పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి రాగల ప్లాస్టిక్కులు మనకేల?
వీధి పారిశుద్ధ్య శ్రమ సంగతులు - @3178*
బుధవారం (17.7.214) వేకువ 4.17 కే అవి గంగులవారిపాలెం రోడ్డులో మొదలై - 6.10 దాక జరుగుతూనే ఉన్నవి. ఈ అసలు కష్టానికరగంట ముందూ, అరగంట తదుపరీ కలుపుకొంటే సగటున ఈ కార్యకర్తలు తలా 3 గంటల సమయాన్ని తమ ఊరి ప్రయోజనార్థం వెచ్చించారన్నమాట!
ఈ ఒక్కరోజనే ముందిలే - పదేళ్లుగా - 3178 రోజులుగా ఇదే వరస! ఊళ్లోకాకపోతే బైట పంటకాల్వలూ, శ్మశానాలూ, పది పరిసర రహదార్లూ ఏదోకచోట - ఏదోకరూపంలో వీళ్ల శ్రమ జనాహ్లాదానికి అక్కర కొస్తూనే ఉన్నది!
కాకపోతే - ఊరు మరీ పెద్దది కావడంచేతా, ఇంకా సగం మంది జనానికిప్పటికీ ఉమ్మడి స్వచ్ఛ - శుభ్ర -సౌందర్య స్పృహ వంటబట్టకా, ఈ కార్యకర్తలు ఊరి పెద్ద వీధులు తప్ప - లోతట్టు చిన్న రోడ్ల సంగతి చూడలేకపోతున్నారు!
అసలందరూ ఒక్క నిముషం ఊహించుకొండి - ఇన్నేళ్లుగా ఈ కార్తకర్తలే పట్టించుకోకపోతే – కనీసం రోజుకొక్క ట్రాక్టర్ తుక్కైనా వీళ్లు ఏరకపోతే - 30 వేల చెట్లు పెంచకపోతే - మురుగుకాల్వల్ని ఏడాదికొకటి - రెండు - మూడు మార్లు బాగుచేయకపోతే......ఈ శ్మశానాలు, రహదార్లు, పంట కాల్వ గట్లు బోసిపోయి - కళాకాంతులు లేక - సుందర ముదనష్టంగా మిగిలిపోయేవి కావా?
రాష్ట్రంలోని - దేశంలోని - 13 వేల, ఐదారు లక్షల గ్రామాల్లో ఒకటిగా చల్లపల్లి మిగిలుండేది కాదా?
ఇక - ఈ వేకువ ఈ పాతిక మందీ సమష్టిగా నిర్వహించిన వీధి పారిశుద్ధ్య – సుందరీకరణలెట్లున్నవో చూద్దాం:
- మా ఇంటి ఉత్తరపు ఖాళీ స్థలంలోని గుబురు చెట్లూ - తీగలూ ఐదుగురి వంతు
- సన్ సిటీ రోడ్డు మొదట రెండు ప్రక్కలా 20 గజాల పరిశుభ్రతా కృషికి పాటుబడినవారు 10 మంది,
- ఎప్పటిలాగే - ఈ సందడికి కాస్త దూరంగా - భవఘ్నినగర్ వైపుగా ఇద్దరు ప్రయత్నించిన 20 గజాల వీధి మార్జిన్ స్వచ్ఛ- శుభ్రతలూ,
- తొలుత ఒక పోస్టల్ ఉద్యోగీ, తరువాత ముగ్గుర్నలుగురూ మా ఇంటి ఆవరణలో సాధించిన అందాలు,
కాఫీల పిదప – రెండు వీధుల కూడలిలో DRK గారి సమీక్ష, 21 వ తేదీ – మోపిదేవి గురు పౌర్ణమి పూజా విధులకు శివబాబు గారి ఆహ్వానం, నిమ్మగడ్డ నుండి కాంచనరావు గారు కార్యకర్తలకు పంపిన రేలా పూలమొక్కల విత్తనాలు,
రామానగర వాస్తవ్యుడు – రాజు గారు ప్రకటించిన శ్రమదాన సంకల్ప నినాదాలు,
రేపటి వేకువ కూడ గంగులవారిపాలెం – సన్ ఫ్లవర్ కాలనీల రోడ్ల వద్దే మనం కలవాలనే నిర్దేశమూ...
స్వాగతిస్తాం! అనుసరిస్తాం!
ఊహకందవు స్వచ్ఛ సుందర ఉద్యమంలో జరుగు వింతలు-
పరస్పరమూ పలకరింపులు - స్వచ్ఛ సంస్కృతి అడుగుజాడలు
తొమ్మిదేడుల అనుభవమ్ముల దూర విఘటిత కలుషరీతుల
స్వచ్ఛ సుందర కార్యకర్తనె స్వాగతిస్తాం! అనుసరిస్తాం!
- ఒక తలపండిన కార్యకర్త
17.07.2024