3253* వ రోజు ....

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడాలి ?

3253* వ నాటి శ్రమ వివరాలివే!

            శనివారం (5.10.24) వేకువ జామున - నిర్ణీత సమయానికి ముందే - 4.20 కే డజను మంది ఊరికి 2-3 కిలో మీటర్ల దూరంగా వచ్చేశారు - 216 వ జాతీయరహదారిలో- నూకలవారిపాలెం డొంక దగ్గరికి మరో 2 డజన్ల మంది కూడ వచ్చి కలిసి, 36 మందీ 6.05  దాక ఏ విధంగా శ్రమించారో చూద్దాం!

            వారాంతమైనందునేమో - సుందరీకరణ బృందం పూర్తి స్థాయిలో వచ్చేసి, బందరు రహదారికి ఉత్తరపు భాగాన్ని మెరుగు పెట్టడానికి పూనుకొన్నారు- తమ అభిరుచికి తగ్గట్టుగా ! నిన్నా - మొన్నా ఆ భాగాన్ని శుభ్రపరచి నా సరే ఈ బృందం చూపు పడి, గంట సేపు పనిలో దిగితేచాలు- దాని కథంతా మారిపోతుంది.

            అసలైన కష్టంతో గూడిన శ్రమ జరిగింది మాత్రం క్లబ్బు రోడ్డుకు పడమర గానూ, రహదారికి దక్షిణ భాగాన! 3 గ్రామాల నుండి వచ్చి పాల్గొన్న పాతిక మందికి పైగా స్వచ్చంద శ్రమదాన శీలురు రోడ్డు మార్జిన్ దిగువన- ఒక మంచి లక్ష్యంతో కత్తులతోనూ, దంతెలతోనూ, డిప్పల్తోనూ - అదేదో వాళ్ల ఇంటి సొంత పనన్నట్లు దీక్షగా కష్టపడుతున్న దృశ్యం ఎంత నయనానందకరంగా ఉన్నదో గదా!

            వీరిలో దాదాపు అందరి బట్టలూ చెమటకు తడిసి, కొందరిని దోమలు పీకి, మహిళల  వస్త్రాలు కూడ మట్టి కొట్టుకొని, ఇంకొక ఎడుమ చేతి వీరుడి చెయ్యయితే ముళ్లు  గట్టిగా చీరుకుపోయి, నెత్తురు ధార కట్టి .. చివరికి పనైతే అనుకొన్నట్లు పూర్తయింది ! రహదారి బారునా ప్లాస్టిక్ లతో సహా వ్యర్థాలు  తొలగి, పాదుల కలుపు పోయి, రెండు ప్రక్కలా అడవి తంగేడు, ఇతర పూల- పండ్ల మొక్కలతో బాట కళకళలాడుతున్నది.

            “ఇది స్వచ్చ - సుందరోద్యమ చల్లపల్లి దగ్గరి రహదారి సుమా! అని బాటసారుల్ని హెచ్చరిస్తున్నది!

            “వెళ్లి మీ ఊళ్లను కూడ ఇలా తీర్చిదిద్దుకొండి అని సూచిస్తున్నది!

            గంటా 50 నిముషాల శ్రమానంతరం ఎవరి ముఖాల్లో నైనా  అలసట గదా కన్పించాలి! చల్లపల్లి స్వచ్ఛ కార్యకర్తల వదనాల్లో మాత్రం వారి సంతృప్తి వాళ్ల అలసటను అధిగమిస్తుంటది!

            6.30 ప్రాంతంలో 35 మంది చేత ఉద్యమ నినాదాలు పలికించే అవకాశాన్ని దేసు మాధురి సద్వినియోగించుకొన్నది.

            రేపటి శ్రమదాన పరిధి కూడ 216 వ రహదారికి చెందిన ORC రోడ్డు దగ్గరేనట!

         వైభవము సమకూరుచున్నది

ఎన్ని వందల కోట్ల వ్యయమో ఈ మహా రహదారి కోసము

ఎన్నివేలుగ వాహనములో దీనిపై పరుగెత్తుచుండును

రకరకాలుగ వృక్షసంపద, రంగు రంగుల పుష్ప విస్తృతి

 వలననే రహదారికింతటి వైభవము సమకూరుచున్నది!

- ఒక తలపండిన కార్యకర్త

   05.10.2024