పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?
3230* వ నాటి శ్రమదాన కథనం!
అనగా – బుధవారం (11.9.24) వేకువ సమయపు కాయకష్టమన్నమాట! ఎప్పుడు నిద్రమేల్కొని - ఇళ్ళకూ ఊరికీ దూరంగా పయనించి బండ్రేవుకోడు కాల్వ ఒడ్డుకు చేరుకొన్నారోగాని, స్వచ్చ కార్యకర్తల ఉనికికి సాక్ష్యం మాత్రం 4.10 వేళ తెలిసింది! వెంటనే శ్రమ గాథ మొదలయింది!
మునుముందుగా నాలుగు రోజుల్నుండీ ఖాళీ స్థలంలో ఉన్న కొమ్మరెమ్మల్ని క్రమ పద్ధతిలో అమర్చే పని. ఆ తరువాత మామిడి మొక్కల వెలుగూ – వేడీ మ్రింగేస్తున్న 2 పెద్ద పెద్ద చెట్ల కొమ్మల్ని అదుపు చేసే బరువు పని.
ఏడెనిమిదేళ్లనాడు తామే నాటి, పాదులు త్రవ్వి, కంపకట్టి, నీరు పోసి గారాంగా పెంచిన సదరు ఏడాకుల వృక్షాలను మొహమాటం లేకుండా - ఖండ ఖండాలుగా శిక్షించిన ఒకానొక షష్ట్యబ్ద విశ్రాంత ఉద్యోగి! అతడిని ప్రోత్సహించి, చెట్టెక్కించిన 3 గ్గురు కార్యకర్తలూ!
అవలీలగా కొమ్మల్ని నరుకుతూనే 3 భాషల్లో అనర్గళంగా (వ్యాకరణం - గీకరణం జాన్తానై) ఉపన్యసించడం వల్ల కాబోలు - అతనికి చెమటల దిగకారుడు!
నేటి శ్రమగాథలో మరో ఘట్టం - ఆరేడుగురి బాటకు ఉత్తరం గట్టు పరిశుభ్ర సుందరీకరణం. వాళ్లు శ్రమించింది ఎగుడుదిగుడు అసమ ప్రాంతం!
వారిలో ఇద్దరికైతే చాల పోలికలున్నాయి - ఇద్దరూ విశ్రాంత ఉన్నతోద్యోగులే, అరవై మూడో-అరవై నాలుగో వయోధికులే, ఉభయులూ వచ్చిన దగ్గర్నుండి DRK గారి పని విరమణ విజిల్ మ్రోగేదాక ప్రశాంతంగా - తదేక దీక్షగా – కూర్చుని పని చేసుకుపోయే ఆదర్శ శ్రామికులే! (- వీళ్లెవరైయుంటారో కనిపెట్టండి -)
ఇక ఈ 2 రకాల కష్టజీవులు కాక – గొర్రూ, కత్తుల్తో పనిచేస్తూనే – తోటి కార్యకర్తల్ని హుషారు చేస్తూ శ్రమదానాన్ని సందడి మయం చేసే వ్యక్తులూ ఉన్నారు!
దూరంగా కర్షక కార్యకర్తలు మురుగు నీటి అంచున – దట్టమైన గడ్డిలో చెమటలు కారుస్తున్న దృశ్యమూ –
వీధి మలుపు వద్ద రామలక్ష్మణ కార్యకర్తలు ఎడతెరిపి లేకుండా కత్తుల్తో కొమ్మలు నరుకుతూ, షెడ్డర్ యంత్రానికందించడానికి గుట్టలుగా పేరుస్తున్న మరొక కష్టతర విషయమూ –
బాగా తెల్లారాక - చూసేవాళ్ళకు రోడ్డెక్కడ అందవిహీనంగా అనిపిస్తుందోనని - ఒక ప్రముఖ వైద్యుడూ, ముగ్గురు మహిళలూ అద్దంలా ఊడుస్తున్న సంగతీ...... ఇలా నేటి శ్రామిక గాథలో ఎన్ని విశేషాలో!
అందరి కాఫీలూ కబుర్లూ ముగిశాక –
ఏదో నాకు తోచినట్లు నేను గ్రామ స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలు వినిపించి ఊరుకోక - ఒక దినపత్రికా సంపాదకీయం – ఆత్మహత్యా దినోత్సవం నాటిది చదివి, ఒకరిద్దరి సహనానికి పరీక్ష పెట్టాను!
రేపటి వేకువ మనం కలుసుకొనేది ఈ బండ్రేవు కోడు కాల్వ (గంగులవారిపాలెం) వీధిలోనే గాని - వంతెన సమీపంలోనట!
‘కేస్ స్టడీ’ గా నైనా
అత్యాశా ప్రయత్నమే అంటారా చల్లపల్లి
స్వచ్చ శుభ్ర - సౌందర్యాల సాధననూ - సంస్కృతినీ?
ప్రయత్నించకుండుకంటె ప్రయత్నించడమే నయం
కేవలమిది నిలువగలదు – ‘కేస్ స్టడీ’ గా నైనా!
- ఒక తలపండిన కార్యకర్త
11.09.2024