పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?
3257* వ నాటి శ్రమ విన్యాసాలు!
బుధునివారం (9.10.24) వేకువ నాల్గుంబావుకు ఊరికి దక్షిణాన – 216 వ జాతీయమార్గం - నూకలవారిపాలెం డొంక దగ్గరకు చేరుకున్నది అరడజను మంది మాత్రమే! అందుక్కారణం అంతకు కాస్తముందు వానభగవానుడు బాగా దబాయించడమే!
కాస్త వెనకో ముందైతే అయింది గాని, 27 మందీ సదరు సువిశాల సిమెంటు దారికీ, బండ్రేవుకోడు కాల్వ ఉత్తరపుటంచుకీ తాము చేయవలసిన సపర్యలు చేసేశారు! వానా - ఎండా - మంచుల ఉడత ఊపులకు జడిసే రకాలా ఈ స్వచ్చ కార్యకర్తలు?
ఇక ఈ వేకువ 4.17 - 6.10 సమయాల నడుమ జరిగిన శ్రమ విన్యాసాలలో నన్ను బాగా ఆకర్షించిన 3-4 సంగతులు మాత్రం పేర్కొంటాను.
- వాటిలో మొదటిది - నేను రహదారికి చేరుకోకముందే మురుగుకాల్వలో జరుగుతున్న 8 మంది శ్రమ విచిత్రం! అందులో ఇద్దరైతే మురుగు లోతులో దిగి అక్కడ పెరిగిన చెట్టు కొమ్మల్ని చెండాడి, మోకులు కట్టడమూ, బైటకు లాగి రోడ్డు పటిష్టతకు నీటి అంచున అమర్చడమూ! నీళ్ళలో పడి మునుగుతాడనేమో - ఒకాయన నడుముకు త్రాడు బిగించుకొన్న వైనం ఫొటోలో మీరూ చూడవచ్చు!
- ఇక పెద్ద రహదారి 22 వ కిలోమీటరు దగ్గర మరొక కార్యకర్త గడ్డి చెక్కుతున్న - దుమ్ములేపుతున్న యంత్రంతో చేస్తున్న సందడి రెండవది. ఇతనికి 10-12 అడుగుల దూరంగానే ఎవరైనా పని చేయగలరు!
- మూడవ దృశ్యం – ఒక పోస్టల్ ఉద్యోగి బాటకు ఉత్తరాన ముళ్ళ కంపల మధ్య పాదుల్లో కలుపు తీసి, ముళ్ళ నుండి రక్షణగా మోకాళ్ల మీద నడుచుకుంటూ పని చేసుకుపోవడం, మన ఆస్థాన ఛాయాగ్రాహకుడు – శంకర శాస్త్రి గారే ఉంటే – ఈ వీడియో మనం చూడగల్గేవాళ్లం!
- ఒకరిద్దరు కరడు గట్టిన కార్యకర్తల అరచేతుల్ని ఒక పెద్ద డాక్టరు గారు తడిమి చూసి ఎంత ధృఢంగా మారినవో – ఎన్ని కాయలు కాసినవో పరీక్షించడం!
ఆ చేతులకాయలూ, వాళ్ల ఒంటి కండలూ బహుశా, దశాబ్ద కాలంగా జరుగుతున్న “స్వచ్చ సుందర చల్లపల్లి వ్యాయామశాల”లో తయారైనవే! వాటికిక తిరుగులేదు!
మైకు లభించక - శక్తినంతా ప్రయోగించి పద్మావతీ వైద్యురాలు వినిపించిన – పలికించిన నినాదాలు కాక -
కాకలు తీరిన ఈ స్వచ్ఛ కార్యకర్తలు తమ దశాబ్ద కాలపు శ్రమజీవనానుభవాల్ని అక్షరబద్ధం చేయాలని DRK తదితరుల ఉవాచ!
ఈ ఉదయం మన శ్రమదాన ఉద్యమ ఖర్చులకు లభించిన విరాళం 1500/- విరాళ సమర్పకులు షణ్ముఖ (వేముల) శ్రీనివాస్ గారు. ఇది వారి మూడు నెలల విరాళమని తెలిసింది.
10 వ తేదీ వేకువ కూడ మన కష్టం 216 వ రహదారి – 22 వ కిలోమీటరు దగ్గరే!
ఒకే ఒక్కడు! ఒకే ఒక్కడు!!
అమెరికాలో చల్లపల్లికి ఆదరణ చేకూర్చడానికి
స్వచ్ఛ సుందర ఉద్యమానికి సానుకూలత పెంచడానికి
అగ్రరాజ్యపు జనం మధ్యన స్వచ్ఛకేతనమెగరడానికి
పరుగులెత్తిన - పరువు పెంచిన ఒకే ఒక్కడు! ఒకే ఒక్కడు!!
- నల్లూరి రామారావు
09.10.2024