3206* వ రోజు ....

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మనకేల?

ఫలప్రదమైన మరొక శ్రమయజ్ఞం! - 3206*

         ఇది స్థిరవారం - (17-8-2024) అది గంగులవారి పాలెం సమాంతరంగా మచిలీపట్నానికి 22 కిలో మీటర్ల దవ్వుగా – NH 216 వ జాతీయ మార్గం శ్రమ యాజ్ఞికులైతే మళ్లీ 25 మందే - నలుగురు మహిళలతో సహా - యజ్ఞ స్థలమైతే 160 గజాల ఉత్తరంగా - దక్షిణంగా 100 గజాలమేర!

         పని వివరాల్లోకి వెళితే - ఉత్తరం జాగాలో 80 పాదులు త్రవ్వడమూ, దక్షిణ దిశగా చిన్న తురాయి 20 పూల మొక్కలు నాటడమూ, మరి కాస్త విశదంగా చెపితే - పదేసి అడుగుల ఎడంగా పాదులు చేసుకుంటూ పోవడమూ,పూల మొక్కల్ని నాటడమూ!

         ఇంతోటి భాగ్యానికే - అదేదో మహా హరిత యజ్ఞమనీ, మహత్తర శ్రమదాన మనీ, లోకోత్తర దృశ్యమని వర్ణించడమా?” అని సందేహించకండి! ఈ సువిశాల భారతాన - 6 లక్షల గ్రామాల - 148 కోట్ల ప్రజా విస్తృతి గల దేశాన ఇలా చైతన్యవంతమైన ప్రజా సమూహాలు స్పందించి చేసే శ్రమ యజ్ఞమే తక్షణావసరం! పర్యావరణ శ్రేయస్కరం!

         “అయ్యో! పాతిక వేల జనాభాకి గాను పాతిక మందేనా ఈతరహా స్వచ్చ కార్యకర్తలు? వందా- రెండొందల గజాల రహదారేనా శుభ్ర హరిత సుందరీ కరణం?” అనే ప్రశ్నలిక్కడ అప్రస్తుతం!

         ఆ  పాతిక మందిలో ఆ  గంటన్నరలో రగిలిన స్ఫూర్తీ, పని సమయమైన 6.00 దగ్గర పడినప్పుడింకా 6 మొక్కలు మిగిలి పోతున్నవే అనే ఆందోళనా, పెంచిన పని వేగమూ, గమనించండి.

       కార్యకర్తలతో కలిసి, DRK గారు రేపటి శ్రమ వేడుక సంరంభ ప్రణాళికను రచించారు:

         దూర - సుదూర ప్రదేశాల్లో పని చేసిన - చేస్తున్న, లబ్ద ప్రతిష్ఠులైన 20 మంది వైద్యులు వందల కిలోమీటర్లు పయనించి, ఇదే చోట- అంటే నేడు స్వచ్చ - కార్యకర్తలు పాదులు చేసిన NH 216 -22 - 23 కిలో మీటర్ల నడుమనే 120 మొక్కలు నాటబోయే అరుదైన భావి సన్నివేశమది!

         ఆ సన్నివేశంలో వందలాది మన ప్రాత, కొంగ్రొత్త స్వచ్ఛ కార్యకర్తలు పాల్గొని ఆ స్వచ్ఛంద స్వచ్ఛ- హరిత - సుందరీకరణ మహోత్సవాన్ని విజయవంతం చేద్దాం!

         అనుశీలన పాలవెల్లి!

అధ్యయనం చేయదగిన- అభ్యాసమొనర్చదగిన

 ఆలోచన మీట గలుగు - ఆచరణకు పూనగలుగు

సర్వజనామోదము ఈ స్వచ్ఛోద్యమ చల్లపల్లి

అహం ఉపశమించ జేయు అనుశీలన పాలవెల్లి! 

ఒక తలపండిన కార్యకర్త

  17.08.2024