3238* వ రోజు ... ....

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?

3238* - గురువారపు పని నిబద్ధత!

          నిబద్ధత 24+2 మందిది. 19.9.24 వేకువ మొదలైన వీధి పారిశుద్ధ్య కష్టం గంగులవారిపాలెం వీధిలోనే 3 చోట్ల - 3 రకాలుగా - గంటా 50 నిముషాల పాటు కొనసాగింది.

ఒక వరుసలో చెప్పుకుపోతే :

- ఇద్దరు కార్యకర్తలు పద్మాభిరామంలోని చిందరవందరగా పెరిగిన లాన్ గుబుళ్లను తొలగించే పనిలో మునిగి, మరచప్పుడుతోనూ, పనిపట్ల శ్రద్ధతోనూ ఎవరు పిలిచినా పట్టించుకోలేదు ముగింపు సభకు రానూలేదు!

- 8 మంది మురుగు కాల్వ వంతెన దగ్గర 3 ఏడాకుల చెట్లను విజయవంతంగా హత్య గావించారు. అందుగ్గానూ ఒక మర రంపం, ట్రాక్టరు సాయం తీసుకొన్నారు. క్రింద పడ్డ కొమ్మల్ని నరికి, మూలమలుపు వద్దకు చేర్చి గుట్ట అమర్చారు!

- ఎక్కువ మంది కార్యకర్తలకు చేతి నిండా పని కల్పించింది మాత్రం NH216గంగులవారిపాలెం ఉత్తరపు చోటే, సంవత్సరం క్రిందట పాతిక మంది వైద్య బృందం ఎక్కడెక్కడి నుండో వచ్చి నాటిన సువర్ణ గన్నేరు బాగా పెరిగి, పాదుల్లో గడ్డి కూడ చుట్టు ముడితే - సదరు చెట్ల క్రమబద్ధీకరణ/ సుందరీకరణలే నేటి ప్రధాన కృషి!

- ఈ మూడు చోట్లా ఏ కార్యకర్త చెమటలకూ లోపం లేదు. నలుగురి చేతులు దద్దుర్లేల వచ్చినవి వాకబు చేస్తే - అవి దోమకాటులట!

          బురదలో కష్టించే, అప్పుడప్పుడు పెంటా - పేడల్ని శుభ్రపరిచే స్వచ్ఛ సుందర కార్యకర్తలకిదేం క్రొత్త కాదు!

          నిన్న శ్రమదాతగా మారిన క్రొత్త కార్యకర్త - శివపార్వతి ఈ పూట వస్తుందా - బుధవారం నాటి పనితో ఒళ్లు నొప్పుల్తో మానేస్తుందో అని సందేహించాను గాని - ఆమె అంత దూరం నుండి రావడమూ, ప్రాత కార్యకర్తలకు తీసిపోకుండా ఉత్సాహంగా పని చేయడమూ ముదావహం!

          కోడూరు వేంకటేశ్వర కార్యకర్త గర్జించిన స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలతోనూ, శాస్త్రి గారి బిస్కట్ల పంపకంతోనూ,

          రేపటి కోసం జాతీయ రహదారిలో గంగులవారిపాలెం దగ్గరగా ఆగాలనే నిర్ణయంతోనూ 3238* వ నాటి శ్రమకు ముగింపు!

          ఏది మెరుగు ఏది తరుగు?

రాజు కొరకు ప్రాణాలను వ్రాసిచ్చిన ఆవేశమ

ఊరి కొరకు ఒక్క గంట పాటుబడే ఆదర్శమ

ఏది మెరుగు ఏది తరుగు? ఇంగితమన్నది మేల్కొని

తరచి చూస్తె బోధపడును - తాత్సారం అవసరమా?

- ఒక తలపండిన కార్యకర్త

   19.09.2024