3210* వ రోజు ....

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మనకేల?

స్వచ్చోద్యమ కారుల శ్రమదాన వీరం! - @3210*

            గురువారం (21.08.2024) నాటి శ్రమ వీరులు 20 మందే  గాని వారి సంఖ్యకూ జరిగిన కృషికీ పొంతనే లేదు. ఆ కష్టం వేకువ 4.13 – 6.05 సమయాలకు పరిమితం; “ఎన్ని వారాలు పడితే పట్టనీ ఈ  2.2 కిలోమీటర్ల 216 వ రహదారి స్వచ్చ శుభ్ర సౌందర్యాల ప్రత్యేకత చూపరులను కట్టిపడేయాల్సిందేఅనే పట్టుదల కార్యకర్తల కళ్ళలో సుస్పష్టం!

            ఒక్కసారి కమిట్ ఐతే ఇకవాళ్ళు అనుకొన్నది సాధించాక వదిలే రకాలు కానే కాదు. నిన్నా మొన్నటి రహదారి బాగుదలలో ఏవో చిరులోపాలున్నా యనిపించింది సగం మంది వీధి మార్జిన్ల మెరుగుదల పనిలో దిగారు పనంటే కొందరు గుత్తే దార్లు చేయించే ప్రభుత్వ కాంట్రాక్టు పనులా!

            తమ ఊరి ప్రతిష్టుని నిలిపేందుకు కంకణం కట్టుకొన్న స్వచ్చంద శ్రమదాతల పనులు గదా ఉదాహరణకు ట్రస్టు కార్మిక పర్యవేక్షకుడు వంచిన నడుమెత్తక బాట ప్రక్క గడ్డిని నున్నగా కోసుకుపోతున్న ఒక నర్సును మెచ్చుకొన్నట్లు ఎవరి శక్తి కొలదీ వాళ్లు చేసే ప్రయత్నాలు మరి!

            ఈ పూట ఒక పోస్టల్ ఉద్యోగి అందరికీ దూరంగా సిమెంటు రహదారి శుభ్రతకు ఒంటరి పోరాటం చేసిన

            పని సమయం ముగుస్తున్నా విరమించని నలుగురు పొలం అంచున గడ్డీ గాదం తొలగిస్తుండిన

            తమ పనిని బాగా ఆనందిస్తూ నేల మీద చతికిలబడి కొడవళ్ళతో కలుపును తప్పిస్తున్న

            వానకు కొట్టుకుపోయిన మట్టిని భర్తీ చేస్తున్న విడివిడిగా కనిపిస్తున్న సమిష్టి శ్రమలు! ఇక ఈ శ్రమ జీవులంతా

            - ఆకసాన ప్రసరిస్తున్న సూర్యుని తొలి కిరణాలను చూసే భాగ్యశాలురు!

            - రహదారికి రెండో ప్రక్క చల్లగాలికి తలలూపుతూ పసిమినీ, పూల సోయగాన్నీ ప్రకటిస్తున్న రంగారు బంగారు గన్నేరుల వైభవాన్ని ఆస్వాదిస్తున్న ప్రకృతి ప్రేమికులు!

            - కర్మ సాక్షి నునులేత కిరణాలకు తెలి మబ్బుల అంచులు వెండి బంగారు జలతారును సంతరించుకొంటున్న దృశ్యాలను చూసే అదృష్ట జాతకులు!

            స్వర్ణ గన్నేరు చెట్ల - ఆకుల - పూల ప్రక్కనే జరిగిన నేటి సమీక్షా సభలో ;

- త్వరత్వరగా ఉద్యమ నినాదాలను ప్రకటించినది వేముల శ్రీనివాసు

- స్వచ్చ కార్యకర్తల సుదీర్ఘ శ్రమ ఫలితంగా చల్లపల్లికి చెందిన దక్కిన జాతీయ పురస్కారాల సాయంత్రం 5 గంటల ప్రత్యేక సభకు పంచాయితి తరపున ఆహ్వానించినది  కార్య నిర్వహణాధికారి మాధవేంద్రరావు గారు..

- పూర్వా పరాలను సమీక్షించి, రేపటి కృషిని నిర్దేశించినది DRK గారు (మరొకమారు గంగులవారిపాలెం సమీప NH 216 వద్ద!) 

            చల్లని ఒక మంచి పల్లె

అందరి కాదర్శంగా అలరారెడి గ్రామ మేది?

వ్యక్తుల లాభం కన్న సమిష్టి సుఖం కోరునేది?

భూగర్భంలోనె మురుగు ప్రవహించే మంచి పల్లె?

చల్లని ఒక మంచి పల్లె పచ్చని మా చల్లపల్లి!   

- ఒక తలపండిన కార్యకర్త

   21.08.2024