3207* వ రోజు....

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మనకేల?

           సామూహిక – సామాజిక శ్రమదానంలోని అసలైన మజా- @ 3207*

          ఈ ఆదివారం (18. 8. 24) వేకువ 2 గంటలకుపైగా చల్లపల్లికి దక్షిణంగా - 216 వ రహదారి వద్ద జరిగిన వన మహోత్సవం ఏకోణం నుండి చూసినా చిరస్మరణీయమైనదే!

         ఎక్కడెక్కడి నుండో- 3- నాలుగు వందల కిలోమీటర్లు ప్రయాణించి - తీరిక చిక్కని- లబ్ద ప్రతిష్ఠులైన - 67-70 ఏళ్ళ 22 మంది వైద్య ప్రముఖులు ఈ ఊరికి రావడమూ, రహదారి హరిత వేడుకలో పాల్గొనడమూ చిన్న విషయం కాదు!

         తొలి వెలుగు ప్రసరించకముందే వీళ్లు 120 పండ్ల - పూల- నీడ చెట్లను నాటుతున్న ఫొటోలు కూడ “జై స్వచ్ఛ చల్లపల్లి సైన్యం” వాట్సాప్ లో అందుబాటులో ఉన్నాయి!

         ఎప్పుడో అర్థ శతాబ్దం క్రితం గుంటూరులో కలుసుకొన్న లేత విద్యార్థులు మళ్లీ ‘స్వచ్ఛ సుందర చల్లపల్లి’లో ఈ వేకువ కలుసుకొని, మళ్లీ అలనాటి ఉత్సాహంతో దేశభక్తి గీతానికి నర్తించడం కూడ ఒక విశేషమే!

         ఆయనెవరో రామ్ తారక్ అట ! 68  ఏళ్లప్పుడు ఇంత చురుకూ – ఉత్సాహమూ చూస్తుంటే 16-17 ఏళ్ల వయసప్పటి పరిస్థితేమిటో!

         బలంగా వీచే గాల్నీ- త్రోసుకు వచ్చే నీటి ప్రవాహాన్నీ ఆపడం కుదురుతుందా? చీమకుర్తి జవహర్ వైద్యుని దాతృత్వమూ అంతే!  కాసేపు తోటి వాళ్లు అణిచి పెట్టినా- అతనిలోని దానకర్ణుని అంశ బైటపడనే పడింది! 

         70 ఏళ్ల పద్మలక్ష్మీ వైద్యురాలి అల్లరి గుణాన్ని, గోపాళం శివన్నారాయణుని చైతన్య తాండవాన్ని గమనించాను!

         ఇక పైన ప్రతి ఏడూ ఈ హరిత చల్లపల్లిలో కలుసుకొని, స్వచ్ఛ కార్యకర్తలతో మమేకమై, ఈ శ్రమదానోద్యమాన్ని అక్కున చేర్చుకోవాలనీ, ఆశీర్వదించాలనీ వాళ్ళ ఆలోచన !.

      ఈ పాతిక మంది 50  ఏళ్ల  చెలిమికి గుర్తుగా కాబోలు- కేకు ముక్కల పంపిణీ జరిగింది.

         “వైద్య సమూహంతో బాటు మొత్తం 72 మందీ తరిగోపుల పద్మావతీ ప్రవచిత స్వచ్ఛ సుందరోద్యమ ప్రతిజ్ఞా నినాదాలను అందుకొన్నారు.

         గ్రామ  సర్పంచి గారందుకొన్న కేంద్ర ప్రభుత్వ గౌరవ వివరాలను ఆలకించారు. ఈ మారుమూల పల్లెటూరులోని శ్రమదానానికి దేశవ్యాప్తంగా ఇంత గుర్తింపూ, మన్ననా, ఇందరు ప్రముఖుల అభిమానమూ చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతున్నది.

         ఇలాంటి ఉద్యమ విజయాల కోసం మొకంవాచిన ఇంకెన్ని సజాతీయ పక్షులు ఎక్కడెక్కడ ఎగురుతున్నాయో! అవన్నీ ఏదోక నాటికి చల్లపల్లి దారి పట్టకపోతాయా?

         చీమకుర్తి ప్రజా వైద్యుడు జవహర్ గారి 10,000/- ల  విరాళ వాగ్దానం కాక

గోపాళం దంపతుల5000/- చెక్కున్నూ, చల్లపల్లి ప్రముఖ పశు వైద్యులు శ్రీమాన్ గోపాల కృష్ణయ్య గారి 5000/- రూపాయల చెక్కు కూడ ఉద్యమ ఖర్చులకు జమపడినది.

         రేపటి మన శ్రమ కూడ 216 వ రహదారిలో గంగులవారిపాలెం దగ్గరి వంతెన వద్దనే ఆగి ప్రారంభిద్దాం!

 

                  “నేనూ, నా” దనేకన్న

         సత్సాంగత్యం ఉంటది - సత్సంభాషణముంటది.

          “నేనూ, నా” దనేకన్న ‘మనమూ, మనూ’రనే ద్యాస

          చిత్తంలో-మాటల్లో-చేతల్లో కనిపిస్తది

          వేకువ శ్రమదానం పవిత్రతేదొ తెలిసొస్తది!

 

           ఒక తలపండిన కార్యకర్త

            18.08.2024