పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?
3236* (మంగళవారం – 17.9.24) వ శ్రమదానం!
ఆ ఎడతెగని శ్రమదాతలీనాడు (ఇద్దరు పంచాయతి అధికారులతోసహా) 27 మంది! ఇందులో 8 మందిది గంగులవారిపాలెం వీధి తొలిమలుపూ, బండ్రేవుకోడు కాల్వ ఉత్తరపు గట్టుల వద్ద. మిగిలిన వారి ప్రయత్నం వంతెన దక్షిణంగా - బాట పడమరల అంచుల దగ్గర!
“ఏమున్నదంతగా గలీజు మూడు-నాలుగు రోజులుగా వీళ్ళు బాగుచేయడానికి? వీళ్ళ శ్రమదానం కాస్త ‘అతి’ గా కనిపిస్తున్నదే!” అనిపించవచ్చు యదాలాపంగా చూస్తూపోయే మనబోటి వాళ్లకి! కాని ఈ కార్యకర్తల్లో చాలమంది వీధి పారిశుద్ధ్య విషయంలో ఏమాత్రం రాజీపడని పర్పెక్షన్ గాళ్లు! ఏ చిన్న లోపం కనిపించినా ఒప్పుకోరు మరి!
అదీ గాక - ఈ బాటకూ, వరిపొలానికీ నడుమ కొన్ని మొండి తాటి చెట్లూ, పిచ్చి మేడి మొండి చెట్లూ ఉన్నాయి! వాటిని తొలగించందే – సుందరీకరించందే వీళ్లకి సంతృప్తి ఉండదు! ఐతే – పని సమయంలో - అంటే చీకటి వేళ కొన్ని ఇనుప బోర్డులడ్డంగా పడి ఉంటే – నెమ్మదిగా పనిచేయవలసొచ్చిందీ కూడా!
ఇక వీళ్ల కత్తుల కెర ఐన పిచ్చి మొక్కల, తీగల వ్యర్ధాల్ని ఊడ్చే, ప్లాస్టిక్ వ్యర్థాల్ని సేకరించే పనిని ముగ్గురు నిర్వర్తించారు!
ఇక్కడికి ½ కిలోమీటరు దూరంగా కాల్వ గట్టున - మామిడి మొక్కలు మెరుగుదల నడ్డుకొంటున్న ఏడాకుల చెట్ల పరిమిత ఖండనం అష్టకార్తకర్తల డ్యూటీ! ఈ వేకువ ఎవరెవరు చెట్లపైకెగ బ్రాకి, నరికారో, మరరంపం తెగకోసిన చెట్టేదో చూడలేకపోయాను.
ఆ కొమ్మల్ని మూలమలుపు ఖాళీ జాగాలో గుట్ట అమర్చడం మాత్రం చూశాను. ఆ కొమ్మలీ మధ్యాహ్నం షెడ్డర్ కోరలకు బలై, మొక్కలకు సహజ ఎరువుగా మారుతుంది!
6.20 తర్వాత రహదారి కూడలిలో ముందుగా స్వచ్ఛ కార్యకర్తల శ్రమను కీర్తించి, ఉదయం 9 గంటలకు జిల్లా కలెక్టరు గారు పాల్గొనే ప్రభుత్వ ప్రాయోజిత మానవహరంలోనికి వారినాహ్వానించినవారు పంచాయతి అధికారి మాధవేంద్రరావు గారు!
నినాదాలు ప్రకటించింది ఒక అత్సుత్సాహ శ్రమవీరుడు రాజు గారు! కొంతనలతగా ఉన్నా వచ్చి, శ్రమించి, కార్యక్రమాన్ని పర్యవేక్షించింది DRK గారు!
ఏదో ఒక మిషతో కార్యకర్తలకి అల్పాహారం పంచే అలవాటుచొప్పున పప్పుచెక్కలు తినిపించింది శాస్త్రి గారే! నేటి కారణం వారి మనుమడు ప్రాతూరి వివేక్ జన్మదినమట!
అందరం ఏకరూప దుస్తుల్తో 9.00 కు సెంటర్లో హాజరౌదాం!
రేపు ఉదయం గంగులవారిపాలెం - రహదారి కూడలిలో కలుద్దాం!
ఓరయ్యో విఘ్నేశ్వర!
హరిత పుష్టభరితంగా – కాలుష్య విరహితంగా
చల్లపల్లిని మార్చేస్తే - స్వస్థతలను పెంచేస్తే...
ఓరయ్యో విఘ్నేశ్వర! ఉండ్రాళ్లు సమర్పిస్తాం,
స్తోత్రాలను చదివేస్తాం, పూజలు సైతం చేస్తాం!
- ఒక తలపండిన కార్యకర్త
17.09.2024