3240* వ రోజు....

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?

ఈనాటివి 3240* వ శ్రమ వేడుకలు!

            ఇది సెప్టెంబరులో ద్వితీయ పక్షం 21 వ తేదీ వ్రాస్తున్న సమయం - 5.30 AM ఇప్పటి శ్రమిస్తున్న కార్యకర్తలు 32 మంది!  స్థలం గంగులవారిపాలెపుటుత్తరపు జాతీయరహదారి!

            ఈ 32 మందీ ఏ మూలకు? ఈ బాటమీదనే వేలకు మించి కనువిందు చేసే పూల, పండ్ల చెట్లున్నవి. వాటి పాదుల్లో గాని, రోడ్డు వార పడేసిన సిమెంటు స్తంభాలను క్రమ్మేస్తూగానీ పెరిగిన గడ్డెంతుందో చూశారా? త్రాగి పడేసిన ఖాళీ మద్యం సీసాలూ, ప్లాస్టిక్ తుక్కులూ ఏరితే గోతాం నిండుతుంది.

            మరి ఈ బాధ్యతలకై వచ్చిన కార్యకర్తలూకేవలం 0.1% మంది. నిజమే పంచాయతి కార్మికులుంటారు. 100 కు పైగా రోడ్లున్న పెద్ద ఊరి శుభ్రతే  వాళ్లకు తలకు మించిన పని! మరి పాతిక వేలమంది వాడుకొంటున్న 9 రహదారులూ, కర్మల భవనాలూ, శ్మశానాలూ, తుక్కులు నింపి చెడగొడుతున్న మురుగు కాల్వలూ శుభ్రపరిచే నాధుడెవరు?

            అందుకే గదా 3240  నాళ్ళ గ్రామ సేవలూ, లెక్కేస్తే, 4 లక్షల పని గంటల పాటు  జరిగిన జరుగుతున్న ఈ అద్భుత సామాజిక  శ్రమదానం? ఈ కాస్త మంది స్త్రీ - వృద్ధ -ఉద్యోగ- కృషీవల వణిక్ప్రముఖులు తలచుకుంటేనే చల్లపల్లి ఇంత స్వచ్చ- పరిశుభ్ర-సౌందర్యంగా మారిందే అన్ని వార్డుల నుండీ  ప్రతిరోజూ కనీసం 200 మంది పూనుకొంటేనో?

            జాతీయ రహదారి ఉత్తరం కొసన ఉన్నవి ఏ పాతిక మొక్కలో కాదు- వందల్లో ! మంచి పూల చెట్ల దృశ్యం బాగుంది గాని, వాటి సంరక్షణ, పాదుల సవరణ, ప్రేమగా వాటిని పరామర్శ చేసింది ఈ 30 మంది సహృదయ స్వచ్చ కార్మికులే గదా?

            అందుకుగాను ప్రతి ఒక్కరూ ఎంతగా శ్రమించారో- బాటకు 2 గజాలు మేర గడ్డి చెక్కుతున్న, వీధిని నలు గురైదుగురు ఊడుస్తున్న, స్వార్థ రహిత  శారీరక మానసిక శ్రమ సౌందర్యం ఎంతటిదో గ్రామస్తులు పెద్దగా పట్టించుకోకున్నా - ఇటు సూర్యుడూ - అటు చంద్రుడూ చూస్తూనే ఉన్నారు.

            అందంగా - ఆనందంగా కష్టించిన కార్యకర్తలు 6.20 దాటాక ఇదే రహదారి మీద తమఈ నాటి కృషిని సమీక్షించుకొనే ముందు కాకి శివ పార్వతి గారు పలికిన  తమ ఉద్యమ సారాంశ నినాదాలకు బదులిచ్చారు.

            రేపటి తమ బాధ్యతల కోసం 216 వ రహదారి వంతెన దగ్గర కలుసుకోవాలని నిర్ణయించుకొన్నారు!

            సూర్య చంద్రుల సాక్షిగానే

అటుగ చంద్రుడు చల్లచల్లగ స్వచ్ఛ కృషి గమనించు చుండగ

తూర్పు దిక్కున ఉదయ భానుడు త్యాగముల నాశీర్వదించగ

రెండు వందల పదారవ జాతీయ మార్గపు పారిశుద్ధ్యం -

సూర్య చంద్రుల సాక్షిగానే స్వచ్చ యజ్ఞం పరిసమాప్తం!

- ఒక తలపండిన కార్యకర్త

   21.09.2024