పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి రాగల ప్లాస్టిక్కులు మనకేల?
ఉమ్మడి సౌకర్యార్ధం నేటి 28 మంది శ్రమార్పణం! - @3182*
రోజూ, తారీఖూ – మంగళవారమూ, 23.07.2024! స్థలం పొరుగూరి సరిహద్దులోని గంగులవారిపాలెం వీధి మధ్యన! చల్లపల్లి, రామానగరాలలో పాతిక - ముప్పై వేల జనులుండగా – ఈ పాతిక ముప్పై మందిని గురించే ఎందుకు ముచ్చటించుకోవాలి?” అంటే :
ఈ 9 + 19 మంది స్త్రీ - పురుష కార్యకర్తలు ఎవరి సొంతానికి వాళ్లు ఇంతకన్నా ఎక్కువ కష్టించినా దాని గురించి ఎందుకు ప్రస్తావించుకొంటాం? ఇది ఏ ఒక్కరి పనీ కాక - ఊరు మొత్తానికీ ఆహ్లాదకరమైన – ఆరోగ్యప్రదమైన శ్రమ కనుకనే పట్టిపట్టి వర్ణించుకోవలసి వచ్చింది! అది కూడ నెలకొకమారో – వారానికొకమారో మీడియా వారి దృష్టిలో పడే శ్రమదానం కాదు – 3182 రోజుల ఎడతెగని ప్రయత్నం!
ఈ బృందంలో 20 ఏళ్ళ కుర్రాళ్లు పెద్దగా లేకపోవడమొకలోటే! వీళ్ళ సగటు వయసు 50 కి తక్కువ ఉండదు - 65-75-85 వసంతాల కార్యకర్తలు పది మంది ఉంటారు. శారీరకంగా వీళ్లందరి శ్రమ సుమారు 2 గంటల చొప్పునే గాని - మరీ కొందరైతే మేల్కొన్న సమయమంతా ఊరి కోసం – మరిన్ని స్వచ్చ – శుభ్ర సౌందర్య కల్పనల కోసం ఆలోచిస్తూనే ఉంటారు కూడ!
ఆర్నెల్లు అమెరికాలో ఉండి వచ్చి, ఉషోదయానికల్లా కర్ర ఊతతో వచ్చిన 85 ఏళ్ల మాలెంపాటి డాక్టరు గారి ఉదంతాన్నే చూడండి; తాను ప్రతి నెలా గ్రామ శ్రమదానానికిచ్చే విరాళం బకాయిలతో సహా – 8,000/- చెల్లించిన స్ఫూర్తి ఎలాంటిది? ఆప్యాయంగా తోటి కార్యకర్తల్ని హత్తుకొని, చాక్లెట్లు పంచిన ఆదర్శమేమిటి?
మరొకామె - పల్నాటి అన్నపూర్ణ – ఏ అర్థరాత్రి నుండో గాని – ఒంటి చేత్తో పిండి వంటలు చేసి, తెచ్చి, కార్యకర్తలకు ప్రేమతో పంచిన సంగతీ అంతే!
భవఘ్ని నగర్ నుండి ఈ పూట కూడ ఏడెనిమిది మంది తమ వీధి శ్రమదాతలుగా మారారు. ఈ వీధి వాళ్లు గ్రామస్తులకూ, ఈ చల్లపల్లి దేశానికీ ఆదర్శమైనదిందుకే మరి! వేకువ 4.17 నుండి 6.10 దాక ఈ సందడి అలా జరుగుతూనే ఉన్నది.
ఇక అప్పుడు సీనియర్ మోస్ట్ కార్యకర్త - గోపాలకృష్ణయ్య గారు తొణకక – బెణకక ముమ్మారు చెప్పిన నినాదాలతోనూ,
DRK గారు రేపటి వేకువ గంగులవారిపాలెం సమీప NH 216 ప్రక్కన మొక్కలు నాటే ప్రకటనతోనూ నేటి శ్రమ సందడి ముగింపు!
సంస్కరించు ఉద్యోగమె!
దోమలీగపై యుద్ధమొ - మురుగులపై పోరాటమొ
స్వచ్చ శుభ్రతల యత్నమొ - సమైక్యతా సంఘటనమొ
ప్రతి వేకువ ఏదో ఒక ప్రాంతంలో నిర్వహించి
చల్లపల్లి నెటులైనా సంస్కరించు ఉద్యోగమె!
- ఒక తలపండిన కార్యకర్త
23.07.2024