పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?
3258* వ నాడు కూడ “తగ్గిందేలేదు”!
ఇది గురువారం – వేకువ – 4.20 - 6.10 నడిమి కాలపురహదారి శుభ్రతా ప్రయత్నం! ప్రయత్నీకులు 28 మంది! అడపాదడపా NH216 కు దక్షిణంగా కొందరు పనికి దిగినా, ప్రధానంగా ఉత్తరపు దిక్కునే 15 మంది శ్రమ వైభవమూ నెలకొన్నది!
ఐతే – పని గంటల్లో ఎక్కువ భాగం చిమ్మ చీకట్లోనే గడించిపోయింది! సగం మంది తల దీపాలెందుకో మినుకు మినుకుమన్నవి? వరుణుడు గారైతే ఈ ఉదయం కూడ 3 మార్లు కవ్వించాడుగాని, కార్యకర్తలు అతగాడిని ఏ మాత్రం సీరియస్ గా తీసుకోలేదు - కురిస్తే కురుసుకో పో అన్నట్లు మాననూలేదు!
ఇక - బండ్రేవుకోడు కాల్వ ఉత్తరపుటంచు రోడ్డు మీద మరీ ప్రేమను పెంచుకొన్న 5 గురు మాత్రం అక్కడి చెట్లను సుందరీకరిస్తూ, లోతట్టు పల్లాన్ని మెరక చేసి, ఆబుల్లి వీధి భద్రతకు హామీ ఇస్తూ గడిపేశారు!
పని జరుగుతున్న 3 చోట్లా - కిలోమీటరు పర్యంతమూ ఒక వృద్ధాతి వృద్ధ వైద్య కార్యకర్త మంచి నీళ్ల రవాణా చేస్తూనే ఉండెను! ఎవరికీ డీ-హైడ్రేషన్ రాకుండా ఆయన జాగ్రత్త ఆయనది మరి!
ఈపూట కూడ గడ్డి చెక్కే మిషన్ కాసేపు మొరాయించింది. ఆ యంత్రం వల్ల ఉత్పన్నమయిన గడ్డి పరకల్ని, రాతి ముక్కల్నీ 3 గ్గురు ఊడుస్తూనే ఉన్నారు.
ఇవాల్టితో మురుగు వాగు మీది బారు వంతెన దాక పూర్తిగా శుభ్రపడుతుందనే కొందరి అంచనా తప్పింది.
10 కత్తులు ఛేదించిన గడ్డీ, జొన్న ఒకాయన వచ్చి గేదెల కోసం 2 మోపులు పట్టుకుపోయి సద్వినియోగించాడు.
6.20 కి కాఫీ ఆనందం ముగిశాక - నేటి కృషి సమీక్షానందం మొదలై, నూతక్కి శివబాబు ముమ్మారు వల్లించిన స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలు ప్రతిధ్వనించి, DRK గారి ఆశ్చర్యానందాలు ప్రకటితమై, ఆపైన గురవయ్య గారి సూక్తిముక్తాలు వినపడ్డవి.
నిన్న హాజరు కాలేకపోయిన మన భారీ కార్యకర్త కోడూరు వేంకటేశ్వర మహోదయుడు నేడు రోడ్డు దిగువన పనులు విరగదీసింది గాక, తన నెలవారీ చందా 520/- ను స్వచ్చోద్యమ ఖర్చుల నిమిత్తం సమర్పించడం గమనించండి.
అప్పుడు ఆకాశంలో రంగుల హరివిల్లును అందరూ తిలకించి,
రేపటి పనిస్థలం NH 216 – 22 వ కిలోమీటరు వద్దనని సంకల్పించుకొని, గృహోన్ముఖులయ్యారు!
సొంతూరి కోసం సర్వ శక్తులు ఒడ్డుటంటే
ఒట్టి మాటలు కాదు - ఊరికి గట్టి మేల్ తలపెట్టె నాతడు
ఊరికై తన పరిచయాలను, పలుకు బడినీ వాడె నాతడు
అది గదా సొంతూరి కోసం సర్వ శక్తులు ఒడ్డుటంటే!
జన్మనిచ్చిన తల్లిదండ్రికి, చల్లపల్లికి ధన్యతంటే!
- నల్లూరి రామారావు
10.10.2024