3229* వ రోజు ... ....

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?

మంగళవారం (10-9-24) నాటి శ్రమానందం 26 మందిది! - @3229*

            అది వేకువ 4.11-6.10 మధ్యస్తం! చాల మంది బైట వాళ్ళకు నమ్మశక్యం కానివీ, అర్ధం కానివీ స్వచ్చ  కార్యకర్తల పని వేళలే! ఒకటికి నాల్గు మార్లు ప్రత్యక్షంగా చూసి గాని ఇది నిజమని నిర్ధారించుకొంటున్నారు! ఈ పని సమయమే కాదు - వాళ్ల బహిరంగ, అంతరంగిక సమావేశాలు సైతం వేకువ నాల్గు ప్రాంతంలో మొదలై, 6.30 ప్రాంతంలో ముగుస్తుంటాయి! ఎవరి దైనందిన విధులకూ ఆటంకం కలగకుండా

            పైగా ఈ బ్రాహ్మీముహూర్త శ్రమదానం కార్యకర్తల ఆరోగ్యానికీ మంచిదనే సీనియర్ డాక్టర్ల ఉవాచ! ఆ సమయం వీధి సంచారాలు తక్కువగా ఉండే అనుకూల కాలం కూడ!

            ఈ ఉదయం దాక వరుణుడి జాడ లేదు. చల్లగాలి కూడ కాస్త అణకువగానే వీచింది. మరి ఇలాంటప్పుడే పరిశీలించాలి స్వచ్ఛ కార్యకర్తల శ్రమరీతులు! ఇంతమంచి చల్లని వేళ కూడ ఏడెనిమిది మంది చొక్కాలు చెమటతో తడవడమే కార్యకర్తల కష్టానికి తిరుగులేని సాక్ష్యం!

            ఈ వేకువ కూడ అదుపు తప్పిన మహా వృక్షాలెక్కి కొందరు ఆ కొమ్మల్ని శిక్షించారు. క్రింద పడ్డ కొమ్మల్ని ముక్కలు కొట్టి, గంగులవారిపాలెం వీధి మలుపు ఖాళీ స్థలంలోకి ఈడ్చుకుపోయి, గుట్టగా పేర్చారు.

            అదే సమయమో తెలియదు గాని, ఒక పొడుగైన కార్యకర్త జారిపడిన వదంతి వినిపించింది. ఐతే ఇది నిజం కాకపోవచ్చు - అంత గట్టి పర్యవేక్షక కార్యకర్త పడిపోవడమా?

            ఇన్నేళ్ళ నుండీ దగ్గరగా పరిశీలిస్తున్నా - నాకు ఇప్పటికీ ఆశ్చర్యం కలిగించే విషయమేమంటే అసలింత మంది వివిధ వర్గాల, సామాజిక నేపధ్యాల, వయోభారాల, శరీర లోపాల, 3 గ్రామాల కార్యకర్తలు 4.30 కాక ముందే - ఏదో ఒక పనిచోటికి చేరుకొని, సామాజిక శ్రమదానం చేసి, సరదా కబుర్లు చెప్పుకొని ఇళ్లకు చేరడం!

ఎన్నోమార్లు నేను ప్రస్తావించినట్లు

1) మహిళల రోడ్ల ఊడ్పూ,

2) ఏడెనిమిది మంది కత్తుల వారి వీధి మార్జిన్ల గడ్డి చెక్కుడూ,

3) తదేక దీక్షగా ఇద్దరి పూల చెట్ల మితిమీరిన కొమ్మల కత్తిరింపూ వంటి వన్నీ సవివరంగా వ్రాసే అవకాశం లేకనే ఇలా టూకీగా వ్రాస్తున్నాను!

            ఈ నడుమ కొన్నాళ్లు రావడం కుదరని తాతినేని వెంకట రమణుడే ఈ నాటి స్వచ్ఛ సుందరోద్యమ నినాదకర్త!

            ఇదే గంగులవారిపాలెం వీధి వంతెన దగ్గర పనుల కోసం మనం రేపటి రేపు కలువదగిన చోటే భవఘ్ని నగరానంతర తొలిమలుపు!

            ఇది కేవల స్వయంకృతం

ఇది శత్రువు చెరుపు కాదు గత జన్మల ఖర్మకాదు

విదేశాల కుట్ర లేదు - పులుల మీద పుట్రకాదు

ఇది కేవల స్వయంకృతం - దీన్నాపుట సులభతరం

చల్లపల్లి స్వచ్చోద్యమ మిందుకొక ఉదాహరణం!

- ఒక తలపండిన కార్యకర్త

   10.09.2024