పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?
తగ్గిన సఖ్యా బలం - తగ్గని కార్యకర్తల శ్రమదానం! - @3235*
సోమవారం (16-9-24) వేకువ కాలపు సంగతి అది. ఏమైనా ఆదివారం ఆదివారమే! ఈ పూట మాత్రం వాలంటీర్ల బలగం 20 కి పడిపోయింది. ఐతే - పని ఉరవడీ, శ్రమ సందడి ఏమాత్రం తగ్గలేదు!
పని సందడికీ, అదిలింపుకీ ఒక కోడూరాయనా, పారిశుద్ధ్య పనినీ కూనిరాగాన్నీ మిళితం చేసే నందేటాయనా ఉండగా, హుషారుకు లోటేముంటుంది! మురుగు ప్రవాహం బడ్డున భారీ ఏడాకుల చెట్టును కూల్చడానికి 8 మంది ప్రణాళికా, రంపం మ్రోతా, ట్రాక్టర్ చప్పుడూ, క్రింద కొరిగిన కొమ్మల్ని నరుకుతున్న ఒడుపూ, నరికిన వాటిని మూలమలుపు జాగాల్లోకి లాక్కెళ్తున్న బరబరలూ, కార్యకర్తల పరస్పర హెచ్చరికలూ... సందడికేం లోటు?
అక్కడికి దూరంగా - ఒకరిద్దరి సాయంతో మురుగు నీటి అంచున ఆకుల – కొమ్మల - రెమ్మల శయ్య నేర్పరస్తున్న పాటలాయనా, ఆరామ్ గా రోడ్డు ప్రక్కన గాజు - ప్లాస్టిక్ సీసాలు ప్రాగేస్తున్న తెల్ల జుట్టు మనిషీ,
వంతెన దాటాక – జాతీయ రహదారిదాకా వంగొనీ, కూర్చొనీ వీధిని మరింత శుభ్రపరుస్తున్న 10 మంది సహేతుక సార్థక శ్రమజీవులూ,
- ఇలా ఎప్పటి వలెనే ఒక ఆదర్శ గ్రామ తయారీలో జరగవలసిన కృషి జరిగిపోతూనే ఉన్నది! ఏం చేస్తాం – పదేళ్ల నుండీ ప్రతి వేకువా తలా గంటన్నర అమూల్య సమయాన్ని సొంతూరి బాగుదలకు అంకితం చేసిన శ్రామికులు మరి! చెప్పాలంటే అదో రకం వ్యసనపరులు!
4.17 నుండి ఇటు ఉత్తర గట్టు బాటా, అటు వంతెన దక్షిణపు రోడ్డూ ఊడ్చేశారు, మామిడి మొక్కలకు దెబ్బ తగలకుండా పెద్ద చెట్లను తొలగించారు, మొత్తమ్మీద “ఇదీ స్వచ్చ సుందర చల్లపల్లి వీధంటే” అని స్పష్టం చేశారు!
కాఫీ తేవడం లేటయిందేమో – 6.10 తర్వాత గానీ ఈ పూట శ్రమ విరమణ జరగలేదు. ఇక – అప్పుడందుకొన్నాడు అడపా గురవయ్య మైకును - అణచి పెట్టి ప్రాతదీ – క్రొత్తదీ సూక్తులు వినిపించే ముందు వీలైనంత గట్టిగా విన్పించాడు నినాదాలు.
స్వచ్చ కార్యకర్తలకు దినదినమూ శ్రమానందం సరే – DRK గారి ఏదో ఒక వైద్యహిత వచనం బోనస్సన్నమాట! హృదయం పదిలతకు Dr. సత్యన్నారాయణ గారు చెప్పిన ఆహార పద్ధతుల్ని గుర్తు చేశారు!
రేపటి శ్రమ స్ధలి కూడ గంగులవారిపాలెం 2 రోడ్ల కూడలి నుండేనని తెలిసింది!
క్రింది చిత్రంలో ఉన్న, బహుముఖ ప్రజ్ఞాశాలి, 85 ఏళ్ల రైతు, గౌరవనీయ గొర్రెపాటి పార్థసారధి గారిని చూశారా?
తన 85 ఏళ్ల వయసుకు గుర్తుగా 8500/- ఆర్ధిక సహాయాన్ని "మనకోసం మనం" మేనేజింగ్ ట్రస్టీ గారికి సమర్పిస్తున్న ఔదార్యమది! వారి సామాజిక బాధ్యతకు కృతజ్ఞతాంజలి!
అంత తేలికేమి గాదు
ఔను సుమీ నీవన్నది – అంత తేలికేమి గాదు –
ఇన్ని ఊరి వీధుల్నీ వార్డుల్నీ సరిజేయుట!
ఊరి చుట్టూ రహదార్లను హరితమయం గావించుట!
గ్రామంలో అందర్నీ శ్రమ చేయగ తరలించుట!
- ఒక తలపండిన కార్యకర్త
16.09.2024