3173* వ రోజు.......... ....

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి రాగల ప్లాస్టిక్కులు మనకేల?

3173* వ శ్రమ వేడుకలో 27 మంది!

            ఈ బుధవారం వేకువ 4.15 కే అందులో 9 మంది! 10-7-24 చీకటితో ఎందుకిందరి ఆరాటం? వానకు నానిన - రాళ్లూరప్పల ఎగుడుదిగుడు వీధి మార్జిన్లలో కాలుష్యం మీద ఏల ఈ పోరాటం? కూటి కా - గుడ్డకా - కీర్తికా - పరువుకా.... ఏమిటీ జంజాటం?

            “నేనూ - నావాళ్లే కాదు - నా ఊరి వాళ్లంతా ఆరోగ్యంగా, ఆనందంగా, సౌకర్యంగా బ్రతికేందుకు నా వంతు చేతనైనంత పనేదో నేను చేయాల్సిందే! నా పూర్వీకులు నాకిచ్చిన - నా సమాజం నాకర్పించిన దాంట్లో ఏ కొంతైనా తిరిగి చెల్లించాల్సిందే!అనే కర్తవ్యం గుర్తించడంలో దారి తప్పిన సమాజంలోనే ఈ 27 మందీ ఉన్నది!

            వీళ్లు నిద్ర లేచేది 3.30 కు; బయల్దేరి - 2/3/4 కిలోమీటర్ల దూరం దాటి నేటి కార్యరంగమైన సాగర్ టాకీసు వద్దకు చేరుకొనేది 4.15 కు; చేతొడుగులూ, తలదీపాలూ, పనికనుగుణమైన వస్తువులూ చేతబూని పనిమొదలుపెట్టేది 4.30 కూ, ముగించేది 6.10 కి! వానొచ్చినా - మంచు ముంచినా గత పదేళ్ల శ్రమదాన ప్రస్థానంలో మార్పులేదు!

గత 3 రోజుల్నుంచీ ఈ కొంచెమేగా - ఇవాళ పూర్తవుతందిలేఅనుకోవడమూ, సినిమా హాలు ఉత్తర భాగం ఏరోజుకారోజు మిగిలి పోతుండడమూ! ఈ ఉదయమూ అంతే! హాలు ముందరి వీధి దాక శుభ్రపరచాలనే ఆశయం అడుగు దూరంలో ఆగిపోయింది!

            వాతావరణంలో తప్పు లేదు - చల్లగా, హాయిగానే ఉన్నది; - ముఖ్యంగా కూర్చొని లోకాభిరామాయణం ముచ్చటించుకొనేవాళ్లకి! ఐనా సరే వీరిలో నలుగురైదుగురి బట్టలు పూర్తిగానూ, చాలమందివి పాక్షికంగానూ చెమటకు నానినవి! కాళ్లూ చేతులూ మొఖాలూ దుమ్ము కొట్టకుపోయినవి! ఐనా 6:00 కు చూస్తే అందరి వదనాలూ సంతృప్తి ప్రపూర్ణాలే!

            రోడ్డు ఉత్తరపు ఉద్యానంలో కొంతా, దక్షిణపు ఖాళీ జాగాలో కొంతా తప్ప అనుకొన్న మేర పని పూర్తయింది; కొసరుగా ముగ్గుర్నలుగురు బాపనయ్య భవనం వీధిని కూడ శుభ్రపరిచారు!

            ఆయన 87 ఏళ్ళ అనుభవజ్ఞుడైన వైద్యుడు - ఇప్పటికే ఏ 10-12 లక్షలో చల్లపల్లి కోసం విరాళ ప్రదాత! శ్రమదాన స్థలాన్ని వెతుక్కొంటూ 5.30 కే వచ్చి - గట్టిగా స్వచ్చ సుందరోద్యమ నినాదాలీయడమే కాదు హిందూ శ్మశాన దహన వాటిక నిమిత్తం లక్ష రూకల చెక్కునూ, మరో 2 లక్షల వాగ్దానమూ ఇచ్చారు. వారే Dr. D. శివప్రసాదరావు!

            అలాగే - ఉమా సమేత బత్తిని శ్రీనివాస మహోదయుని క్రమం తప్పని నెలవారీ చందా ఠంచనుగా 5.7.24 న ఆన్లైన్ లో వచ్చినందుకు ధన్యవాదాలు.

            రేపటి శ్రమదాన ప్రదేశమూ సాగర్ టాకీసు ప్రాంతమే!

          శ్రమదానము ఆగిందా

ఈ-కొద్దిమంది సౌజన్యమె ఊరంతటి సౌభాగ్యము

శ్రమదానము ఆగిందా - ఆహ్లాదము గోవిందా!

ఈ - కార్యకర్త చెమట చుక్క చల్లపల్లి చలువ లెక్క

జనమంతా కదిలినపుడె ఊరంతా పడును చక్క!

- ఒక తలపండిన కార్యకర్త

10.07.2024