3241* వ రోజు....

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?

                       ఆదివారమా-మజాకా ! - @3241*

          స్వచ్చ కార్యకర్తలకు  ఏ వారమూ తక్కువ కాదు, ఏ వీధి పట్లా పక్ష పాతమూ లేదు! ఎంతైనా ఆదివారం హుషారే వేరు! వివిధ బాధ్యతల వత్తిళ్లతో ప్రతి వేకువా రాలేని కొందరు ఆదివారపు శ్రమదానాన్ని మాత్రం వదలుకోరు. ప్రతి రోజూ కాకున్నా - వారంలో ఒకటో, రెండో రోజులైనా తోటి కార్యకర్తల్ని కలుసుకోనిదే-  శ్రమలో పాలు పంచుకోనిదే - కొందరి నెమ్మనములు శాంతించవు మరి!

          ఈ 22-9-24 వేకువ 417-6.10 వేళల నడుమ 2 వీధుల్లో జరిగిన గ్రామ సేవల్లో సభ్యులు మొత్తం 36 మందైతే వారిలో  బొత్తిగా క్రొత్త కార్యకర్త నారగం శ్రీనివాసరావు (మందుల షాపు ఉద్యోగి) కాగా, నడుము అనుమతించక నెల రోజులు రాని యద్దనపూడి మధు, స్థానిక పారిశ్రామిక వేత్త గుత్తికొండ కోటేశ్వర రావులు సైతం క్రొత్త వాళ్ల క్రిందే లెక్క!

          ఇద్దరు పాక్షిక అనారోగ్య పీడితులుగాని, శివపార్వతి- నారగంలు గాని వేకువ కార్యక్రమ ఎడబాటును భరించలేక వస్తున్నది దేనికి? దేవుడి పనికో- లాభసాటి వ్యాపారావకాశాలకో కాదే!  కేవలం తమ ఊరి  సామాజిక బాధ్యత కోసమే కదా!

          సరే- వస్తే వచ్చారు, చేసిందేమిటీ? శారీరక ఇబ్బందులూ, 70 ఏళ్ల వయసూ ఉన్న ఒక వ్యక్తి కత్తి దూసి, NH 216 కు ఉత్తరంగా- ఎగుడు  దిగుడు నేల మీది కలుపు చెక్కడమూ, పిచ్చిచెట్లమీద దాడి చేయడమూ!

          ఇదే బాటకు దక్షిణంగా నయన మనోజ్ఞంగా ఉన్న సువర్ణ గన్నేరు  చెట్ల  క్రింద కలుపు తొలగిస్తున్న- యంత్రంతో వీధి మార్జిన్ల గడ్డిని ఖండిస్తున్న- పొలంగట్టు  దాక శుభ్రపరుస్తున్న - చెట్లకు సుందరాకృతులు తెస్తున్న- వాళ్ళకు మంచి నీళ్లందిస్తున్న - ఫొటోలు తీస్తున్న – ఎప్పటికప్పుడు రోజువారీ కార్యక్రమాలను ఇలా నమోదు చేస్తున్న - వాళ్లు నవ యువకులేమీ కాదు- సగటున 55-60 ఏళ్ల కార్యకర్తలే !

          రోడ్డుకు ఉత్తరపు మార్జిన్లో పెళ్లీ – పేరంటం పనుల్లాగా నేలమీద కూర్చొని గడ్డిపీకే  8 మంది మహిళలు వేకువనే ఇళ్లు వదలి, ఊరు  వదలి 2-3 కిలోమీటర్ల దూరంగా రా నేల- శ్రమించనేల- అంటే ?

          మరి ఇదేనయ్యా చల్లపల్లి స్వచ్ఛ సుందరోద్యమమంటే!  ఆది తప్ప ఇప్పట్లో అంతం కనిపించని ఈ దైనందిన శ్రమదానానికి-  "సమీక్షకులూ, నిర్దేశకులూ DRK వైద్యుడైతే, లయబద్ధంగా ముమ్మారు నినాదాలు పలికి, మూడు, నాలుగు పాటలతో హుషారెక్కించినది నందేటి శ్రీనివాసుడు!

          ఈయన పాటలకు ముందో, వెనకో గాని సందు చూసుకుని పల్నాటి దంపతులు సుభద్రమ్మ గారి 5 వ వర్ధంతి జ్ఞాపకంగా – మల్లికార్జున రావు గారు పంపిన 2 వేల రూపాయల చెక్కును మేనేజింగ్ ట్రస్టీ గారికి ఇవ్వనే ఇచ్చారు.  

        రేపటి మన పనిలో మార్పేగాని- స్థలం మాత్రం గంగులవారిపాలెం రోడ్డులోని సన్ ఫ్లవర్ స్ప్లెండర్ సిటీ కి వెళ్ళు దారి వద్ద!

                    చల్లపల్లీ ! చల్లగుండుము మళ్లివస్తాం!                   

          సూక్ష్మదృక్కుల బాటసారులు సులభముగనే తెలుసుకొందురు

          "ఇంత దట్టపు పచ్చదనమా – ఇన్ని రంగుల పూల మయమా!

            అహో ! ఇది గద స్వచ్ఛ సుందర చల్లపల్లని " పట్టివేస్తురు!

            "చల్లపల్లీ ! చల్లగుండుము మళ్లివస్తాం" అనుచు వెళుదురు!.

 

- ఒక తలపండిన కార్యకర్త

   22.09.2024