3200* వ రోజు....

పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మనకేల?

స్వచ్ఛ - సుందరీకరణ పనిదినాల మరొక ముఖ్య సంఖ్య - @3200*

         ఆదివారం (11-8-24) కావడంతోనేమో – 34 కు పెరిగిన కార్యకర్తల సంఖ్య!

         తలా గంటా 50 నిముషాల పాటు వీళ్లు సమర్పించుకొన్న శ్రమ జాతీయ రహదారి - 216 మీది బండ్రేవుకోడు వంతెన ప్రాంతంలో! ఎత్తైన వారధి కావడాన రోడ్డు ఉత్తరం దిగువన లోతు బాగా ఎక్కువ. ఐనా సరే – 65 - 75 ఏళ్ళ వారు వరిపొలానికి సమీపంలోకి చేరుకొని, రకరకాల పారిశుద్ధ్య పనులు చేశారు!

         వాటిలో మొదటిది డజను మంది కత్తుల్తోనూ, నలుగురు దంతెల్తోనూ బొత్తిగా పనికి రాని మొక్కల నరికివేత; ముగ్గుర్నలుగురు నిమగ్నమయింది గడ్డి చెక్కుడులో!

         రెండోది రహదారి మీది వంతెన ప్రాంతం శుభ్ర సుందరీకరణం! గోకుడు పారల్తో రోడ్డు కంటిన మట్టిని గోకే వాళ్లు, దాన్ని ప్రోగులు చేసి, డిప్పల కెత్తి, వానలకు కోసుకుపోయి పడిన గుంటల్ని పూడ్చేవాళ్లు, చీపుళ్లతో రహదారిని ఊడ్చిన వాళ్లు - వీళ్లలో సింహభాగం మహిళలే సుమా!

         ఇంకో కార్యకర్త అలవోకగా గోనె సంచీడు ప్లాస్టిక్ బాటిళ్లూ, పేట్లూ, కప్పులూ ఏరేశాడు. చూడదగిన మరో దృశ్యం 86 ఏళ్ల వృద్ధ పశువైద్యుడు 10 అడుగుల పల్లంలోకి దిగి, దంతెతో పిచ్చి మొక్కల గుట్టను పొలం గట్టు దగ్గర సర్దడం!

ఈ స్వచ్చ సుందర కార్యకర్తల మనస్తత్త్వం కాస్త విచిత్రంగానే ఉంటుంది. ఇందులో :

- ఒక్క రోజు శ్రమదానంలో పాల్గొననంత మాత్రాన తెగ ఫీలైపోయే వాళ్ళూ, ఎప్పుడే చిన్న సందర్భం దొరికినా చిన్నవో – పెద్దవో  చందాలిచ్చే వాళ్ళూ, వట్టి చేతుల్తో కాక – వచ్చేటప్పుడు వాలంటీర్ల కోసం పిండి వంటలో ఇతర తినుబండారాలో, జామపళ్ళో, కరివేపాకులో తెచ్చే వాళ్ళూ ఉంటారు!

         నేటి శ్రమ వేడుకకు 10 - 12 అడుగుల స్పాథోడియా చెట్టును తరలించు కొచ్చి, లోతైన పాదులో నాటి, ఆనందించడమే పరాకాష్ట! ఆ సమయంలో ప్రతి కార్యకర్త ముఖమూ ఆనందపరవశమైన ఛాయాచిత్రాన్ని చూడండి!

         ఇలాంటివి ఈ 30 రోజుల్లోనే వెయ్యికి పైగా నాటారు!

         మన శ్రమదానోద్యమ ప్రాతకాపు మిస్టర్. కోడూరు వేంకటేశ్వరరావు తన నెలవారీ 520/- చందా సమర్పణ కూడా ఆ చెట్టు సాక్షిగానే జరిగెను.

         ఆ చెట్టు సాక్షిగానే Dr. పద్మావతి గారు శక్తి కొద్దీ చెప్పిన స్వచ్చ సుందరోద్యమ సంకల్ప నినాదాలు!

         రేపటి పని చోటు ఇదే రహదారిలోని ఓల్డ్ క్లబ్ రోడ్డు కలిసే ప్రాంతం వద్దననే నిర్ణయమూ,

         7-8 మంది ఔత్సాహికులు చేసిన పరుగూ నేటి కార్యక్రమంలో చివరి అంశాలూ!

                  కనుచూపు మేరలొ

పరస్పర అనుబంధ మండగ - పట్టు విడుపుల ఒడుపులుండగ -

దశాబ్దపు అనుభవాలుండగ - బాధ్యతలతో మనసు నిండగ

శక్తియుక్తులు అండదండగ - సాగు శ్రమదానోద్యమం ఇది

కనుచూపు మేరలొ ఆది తప్ప అంతముండని మహత్తరమిది!            

- ఒక తలపండిన కార్యకర్త

     11.08.2024