1969*వ రోజు....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం! 

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం 1969* వ నాటి శ్రమదాన సందడి.

          ఈ నాటి వేకువ 4.10 – 6.10 సమయాల మధ్య 35 మంది కార్యకర్తల శ్రమ దీక్షతో చల్లపల్లి లోని మూడు ప్రాంతాలు – 1) విజయా కాన్వెంట్ పరిసర ప్రాంతం 2) Z.P స్కూలు ప్రాంగణము 3) కమ్యూనిస్ట్ వీధి స్వచ్చ – శుభ్ర – సుందరములై కనిపించినవి.

          యధావిదిగా గ్రామ రక్షక కార్యకర్తలు మళ్ళీ చిల్లలవాగు వంతెన నుండి విజయవాడ దారి కుడి వైపు మొండి చెట్లను సమంగా రంపం తో కోసి కాటా ప్రదేశం దాక సుందరీకరణ ప్రయత్నం చేశారు.

          15 మంది చీపుళ్ళ -  గొర్రుల – దంతెల స్వచ్చ దళం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణ లో ప్రవేశించి అక్కడి సగం ఎండు కంపను, పిచ్చి మొక్కలను, గడ్డిని నరికి చెక్కి లాగి పోగులు చేసి పాఠశాలకు స్వచ్చ శుభ్రతలు నేర్పారు. విజయవాడ రహదారికి పాఠశాల ఆవరణకు మధ్య భాగమంతా వీరి శ్రమతో ఇప్పుడు చూడముచ్చటగా మారిపోయినది.

          కొద్ది మంది పాఠశాల ప్రవేశ ద్వారం ఎదుట – రోడ్డుకు దక్షిణ భాగంలో డ్రైను ను శుభ్రపరిచారు. మిగిలిన వారు విజయా కాన్వెంట్ – కస్తూర్భా వైద్యశాల మధ్య బాటను, ఉభయ మురుగు కాల్వలను, గడ్డిని, పిచ్చి మొక్కలను, చెత్తను సమీకరించి పోగులు చేశారు.

          నలుగురు కార్యకర్తలు Z.P స్కూలు ప్రాంగణంలోని కలుపు మొక్కలను తీసివేసి శుభ్రం చేశారు.

          కమ్యూనిస్ట్ వీధిలో నెల రోజులుగా సుందరీకర్తల ప్రహరీ గోడల సుందరీకరణం ఈ రోజు కూడా కొలిక్కి రాలేదు. దానిమ్మ పళ్ళు, గోడల అడుగున గడ్డి పూలు, చిన్న గోడల మీదైతే వివిధరకాల పుష్పాల చిత్రాలు వేసుకుంటూ పోతే ఈ వీధి సౌందర్యం ఎక్కడి దాక వెళుతుందో! (ఈ వీధిని చూసిన వారికి గ్రామంలోని ఇతర వీధులు ఎలా నచ్చుతాయో మరి!)

          నిన్నటి చెక్ పోస్ట్ విశ్రాంత ఉద్యోగి కోడూరి వేంకటేశ్వరరావు గారి 520 రూపాయల విరాళానికి మనకోసం మనం ట్రస్టు వారి ధన్యవాదపూర్వక రశీదు ముట్టినది.      

          రేపటి స్వచ్చ శ్రమదాన నిర్వహణం కోసం నడకుదురు మార్గం ప్రక్క ఇంధన నిలయం (పెట్రోల్ బంక్) దగ్గర కలుసుకొందాం!

          సుదీర్ఘ సంస్కరణం నిజంగా?

కళాశాలల యువజనులకూ పాఠశాలల పిల్లలకు ఒక

స్వచ్చ సుందర కళాశాలగ చల్లపల్లే వెలుగుతోందని

బుద్ధి జీవుల – మంత్రి వర్యుల పొగడ్తలె వాస్తవములైతే

చల్లపల్లిని స్వచ్చ సైన్యం సుదీర్ఘ సమయం సంస్కరించిందా!

నల్లూరి రామారావు

స్వచ్చ చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

గురువారం – 02/04/2020

చల్లపల్లి.