3170* వ రోజు.......... ....

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి రాగల ప్లాస్టిక్కులు మనకేల?

ఘనంగా ముగిసిన 3170* వ నాటి 39 మంది  శ్రమ!

          ఆదివారం(7.7.2024) వేకువ 4.17 కే వీధిలోపాల దిద్దుబాటు కోసం 16 మంది కాచుక్కూర్చొన్నారు. వాళ్లకు మరో 23 మంది తోడై - సంఖ్యా బలం 39 కి చేరి, ఒక సమన్వయంతో వాళ్ల శ్రమదానం 6.10 కి కొలిక్కి వచ్చింది!

          ఇదంతా సాగర్ టాకీసు ప్రక్కన - గుంటూరు బాపనయ్య భవన్ వీధి దగ్గర సంగతి! ఈ 100-150 గజాల హద్దుల్లోనే మూడు రోజుల కార్యకర్తల కష్టం!

          “బైపాసు బజారులో ఎంత స్వచ్ఛ - శుభ్ర - సౌందర్య పరిపూర్ణతలైతే మాత్రం – పని పరిమాణం మరీ ఇంత తక్కువైతే ఎలా? అని ఒకానొక హార్డ్ కోర్ కార్యకర్త అసంతృప్తి!

          “పని ఎంత దూరం జరిగిందని కాక - వీధి ఉద్యానమూ, అటూ ఇటూ మార్జిన్లూ, టీ దుకాణాల - మాంసం అగళ్ల – భవన నిర్మాణ వ్యర్ధాల తొలగింపూ, గడ్డి చెక్కుళ్ళూ, రోడ్డు గుంటల పూడికలూ, మురుగు కాల్వల సంస్కరణలూ – ఇవన్నీ జరగలేదా? అని ఇతర కార్యకర్తల అభిప్రాయం!

          వీధి బాగుచేత సందడి అన్ని రోజుల్లో ఉండేదే ఐనా - ఆదివారం కథే వేఱు! ప్రత్యేకించి ఆదివారపు శ్రమదాన అవకాశం ఉన్న7-8 మంది కలిసి వచ్చి, క్రమశిక్షణ గల సైనికులుగా మారి, ఎవరి పనులు వాళ్లు ఎంచుకొని, అన్నిటినీ సమన్వయించుకొని, చివర్లో కలిసి కాఫీలు త్రాగి, ఊరి బాగుదల నినాదాలు చేసి, సందర్భోచిత గీతాలాపనకు చప్పట్లు కొట్టే సన్నివేశం ఆదివారాల్లో జరుగుతుంటుంది!

          ఇక ఈపూట స్వచ్ఛంద శ్రమదాన ఫలితాలా? DRK గారు పెట్టిన “నిన్న-నేడు” ఫొటోలు చూడండి! మట్టిలో చక్రాలు కూరుకుపోయిన - ఎందుకూ పనికిరాని ప్రాత కార్ల సంగతి నిన్న పంచాయతి అధికారులకు విన్నవించినా ఫలితం రాలేదు! క్రొత్తగా ఏ బడ్డీ కొట్లో వెలవకుండా ఐతే అవి పనికొస్తున్నాయి!

          నేటి నినాద కారిణి రాయపాటి రమ గారు!

          ఒక కొంగ్రొత్త దేశభక్తి పూరిత జెండాపాట పాడిన వారు నందేటి వారు!

          మధ్య మధ్య పనిచేయక మొరాయించినది మైకు గారు!

          ఇదే బైపాస్ వీధి పారిశుద్ధ్య పురోగతి కోసం మన బుధవారం నాటి పరస్పర పునర్దర్శనం సాగర్ టాకీసు వద్దనే!

          సగభాగ వైఖరి ఇలాగున్నది!

సొంత యత్నం మానుకొన్నది - వింత వింతగ మారుతున్నది

స్వచ్ఛ సుందర సేవలకు ఇసుమంత స్పందన చూపకున్నది

ఊరి మేలుకు జరుగు ఈ శ్రమదానమైన గణింపకున్నది

చల్లపల్లి సమాజమున సగభాగ వైఖరి ఇలాగున్నది!

- ఒక తలపండిన కార్యకర్త

   07.07.2024