3256* వ రోజు....

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?

మంగళవారం (8.10.24) వేకువ శ్రమదాన రీతులు! - @3256*

         మళ్లీ అదే NH 216 రహదారిలో 22 వ కిలోమీటరు ప్రాంతం! రెండో మూడో మార్పులు తప్ప నిన్న - మొన్నటి కార్యకర్తలే! 3 చోట్ల జరిగిన 3-4 రకాల పనులు కూడా ఇంచుమించు అవే! పని వేళ కూడ బాగా అచ్చి వచ్చిన 4.17 – 6.10 కాలమే!

         మరి – “ఈ 27 మంది జీతం - భత్వం ఆశించక కష్టించే కార్యకర్తలు వారాల తరబడీ ఒకేచోట శుభ్రపరచడం విసుగు పుట్టదా? చూసే నాబోటి వాళ్లకు బోరు కొట్టదా? ఎవరి ఆహ్లాద – ఆనంద – ఆరోగ్యాల నిమిత్తం నాలుగు లక్షల పనిగంటలుగా శ్రమిస్తున్నారో ఆ ప్రజల నుండి మిశ్రమ స్పందన మాత్రమే వస్తుంటే – నిరాశ జనించదా?..” అనే ఈ తరహా సందేహాలకు చల్లపల్లి స్వచ్చంద శ్రమదానం ఎప్పుడో బదులిచ్చేసింది!

         ‘కర్మణ్యేవాధికారస్తే మాఫలేషుకదాచన” [తే = నీకు; కర్మణ్య + ఏవ = సత్కర్మ చేయడానికి మాత్రమే; అధికారః = హక్కు ఉన్నది; ఫలేషు = కదాచన = ప్రతిఫలమాశించవద్దు!] అనే గీతాప్రవచనం వంటబట్టించుకొన్న వాళ్లకు నిరాశానిస్పృహలుంటటాయా? అలాంటి బలమైన తాత్త్విక పునాదులు లేకుండానే ఈ ఉద్యోగులూ, వృత్తికారులూ, స్త్రీ బాల వృద్ధులూ ఇంత విశిష్ట సేవాసవనం నిర్వహిస్తున్నారా?

         ఈ వేకువ కార్యకర్తల పని మొదలైన 10 నిముషాలకే వర్ష పురుషుడు ఈ నిస్వార్ధ శ్రమ పట్ల ఐదారు నిముషాలు హర్షం ప్రకటించాడు. వాతావరణం సానుకూలించి,

1) రహదారికి ఉత్తర భాగం గడ్డీగాదం తొలగించే 12 మంది ప్రయత్నమూ,

2) దక్షిణపు మార్జిన్ గడ్డిని తునాతునకలు చేస్తున్న యంత్రపు వీరవిహారమూ,

3) ఇక్కడికి కిలోమీటరు దూరంగా రోడ్డు పటిష్టతకు 6 గురి ఉద్దేశ్యమూ సాఫీగా జరిగిపోయినవి!

         ముళ్లు చీరుకుపోవడం గానీ, మోకాళ్ళో భుజాలో నొప్పుల సమాచారం గానీ లేక - నేటి 40 పైగా పని గంటల కృషి ఫలప్రదమైంది!

         కాఫీలు ముగిశాక - మైకు మరమ్మత్తులో ఉన్నందున – కోడూరు వెంకటేశ్వర నినాద ప్రకటనదారుడు కార్యకర్తల – రహదారి ప్రయాణికుల చెవుల తుప్పు వదల్చడమూ,

         నెల రోజుల తర్వాత జరగనున్న దశాబ్ది వేడుకల్ని DRK గారు ప్రస్తావించడమూ, ఆ సందర్భంలో కార్యకర్తలు సురేష్ నాదెళ్ల 106 కిలోమీటర్ల పరుగుకు చప్పట్లూ, కొన్ని విరాళాల వివరాలూ,

         మన రేపటి వేకువ పని కూడ 216 వ రహదారి వద్దననే నిర్ణయమూ!

         అందరిదీ ఆహ్లాదం

స్వచ్చోద్యమ ధాటికి నా చల్లపల్లి వీధులన్ని,

ఊరు చుట్టు రహదారులు, బస్ స్టాండులు, శ్మశానాలు,

పంట కాల్వ - మురుగు కాల్వ గట్లంతా పచ్చదనం –

అడుగడుగూ పూల వనం - అందరిదీ ఆహ్లాదం!

- ఒక తలపండిన కార్యకర్త

   08.10.2024