పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?
3212* నాళ్ల అనుభవపూర్వక శ్రమ విశేషం!
ఇది శుక్రవారం – 23.8.24 వేకువ సమయానిది! ఒకరకంగా 29 మంది చల్లపల్లి గ్రామీణులది! ఇక వారిలో 86 ఏళ్ల వృద్ధ వైద్యుడు మొదలుకొని, గ్రామ సర్పంచి కృష్ణకుమారి, పాలనాధికారి మాధవేంద్రరావు - ఇలా విశిష్ట వ్యక్తుల సమ్మేళన మది!
పదేళ్లకు పైగా స్వచ్ఛ కార్యకర్తల సంతోషకర తొలి దినచర్యగా నిలుస్తున్న గ్రామ ప్రయోజనాత్మక సముచిత శ్రమ వాళ్ళ కెందుకు బోరు కొట్టదు? విసుగనిపించి ఎందుకు మానరు? అంటే –
- పని వేళ చతురోక్తులు విసిరే కొందరు కార్యకర్తల వల్ల,
- పని మధ్యలో కేకలు పెట్టే ఇంకొక భారీ కార్యకర్త సందడి వల్ల,
- ఆలోచింప చేసే అసంఖ్యాక సూక్తుల్ని ఒకానొక గురవయ్య వినిపించడం వల్ల,
- ఉతేజపరిచే పాటల్ని మరొక శ్రీనివాసుడు గానం చేయుట వల్ల!
ఈ వేకువ పని చేసింది రహదారికి ఉత్తరాన - బండ్రేవుకోడు వంతెన దిశగా,
చల్ల గాలి వీస్తున్నా - సగానికి పైగా వాలంటీర్ల బట్టలు చెమటతో తడిసి, నానింది వాళ్ళ గంటా ఏభై నిముషాల శ్రమ ఫలితంగా,
వాళ్ళు తమ శ్రమను మరిచిపోయింది - నేడో రేపో వానలు పడితే తాము తొలిగించిన కలుపూ - పిచ్చి మొక్కలూ, సవరించిన పాదుల్తో ఇన్ని వందల పూల మొక్కలు నవనవలాడుతూ, నేవళంగా పెరిగే దృశ్యాన్ని ఊహించుకొని!
నేటి శ్రమ కాలంలో మనల్ని బాగా ఆకట్టుకొనే ఒక సన్నివేశం. ఏదంటే - 69 ఏళ్ల కాలు బొత్తిగా బాగాలేని ఒక మాజీ VRO క్రింద కూర్చొని, కాళ్ళు బార్లా చాపి రహదారి మార్జిన్ ను చెక్కుతున్న దృశ్యమే!
ఇక నేటి తుది సమావేశంలో :
జిల్లా కలెక్టరు గారు పాల్గొనే గ్రామసభకు స్వచ్ఛ కార్యకర్తల్ని సాదరముగా ఆహ్వానించిన గ్రామ సర్పంచీ, కార్యనిర్వహణాధికారీ,
టంగుటూరి ప్రకాశం పంతులు గారి ఘనతను ఉగ్గడించిన గురవయ్య గురూత్తముడూ,
రేపటి మన కార్యక్షేత్రం NH 216 కు దక్షిణంగా ఉండునని నిర్దేశించిన డి.ఆర్.కె వైద్యుల వారూ......
సుసంపన్నం కాకున్నది?
‘సానుకూల స్పందన గల గ్రామం’ అను పేరున్నది
“క్రొత్తకు స్వాగతమిచ్చే ఉత్తము”లను మాటున్నది
మరి – శ్రమదానోద్యమమేల సుసంపన్నం కాకున్నది?
శతశాతం జనంలోన సంసిద్ధత రాకున్నది?
- ఒక తలపండిన కార్యకర్త
23.08.2024