పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?
స్వచ్ఛ సుందరోద్యమంలో అక్షరాలా 3217* వ నాడు!
బుధవారం - 27-8-24 వ పూట సదరు తొలి శ్రమ సంసిద్ధులు 8 మందైతే - చివరకు కష్ట జీవులంతా కలిసి 24 గా లెక్క తేలింది! పని చోటైతే - మూడు వారాల నాడు మొదలెట్టిన నూకలవారిపాలెం డొంక నుండి NH216 ప్రక్కన క్రొత్తగా కడుతున్న కళ్యాణ మండపం దగ్గర - సుమారు కిలోమీటరు దూరంగా!
స్వచ్ఛ – శుభ్ర - సౌందర్యాల పట్ల పెద్దగా పట్టింపులేని వాళ్ళైతే - సమాజం బాగుంటేనే మనం సంతోషంగా ఉండగలమనే స్పృహ లేని మనుషులకైతే ఈ స్వచ్ఛంద శ్రమదాతల పనులు - అంటే ఊరికి దూరంగా రహదారుల ప్రక్క మొక్కల్నాటి పెంచే – గడ్డి తొలగించే - తమ నట్టిల్లులాగా ఊడ్చి శుభ్రపరిచే - పనులు అర్థం లేనివిగా తోచవచ్చు!
అట్టివాళ్ళైనా ఈ పదేళ్లలో చల్లపల్లి ఎంతగా మారిందో – ఏ ఊళ్ళలోనూ లేనంతగా ఈ ఒక్క ఊరే స్వచ్ఛ – శుభ్ర - హరిత సౌందర్య ప్రపూర్ణమయిందో కాస్త మనసు పెట్టి ఆలోచిస్తేనే – ఈ మార్పు వెనుక ఎంతటి కష్టం ఉందో తెలుస్తుంది!
ఈ వేకువ 4.13 కి మొదలై, 6.07 దాక 216 వ రహదారికి సమర్పితమైన 35 పని గంటల శ్రమతో అక్కడ వచ్చిన మార్పేదనగా :
- గతంలో పెట్టి బ్రతికించిన సుమారు పాతిక సువర్ణ గన్నేరు, గద్దగోరు వంటి పూల మొక్కల పాదుల కలుపు తొలగి, కంప కట్టిన త్రాళ్లు ఊడితే సరిచేయబడ్డాయి!
- బాట మార్జిన్లోని గడ్డి కుదిమట్టంగా తెగిపడింది. 10 మంది కత్తుల్తో శ్రమించిన పనిని ఒక్క ఆకుల కార్యకర్త చేశాడంటే- అదేనాడో ధ్యానమండలి వారు ‘మనకోసం మనం’ ట్రస్టుకు బహూకరించిన గడ్డి కోత యంత్ర సాయంతోనే!
- ఇద్దరు కార్యకర్తలు గంగులవారిపాలెం వైపు రోడ్డు శుభ్రతలో మునిగారు!
చివరగా 6.20 కి జరిగిన సమావేశం :
- వేముల శ్రీనివాస కళాశాలోపన్యాసక గళం నుండి త్వరగా ప్రకటింపబడిన శ్రమదాన నినాదాలతో మొదలై
- 30 వ తేదీ (ప్రభుత్వ) వన మహోత్సవ సన్నాహంగా రేపు ఇదే 216 వ రహదారిపైన – పాదులు త్రవ్వే పని ప్రణాళికతో ముగిసింది!
స్వచ్ఛ కార్యకర్తల శ్రమ పాత్ర
ప్రజారోగ్య విషయంలో - పచ్చదనం పెంచుటలో –
పరిసరాల శుభ్రతలో – విరి తోటల అమరికలో
గత దశాబ్ద కాలంగా గ్రామ క్రొత్త చరిత్రలో
స్వచ్ఛ కార్యకర్తల శ్రమ పాత్ర మరువదగనిదే!
- ఒక తలపండిన కార్యకర్త
28.08.2024