3239* వ రోజు ... ....

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?

28=503239*

          శుక్రవారం నాటి NH 216 మీద, గంగులవారిపాలెం దగ్గర – బండ్రేవుకోడు పెద్ద వంతెన పడమరగా చల్లపల్లి కార్యకర్తల శ్రమదానం సంఖ్యలవి!

          తొలి సంఖ్య శ్రమించిన వారిదీ, 2 వది పనిగంటలదీ, మూడోది ఈ గ్రామంలో మాత్రమే జరుగ వీలున్న పనిదినాల లెక్క!

          అసలేమిటి స్వచ్ఛ సుందర కార్యకర్తలనబడే పిచ్చిమారాజుల ప్రారబ్ధం? వందల వీధులున్న – పాతికవేల జనులున్న - సదసద్వివేచనా పరులున్న ఇంత పెద్ద - ఇంత మంచి గ్రామంలో -

          వీధులూడవకపోతేనూ, మురుగులు నిలిచిపోతేనూ, బజార్ల ప్రక్క జగాలు పూర్తి లేదా పాక్షిక ఆక్రమణలకు గుర్తెతేనూ, బాహ్య మలవిసర్జనలు జరిగితేనూ, శ్మశానాల్లో సౌకర్యం లోపిస్తేనూ, బస్ ప్రాంగణాలు బోసిపోతేనూ, ఊర్లో సరే - చుట్టూ రహదార్లు కళాకాంతుల్లేక వెలవెల పోతుంటేనూ.... వీళ్లకు మాత్రమే ఏంటిటా అంత బాధ?

          “ఏం? దేశంలో వేల, లక్షల ఊళ్లు ఏలాపాలూ లేకుండా, పోలండ్, పారిస్, స్కోండినేవియా దేశాల్లో ఉన్నాయా?” అంటే ఏం చెపుతాం? ఎవరిష్టాలు వాళ్లవి, ఎవరి పిచ్చి వాళ్లకానందం!

          లేకపోతే - ఎక్కడా కనీవినీ ఎరగని ఈ స్వచ్ఛ సుందర ఉద్యమమేమిటీ? వేకువ నాల్గింటికే ఊళ్ళూనూ, చుట్టుప్రక్కలా 33 వేల చెట్లు నాటి నాటి, సంరక్షించడమేమిటీ? ఈ పనుల్లో మహిళలు కలిసి రావడమేమిటీ?

ఈ సెప్టెంబరు 20 నాడు సైతం రోజుటి వలెనే :

- తొమ్మిది మంది బండ్రేవుకోడు కాల్వగట్టున ఏడాకుల మహావృక్షాలను కూల్చడమూ, చివరి చెట్టు తొలగింపులో చిన్న అపశ్రుతీ,

- వెడల్పాటి NH 216 రహదారిని ఊడ్చి, బాగుచేయడమూ,

- ఇక - అసలైన కష్టం - ఆ రోడ్డు ఉత్తరపుటంచులోని విరబూసిన సువర్ణ గన్నేరు చెట్లు సుందరీకరణమూ, కలుపుతీతా,

- సరే - చేస్తే చేశారు - చెమటలు క్రక్కితే కక్కారు - 6.00 దాటి విజిల్ ఊదినా అంత తేలిగ్గా పనులాపని వైనమూ,

          చివరగా ఎప్పట్లాగా అందరూ అర్థవలయంగా నిలబడి, అప్పటిదాక శ్రమించిన చేతుల్లేపి, పిడికిళ్ళు బిగించి,

          ఒక ఎడమచేతి వాటం కార్యకర్త గట్టిగా చెప్పిన నినాదాలకు అంతే గట్టిగా బదులీయడమూ,

          ఇంకొకాయన నేటి కష్టాన్ని సాధికారికంగా కీర్తించి, రేపటి వేకువ శ్రమదానం కూడ NH216 - వంతెన వద్దనని ప్రకటించడమూ....

          పనీ - పాటులు లేనివాళ్లని

“ఎవరు ఈ రహదారి శ్రామికు – లెందుకీ శ్రమదాన సంస్కృతి?

వంగి - కూర్చొని బాటలన్నీ బాగుపరచే పనులివేమిటి?

పనీపాటులు లేనివాళ్లని అనుకోనేందుకు వీలు లేదే!”

అనే శంకలు బాటసారుల కగంతకులకు కలుగునేమో!

- ఒక తలపండిన కార్యకర్త

   20.09.2024