3192* వ రోజు.............

పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మనకేల?

ఇదే 3192* వ నాటి శ్రమ వీర చరిత్ర!

          శుక్రవారపు (అగష్టు-2014) వేకువ 4.18 కే బందరు జాతీయ రహదారి మీద మొదలైన ఈ ప్రత్యేక చరిత్ర దశాబ్దకాలానిది, హంగూ- ఆర్భాటాలూ లేక ప్రచార సంరంభాలకు పోక సాదాసీదాగా  జరుగుతున్నది! చల్లపల్లి గ్రామంలో ఏదోక ప్రక్క, లేదా వెలుపలి రహదార్ల మీద, అదీ కాకుంటే ఏ శ్మశానంలోనో దినదినమూ 30-40-50 మంది శ్రమ సార్థక మౌతూనే ఉన్నది!

          ఇక-ఈ నాటి 50 పని గంటల కష్టం 26 మందిది; ఊరికి 2- 3 కిలో మీటర్ల దూరాన కాసానగర్ పెదకళ్ళేపల్లి బాటల మధ్య 200 గజాల రహదారి ఉత్తరాన 50 సువర్ణ గన్నేరు, 2 పారిజాత పూల మొక్కలు నాటిన సంతృప్తి అది!

          అంతకు ముందులా కాక- కాస్తంత సమతల ప్రదేశాన పని జరగడం వల్ల చకచకా ముగిసిన విషయమది. 6.00కు పని విరమణకు చాలముందుగానే పూల మొక్కల పని ముగిసింది గాని - మిగిలిన సమయంలో వాటి చుట్టూ గడ్డిచెక్కి, పిచ్చి చెట్లు పని బట్టిన కృషి!

          ఇందులో సగం పాదులైతే- కొందిరి కళాత్మక శ్రమ వల్ల ఎంత అందంగా కనిపిస్తున్నవో ఫోటోల్లో గమనించగలరు. గత 6 పని దినాల్లో వీరు నాటిన పూల చెట్లు 300. మరో మూడు నాలుగు వందల మొక్కలు రాబోయే రోజుల్లో నాటాలి! సమీప భవిష్యత్తులో ఈ 2 వరుసల మొక్కలూ  విరగబూస్తే- మూడో వరసలో పెద్ద వృక్షాల పసిమిమిసిమితో ఈ జాతీయ రహదారి అందచందాలను పట్ట శక్యమా?

          రోజూ వేలమంది ఈ దారంట వచ్చి పోతుంటారు, అందులో సగం మందైనా ఈ సుమ సుందర హరిత రహదారిని చూస్తూ ఆహ్లాదం పొందుతారు, ‘ఓహో ! ఇది స్వచ్చ - సుందర - హరిత చల్లపల్లి ప్రక్కగా వెళ్తున్న రహదారి కదాఅని గుర్తిస్తారు, కాని -

          ఈ అద్భుత దృశ్యాల వెనుక ఎందరు కార్యకర్తల శ్రమ ఉన్నదో-  ఎంత సమయ - ధన త్యాగమున్నదో అని ఎందరు తెలుసుకొంటారు?

          పెదమద్దాలికి ప్రయాణ కారణంగా DRK డాక్టరు గారు 20 నిముషాల ముందే నిష్క్రమించగా, రాయపాటి రాధాకృష్ణుల వారు రెచ్చిపోయి, రెట్టిస్తూ నినాదాలు  ప్రకటించగా,

          రేపటి వేకువ ఇంకొన్ని పూల మొక్కలతో ఇదే రహదారిని సింగారించడానికి మనం కాసానగర్ సెంటరు దగ్గరగా కలుసుకోవాలని తేల్చగా,

          నేటి శ్రమజీవన సౌందర్యానికి తెరపడింది.

            యాదృచ్చిక మసలె కాదు          

అనూహ్యమా - కాదు దీని కద్భుత నేపధ్య ముంది

యాదృచ్చిక మసలె కాదు - వ్యూహాత్మకమైనట్టిది

గాలి వాట మను కొనేరు- ఘన తాత్త్విక పునాది

చల్లపల్లి స్వచ్ఛోద్యమ శ్రమదానం గొప్పది!

 - ఒక తలపండిన కార్యకర్త

     02.08.2024