పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి రాగల ప్లాస్టిక్కులు మనకేల?
30+ పనిగంటల వీధి ప్రజాసౌకర్యం - @ 3179*
ఈ కృషి జరిగింది గంగులవారిపాలెం బాటలోనే! 18.7.24 - గురువారం ఉషః కాలంలోనే! పని చివర్లో వచ్చి కలిసిన ఇద్దరు సానుభూతి పరులతో గాని కార్యకర్తల సంఖ్య 20 దాటలేదు!
వాతావరణం సైతం అనుకూలించి, 3 రకాల పనుల్నీ సంతృప్తికరంగా చేసుకోనిచ్చింది. ఈ లక్షోపలక్షల పారిశుద్ధ్య పని గంటల సుదీర్ఘ శ్రమదానాన్ని “ఆ! ఏం పనుల్లే - తోచీ తోచని, గోరంతలు కొండంతలుగా చెప్పుకొనే పనులు...” అనీ, “స్వార్ధ చింతన లేని - సుదీర్ఘకాల గ్రామ ప్రయోజనకర ఆదర్శ సామాజిక కార్యమనీ ఎవరిష్ట ప్రకారం వాళ్లు అన్వయించుకోవచ్చు! కాని కాలమనేది నిజాన్ని నిగ్గు తేల్చకపోదు!
కార్యకర్తల నేటి కష్టంలో ముందుగా పేర్కొనదగింది ఏడెనిమిది ఏడాకుల చెట్ల కొమ్మల కుదింపు! ఇందుగ్గాను గొడ్డలి, కొడవలి ఒడుపు తెలిసిన ఆరేడుగురూ, బాగా ఎత్తుపీట ఎక్కి మర రంపంతో వృక్ష
శాఖా ఖండనం గావించిన ఇద్దరూ చెమటలు కక్కారు.
మహిళల్తో సహా 5 గురు ఆ పెద్ద కొమ్మల్ని సైజులుగా నరకడమూ, బాటకు తూర్పున పెద్ద గుట్టలుగా పేర్చడమూ!
రెండో రకం పని 3 గ్గురిది - బాట పడమటి మార్జిన్ గడ్డినీ, పిచ్చికంపల్నీ తొలగించుకొంటూ, ప్లాస్టిక్ తుక్కుల్ని విడగొట్టి ప్రోగులు పెడుతూ, కత్తీ – గొర్రులకు పని చెపుతూ ఇద్దరు విశ్రాంత ఉద్యోగులు!
మాజీ డి.ఎస్పీ గారింటి వెనుక ఖాళీ స్తలాన్ని సుందరీకరిస్తూ – శుభ్రపరుస్తూ - ముళ్లని తప్పించుకొంటూ ఒక జోడు కత్తుల అత్యంత సీనియర్ ఉపాధ్యాయుడూ, మరొక గృహిణీ!
ఇద్దరు నర్సులూ, ఇంకో గృహిణీ అంత బరువైన కొమ్మల్ని లాక్కెళ్తూనూ, కొమ్మల్ని నరుకుతుంటేనూ వాళ్ళకంతటి శక్తి ఎలా వచ్చిందనే ఆశ్చర్యమూ కలుగుతుంది! ఒక పాటగాడు పని మధ్యలో కూనిరాగాలు తీస్తుంటేనో - స్టెప్పులేస్తేనో క్రొత్త వాళ్లైతే వింతగా చూస్తారు!
ఇవన్నీ సరే - ఇక్కడి ఒక స్వచ్ఛకార్యకర్త 25 వేల కిలోమీటర్ల దూరాన – కనెక్టికట్ లో - తన చల్లపల్లి భవిష్యత్తు కోసం - 100 కిలోమీటర్ల పరుగుకు ఇప్పటి నుండే ఉద్యుక్తుడౌతున్న సంగతిని నిన్నటి మన వాట్సప్ లో గమనించారా?
కార్యకర్తల నేటి తుది సమావేశంలో అడపా వారు స్పష్టం చేసిన స్వచ్చోద్యమ నినాదాలనూ, ఆలోచింపజేసే సూక్తుల్నీ ఆలకించారు గదా!
క్రొత్తగా ఐదారొందల పూల మొక్కల్ని తెప్పించి నాటాలనే DRK గారి సమాచారం తెలిసింది గదా!
మన రేపటి శ్రమదాన ప్రదేశం కూడ ఇదే గంగులవారిపాలెం వీధి!
విస్తృతంగా స్వాగతాంజలి!
వంటింట్లో మహారాణీ, అధ్యాపక వృత్తినిపుణా
శస్త్రచికిత్సా విదుషీమణి పనికి కాస్త విరామ మొసగి
వీధి శుభ్రత నగిషి దిద్దే వింతవింతల దృశ్యములు గల
స్వచ్ఛ సుందర చల్లపల్లికె విస్తృతంగా స్వాగతాంజలి!
- ఒక తలపండిన కార్యకర్త
18.07.2024