుస్తూ - రోడ్లను భద్రపరుస్తూ- చెట్లను పెంచుతూ మొక్కల్ని పూయిస్తూ – మురుగు కాల్వల్ని ప్రవహింప జేస్తూ- కష్ట పడుతున్నారంటే- వాళ్లేమీ వెర్రోళ్ళు కాదు, తేడాగాళ్లు కాదు, రోడ్లను త్రవ్వేసి అమ్ముకొనే పాడుకాలంలో రోడ్ల గుంటలు పూడ్చడమూ, వీధి మార్జిన్ల దురాక్రమణల కడ్డు పడడమూ, అప్పడప్పుడూ అసాంఘిక వ్యక్తుల కోపదృక్కులు వాళ్లమీదపడడమూ..... ఇవేవీ స్వచ్చకార్యకర్తల తప్పులు కావు-జిడ్డులా వాళ్ళకంటు కొన్న గ్రామ సామాజిక బాధ్యతా వ్యసనాల తప్పు! ఈ వేకువ నన్నాకర్షించిన శ్రమ సౌందర్యాలు ఒకటా - రెండా!

- పాములు దూరిన సందేహమున్న సాగర్ టాకీసు ప్రక్క ఉద్యానంలో ఆరేడుగురు చీకట్లో శ్రమించి, శ్రమించి దాన్ని శుభ్ర – సుందరీకరించడమూ,

- ఉద్యానం వెలుపల కూరుకుపోయిన ప్రాత చతుశ్చక్ర వాహనాల క్రింద గడ్డీ- గాదం తొలగించడమూ,

- మరొక రికార్డుస్థాయి రక్తదాత ట్రాక్టర్ లో 2 బళ్ల చెత్తను త్రొక్కి సర్దడమూ,

- ఒక పని ఊపులో ముగ్గురు లోడింగు వీరులు విసరిన డిప్పలు గాల్లో ఎగురుతుండడమూ,

-  68 ఏళ్ళ ఇద్దరు విశ్రాంతోద్యోగ భారీ కార్యకర్తలు నడుముల్ని బలవంతాన వంచి, వీధి శుభ్రతను సాధిస్తుండడమూ,

- వీటన్నిటిని చూస్తూ - ఈ నిస్వార్థ సుదీర్ఘ శ్రమ వైభవాన్ని చల్లపల్లి స్వచ్చోద్యమ సంచాలక వైద్యుడు కళ్లార్పక చూస్తూ ఆనందించడమూ,

- ఈ కాలంలో ఎక్కడా కన్పించని - విన్పించని చల్లపల్లికే  ప్రత్యేకమైన – ఇన్ని  శ్రమ జీవన సౌందర్య సన్నివేశాల్లో దేన్ని - ఎలా వర్ణించాలో పాలుపోక నేను తికమక పడడమూ..!

            వార్డు మాజీ సభ్యురాలు శ్రీమతి పసుపులేటి ధనలక్ష్మి స్వచ్చ సుందరోద్యమ నినాదాలు చేయగా,

            నిన్న ఆర్కిటెక్టుగారి, MLA గారి - పులిగడ్డ ఆక్విడెక్టు సందర్శననూ, చర్చలనూ, చల్లపల్లి హిందూ శ్మశాన వాటికకు విరాళ వాగ్దానాలనూ DRK గారు ప్రకటించగా 2 గంటల శ్రమ వేడుక ముగిసింది!

            రేపటి వేకువ కూడ ఇదే సాగర్ టాకీసు వద్దనే కలవాలనే సంగతీ తెలిసింది!     

            మోడలుగ భావింతుమంతే!

ఇదేదో అతి చిన్నపనిగా - ఎక్కడైనా జరుగు కృషిగా –

తోచీ - తోచని, నిద్ర పట్టని కొంతమందికె చెందినదిగా

మూడు వేల దినాల పిమ్మట గూడ తలచే మనుషులుంటే

మ్యూజియంలో ఉండవలసిన మోడలుగ భావింతుమంతే!

- ఒక తలపండిన కార్యకర్త

   06.07.2024