3214* వ రోజు ... ....

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?

                              NH216 హరిత సుందరీకరణలోనే 3214* వనాడు!

            అసలే ఆదివారం - ఆహ్లాదకర వాతావరణం – జాతీయ రహదారిలో 22 వ కిలో మీటరుకు దగ్గరగా, ఇరువంకలా ఇప్పటికే పుష్పించిన సువర్ణ గన్నేరు, గద్దగోరు వంటి రంగుల పూలమయం - ఇక, అక్కడ 4.18 కే ఉద్యుక్తమైన స్వచ్ఛ కార్యకర్తల గణం - అది క్రమ క్రమంగా 38 సంఖ్యకు చేరిన వైనం!

            ఇక అక్కడ సందడి ఎంతగా ఉంటుందో - స్వచ్ఛ పని మంతుల ఉత్సాహం పరవళ్లు త్రొక్కుతుందో - అసలా శ్రమదాన దృశ్యం ఎంత ఆదర్శ మనోజ్ఞంగా ఉంటుందో ఊహించండి!

           కాస్త సామాజిక స్పృహ ఉంటే – గత పదేళ్లుగా చల్లపల్లి ఎలా పరిణమిస్తున్నదనే అవగాహన ఉంటే - సామూహిక శ్రమ ఫలితం పట్ల కొంచెం నమ్మకముంటే - అలాంటి వ్యక్తులు–

            వాళ్లు ఎన్నెన్నో ఖరీదైన వేడుకలు చూసి ఉంటారు – కాని కోట్ల ఖర్చుతో జరిగే ఐదేసి రోజుల పెళ్లిళ్లలో కూడ పొందలేనంత ఆనంద ఉద్వేగాలనిక్కడ పొందగలరు! ఎలాగంటే:

            ఈ సువిశాల సుందర రాదారి రెండుపక్కలా –

- కొందరు మహిళలు చీపుళ్లతో ఊడుస్తుండగా,

- నక్కులతో గోతులు తీసేవాళ్ళు తీస్తుండగా,

- పారలు ఖణేల్ మనే మ్రోతలు వినిపిస్తుండగా,

- ఇంత చల్లని వాతావరణంలోనూ చెమటలు చిందిస్తూ గునపాలతో కొందరు పాదులు చేస్తుండగా,

- నేరేడు, గద్దగోరు వంటి పూల మొక్కలు మొత్తం 45 నాటుతుండగా,

- యథా ప్రకారం మైకునుండి జిక్కి, ఘంటశాలల శ్రావ్య గానం వినిపిస్తుండగా,

- అసలిదంతా ఏ ఒక్కరి స్వార్థానికో కాక ఊరి ఉమ్మడి ప్రయోజనార్థం జరుగుతుంటే

ఆలోచించగల ఎవరైనా ఆనందించకుంటారా?

(ఆలోచించడం అంటే ఊకను దంచడంకాదు- ఊహను పెంచడం

ప్రజల వ్యధల్ని చించడం

ఆహ్లాద సుధల్ని పంచడం... శ్రీశ్రీ)

తీరాచూస్తే ఈ శ్రమ సందడి ముగిశాక - 6. 20 కి సమీక్షా సభ మొదలయింది. చల్లపల్లి స్వచ్ఛ- సుందర - సాంప్రదాయ నినాదాలతో దాన్ని ప్రారంభించినది రెవిన్యూ ఉన్నతోద్యోగి తూము వేంకటేశ్వర మహోదయుడు!

            షణ్ముఖ - వేముల వంశవర్ధనుడైన హేమంత్ సకుటుంబంగా వచ్చి, నేరేడు మొక్కను నాటి, తల్లిదండ్రుల – గురువుల సహకారంతోనే తాను CMA (చార్టెడ్ మేనేజ్ మెంట్అకౌంటెన్నీ ) కోర్సులో జాతీయ స్థాయిలో 36 వ ర్యాంకు పొందినట్లు ప్రకటించడమూ, శ్రమదానోద్యమ ఖర్చులకు 2000/- విరాళమీయడమూ,

            నిగర్వి అగు ఆ యువకుడు సాధించిన ఘనతనూ, సామాజిక స్పృహనూ అందరూ అభినందించడమూ

(నిన్న రామానగరానికి  చెందిన మిలటరీ శ్రీను 500/- రూపాయల వీరాళాన్ని  కొందరు గుర్తుచేసుకోవడమూ)

రేపే కాదు – ఈ నెలంతా మన శ్రమ ఈ 2.2 కిలోమీటర్ల రహదారిలోనే అని DRK గారు ప్రకటించడమూ....

           సదానంద చల్లపల్లి

డ్రైను సిల్టుతోడడమూ, చెట్లెక్కుట సరదానా!

వీధులెక్కి కావాలని వేషాల ప్రదర్శనమా!

నిజంగానె ఊరిపట్ల నిర్భర మమకారమా!

సదానంద చల్లపల్లి సాధించే నమ్మకమా!

- ఒక తలపండిన కార్యకర్త

   25 .08.2024