3254* వ రోజు ....

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా ?

అక్టోబరులో తొలి ఆదివారపు శ్రమదాన వార్తలు-@ 3254*

            ఎప్పుడు మేల్కోని, రెండోమూడో కిలోమీటర్లు ప్రయాణించి, NH 216 లో గత కాలపు ఆఫీసర్ల క్లబ్బు రోడ్డు దగ్గరకు ఎప్పుడు చేరుకొన్నారో గాని, 4.17 కే తొలి ముఠా కనిపించింది. మిగిలిన నాలుగూళ్ల వారు కూడా చేరుకొని, ఎవరి ఆయుధాలు వాళ్లు ధరించి, 150 గజాల రహదారి కాలుష్యం మీద కత్తి గట్టినప్పుడు స్వచ్ఛ సుందర శ్రమదానం తారాస్థాయికి చేరింది!

            ఆదివారం గురించి చెప్పేదేముంది - 41 మంది చల్లపల్లి శుభ్ర సుందరీకరణకు పూనుకొన్నప్పుడు బందరు మార్గం కాలుష్యం అంతు  చూడాలనుకొని తెగబడినప్పుడు ఏం జరగాలో అదే జరిగింది!

- పిచ్చీ, ముళ్ల మొక్కలు తెగిపడ్డాయి, పూల మొక్కల పాదుల కలుపులు తప్పుకొన్నాయి, బాటకు ఉత్తర దక్షిణ దిశల్లో ఏవైనా అవకరాలుంటే చక్కబడ్డాయి!

            ఇందుగ్గాను కత్తుల్తో పాటుబడిన కార్యకర్తలు నిలబడడం మరచిపోయి, ఒంగొనీ, కూర్చొనీ, కొండొకచో మోకాళ్లా నించీ  పనిచేసుకుపోయారు.

- పని ధ్యాసలో పడి ఎవరి నడుమైనా నొప్పి వస్తేనూ, బట్టలు మట్టికొట్టుకుపోతేనూ, చేతులకు ముళ్లు గీరుకుపోతేనూ ఎవరు లెక్క చేశారుగనక!   అలాంటివి వాళ్ళకి పునఃపునరనుభవాలే మరి!

            ఇందులో ఒక ఆకుల కార్యకర్తయితే గడ్డి మిషన్ తెచ్చుకొని, ఒక్కడే 10 మంది పని చేస్తున్నాడు.

            ఆ లెక్కన ఈ ఉదయం పనివాళ్ల సంఖ్య 50 అనుకోవచ్చు ! అంటే కనీస పక్షం 60 పని గంటలనుకోండి!

            అసలీ లెక్కలకందనిది ఈ త్యాగధనుల స్వయం చైతన్యం! ఏ స్వయం ప్రేరణ లేకుండానే నాలుగైదు కిలో మీటర్ల దూరపు మంగళా పురం నుండి క్రొత్తగా ఇద్దరు కార్యకర్తలు వచ్చిచల్లపల్లి కోసం శ్రమించారా? 10 రోజుల్నుండి అస్వస్తుడై మానేసిన అడపా ఉపాధ్యాయుడు ఆగలేక వచ్చి పని చేశాడా- లేదా ?

            ఈ 41 మంది కర్మజీవుల సంగతలా ఉంచి ఎక్కడో అమెరికా- న్యూజెర్సీ దగ్గర నాదెళ్ల సురేష్ స్వచ్ఛ- సుందరోద్యమం కోసం - నవంబరు 9 నాటి పదేళ్ళ ఫంక్షన్ లో భూరి విరాళం సమర్పించేందుకు 106 కిలోమీటర్ల పరుగులు పెట్టి ధన సమీకరణకు పూనుకొన్న సంఘటన పట్ల మన గ్రామస్తుల స్పందన ఏపాటిది?

            ఈ పూట స్వచ్చ సుందరోద్యమ నినాదాల వంతు లంకే  సుభాషిణి  గారిది. అగస్టు నెలకు మనకోసం మనంట్రస్టు జమా ఖర్చుల్ని నేను  ప్రకటించగా,

            మాలెంపాటి ప్రాతూరి గోపాల కృష్ణ శాస్త్రి గారి రుచికరమైన తిను బండారాల పంపకం కూడా జరిగి,

             హుషారైన పాటతో నేటి శ్రమదానాన్ని ముక్తాయించింది నందేటి శ్రీనివాసుడు.

            రేపటి వేకువ కూడ మన శ్రమదాన కర్మక్షేత్రం NH 216 లోనే నూకలవారిపాలెం డొంక వద్దే!

             మారిపోయే కర్మజీవికె

 భిషగ్వరులో- కృషీవలురో - కేవలం గృహిణీ మతల్లులొ

 వణిక్ప్రముఖులొ - వృద్ధులో- ఉద్యోగులో ఎవరైనగానీ

 పని స్థలమున గంట సమయం స్వచ్ఛపావన కార్యకర్తగ

మారిపోయే కర్మజీవికె మరీమరీ అభివందనమ్ములు!

- ఒక తలపండిన కార్యకర్త

         06.10.2024