3181* వ రోజు.......... ....

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి రాగల ప్లాస్టిక్కులు మనకేల?

నేటి 29 మందీ రెస్క్యూ కార్యకర్తలే - 3181*

            సోమవారం (22.7.24) నాటి వేకువ సంగతన్నమాట - దాదాపు 2 గంటలపాటు 9 మంది భవఘ్ని  నగర వాసులూ, 20 మంది యథా పూర్వకార్యకర్తలు చినుకుల్లో తడుస్తూనే గంగులవారిపాలెం వీధిని కలిసి కట్టుగా పరిశుభ్రపరచిన సంఘటన మది.

            సాధారణంగా చిన్న పిల్లలు ఇలాంటి చినుకుల్తో ఆటపాటల కేరింతల్తో సందడి చేస్తుంటారు. ఇందరు యువతీ యువకులూ, పెద్దలూ ఇంత ఉత్సాహంగా చీపుళ్ళతోనూ, కత్తులూ - దంతెలూ రంపాలూ డిప్పల్తోనూ ఉత్సాహంగా పారిశుద్ధ్య పనులు చేస్తున్న దృశ్యం అరుదు!

            ఇలాంటి సన్నివేశాలు చల్లపల్లికే ప్రత్యేకం. అధికారుల కోసం ఎదురుచూడక పరిపాలకుల కోసం బ్రతిమాలక - ఇలా ఎవరి వీధిని వారు కశ్మల రహిత, హరిత పుష్ప సంభరిత సుందరంగా నిర్వహించుకొనే మనోజ్ఞ దృశ్యాలు ఇకముందు చల్లపల్లి వీధులన్నిటిలోనూ చూడాలన్నదే స్వచ్చ కార్యకర్తల చిరకాల వాంఛితం!

            పనులు 4-5 రకాలుగా కనిపించినా ఈ 29 మందిదీ ఏకోన్ముఖ లక్ష్యమే - తమ వీధి ఏకోణం నుండి చూసినా కనువిందు చేయాలనే! (3 రోజుల్నాడు అమెరికా నుండి మా ఇంటికి వచ్చిన 4 గురు అతిథులు ఈ వీధి మలుపులోనే దీని ప్రత్యేకతను పసిగట్టారు! ఆ విధంగా స్వచ్చ సుందర కష్టజీవుల శ్రమదానం సార్థకమయిందన్నమాట!)

150 గజాల మేర - వానలోనే జరిగిన ఈ సామూహిక కృషి ఎలా ఉందంటే:

- ముగ్గురు ఓపిగ్గా మాజీ DSP గారింటి వెనుక - ముళ్లను కాచుకొంటూ గడ్డినీ, పిచ్చి మొక్కల్నీ తొలగించడమూ,

- తాత్కాలిక చెడువాసనగా, ఆరోగ్య భంగకరంగా భ్రమపడుతున్న ఏడాకుల చెట్లను 7-8 మంది రంపంతోనూ, కత్తుల్తోనూ ట్రిమ్ చేసే పనిలోనూ

- మళ్లీ పెద్దకొమ్మల్ని మట్టంగా నరికి, లాక్కెళ్లి గుట్టలుగా పేర్చే పనిలో మరికొందరూ

- మరో ఇద్దరు తమ కిష్టమైన వీధి మార్జిన్అందం పెంపుదలలోనూ!

            గంగులవారిపాలెం వీధి పారిశుద్ధ్య/సుందరీకరణలకు పాల్పడిన స్వచ్ఛ కార్యకర్తలు ధన్యులు, వారి చొరవతో ఇకముందు మరికొందరు శ్రమదానంలోకి వస్తే వాళ్లూ ధన్యులే!

            ఆస్పత్రి నర్సు పిండి నాగజ్యోతి తరుముతూ చెప్పిన శ్రమదానోద్యమ నినాదాలతోనూ,

            రేపటి ప్రయత్నం కూడ ఈ గంగులవారిపాలెం వీధిలోనే అనే నిర్ణయంతోనూ నేటి కార్యక్రమం ముగింపు!

            తెలుసుకొనే మొదలెట్టిన

శ్రమదానం అవశ్యకత చల్లపలికే గాదని

పర్యావరణం భద్రత ప్రపంచానికవసరమని

సౌందర్యోపాసన ఈ సకల జనుల లక్షణమని

తెలుసుకొనే మొదలెట్టిన స్వచ్చ సుందరోద్యమమిది!

- ఒక తలపండిన కార్యకర్త

 

   22.07.2024