పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా ?
3255* వ వేకువ శ్రమ సమాచారం చిత్తగించండి!
పై సంఖ్య 7.10.24 - సోమవారానికి సంబంధించినది. నేటి 216 వ రహదారి పారిశుద్ధ్య క్రమబద్ధీకరణ/సుందరీకరణ బాధ్యులు 27 మంది. ఈ పూట వాళ్ళు ఎంచుకొన్న బాట భాగం శ్రీ చైతన్య పాఠశాల వీధి దగ్గర దక్షిణంగా!
గత 10-15 రోజుల కార్యకర్తల ప్రయత్నాన్ని పరిశీలించే వారికి అనిపించవచ్చు – “ఇన్నాళ్ళు రోజూ 50-60 పని గంటలు కష్టిస్తున్నా, కిలోమీటరు రహదారేనా బాగుపడింది? ఇలాగైతే గ్రామ వీధులన్నీ, చుట్టూ 10 రహదారులన్నీ ఎప్పటికి పూర్తయ్యేను...” అని!
అందుకే గదా - స్వచ్చ కార్యకర్తలు గ్రామ పౌర సహృదయులకు పదే పదే విన్నవించుకొనేది- “ఇది మన ఊరేస్వామీ! వీలైనప్పుడల్లా వచ్చి సహకరించండి” అని!
ఐతే ఆ సహృదయులు కార్యకర్తల కష్టాన్ని మెచ్చుతున్నారు, తోచిన మాట సాయం, ఆర్ధిక సహకారం అందిస్తున్నారు గాని - సమయదానం దగ్గరే సంశయిస్తున్నారు!
చూద్దాం! మరో పదేళ్ళ కార్యకర్తల భగీరథ ప్రయత్నానంతరమైనా “ఇంటికొకరో – వీధికొకరో ఇద్దరో – వార్డుకు పాతిక మంది చొప్పునో పౌరులు వచ్చి, కోలాహలంగా పాల్గొనక పోతారా - ఈ స్వచ్చ – సుందరోద్యమ స్వప్నం ఫలించకపోతుందా?”
ప్రభుత్వాలనూ, మేధావుల్నీ, దేశ విదేశ హరిత సౌందర్యాభిలాషుల్నీ మెప్పిస్తున్న ఈ స్వచ్చంద శ్రమదానం చల్లపల్లిలోని 100 శాతం మందిని కదిలించక మానుతుందా?
ఇక ఈ 3255* వ నాటి శ్రమదాతల పనులా – వాటికేం - భేషుగ్గా జరిగిపోయినవి! ఎందుకు జరగవు - ఈ బృందానికేం తక్కువని! నలుగురి పెట్టు పనిచేసే ఎడంచేతివాళ్లూ, రెండు కత్తుల్తోనూ ఎడాపెడా పనిచేసే వాళ్లూ, ఎక్కడ - ఏవిధంగా ఊడ్వాలో తెలిసిన ఐదుగురు మహిళలూ, మోకాళ్ళ మీద కూర్చొని ముళ్ళ కంపల్లోని కలుపు తీసే నిపుణులూ, పనిచేసే వాళ్లకు నీళ్లూ, పనిముట్లూ అందించే వృద్ధులూ, కష్టం తెలియకుండా కూనిరాగాలు తీసే గాయకులూ ఉండగా?
ఇలా చూస్తుండగానే 50-60 గజాల రాదారి మార్జిన్ బాగుపడింది. అప్పటికి బండ్రేవుకోడు కాల్వ అంచున 5 గురు చేసి రోడ్డు భద్రత కూడ ముగిసింది.
అప్పుడు అడపా వారు మైకందుకొని, శ్రమదాన సాంప్రదాయక నినాదాలూ, అబ్దుల్ కలాం గురించిన ఉటంకింపులూ విన్పించగా –
మాలెంపాటి పశు వైద్యుల వారు తన రెండు నెలలవారీ చందా మరియు మోకు కొనుగోలుకు 1,200/- మొత్తం 5,200/- ‘మనకోసం మనం’ మేనేజింగ్ ట్రస్టీ గారికి అందజేసినందుకు ధన్యవాదములు –
రేపటి మన కలయిక ఇదే 216 వ రాదారి మీదనే అనే నిర్ణయంతో వాయిదా పడెను!
లక్ష్యం దిశగా పయనం
స్వచ్చోద్యమ చల్లపల్లి జయ ప్రదమగు సమయంలో
సామాజిక బాధ్యతలను సజావుగా సాగిస్తూ
అలసి సొలయు పనుల్లోన ఆత్మ తృప్తి దక్కుతోంది
లక్ష్యం దిశగా పయనం లాభిస్తూనే ఉన్నది!
- ఒక తలపండిన కార్యకర్త
07.10.2024